పది రోజులైనా కొనుగోళ్లు నిల్
ఫ మొన్నటి వరకు క్వింటారూ.9,300.. ఇప్పుడు రూ.8,600
ఫ ఒక్కసారిగా ధర తగ్గించేసిన వ్యాపారులు
ఫ సీసీఐ కేంద్రాలు ప్రారంభించి పది రోజులైనా ఒక్క క్వింటా కొనలే..
ఫ దిగుబడి తగ్గడంతో ధర
పెరుగుతుందని రైతుల ఆశాభావం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పత్తి రైతులకు ఈసారి ఆశించిన ధర దక్కడం లేదు. మొదట్లో ప్రైవేట్ వ్యాపారులు క్వింటాకు రూ.9 వేల నుంచి రూ.9,300 వరకు ధర చెల్లించడంతో రైతులు సంతోషించారు. మూడు రోజుల వ్యవధిలోనే వ్యాపారులు ధరను ఒక్కసారిగా తగ్గించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం నాణ్యమైన పత్తికి సైతం రూ.8,600 నుంచి రూ.8,700 మాత్రమే చెల్లిస్తున్నారు. మరోవైపు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్రకటించిన మద్దతు ధర కూడా ఆశించిన స్థాయిలో లేదు. దీంతో సీసీఐ కేంద్రాలు ప్రారంభమై 10 రోజులు దాటినా కొనుగోళ్లు లేక వె లవెలబోతున్నాయి. ధర మరింత పెరుగుతుందన్న ఆశతో కొందరు రైతులు పత్తిని నిల్వ చేసుకుంటున్నారు.
తగ్గిన ధర.. పెరిగిన ఆందోళన
ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో పత్తి దిగుబడి గణనీయంగా తగ్గింది. 5,93,795 ఎకరాల్లో పత్తి వేశారు. 3,56,257 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి 2 లక్షల క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదని రైతులు వాపోతున్నారు. పెట్టుబడులు పెరిగాయి. దిగుబడి తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో పత్తికి క్వింటాకు కనీసం రూ.10 వేలు లభిస్తేనే కొంతమేర నష్టాలను అధిగమించవచ్చని రైతులు భావిస్తున్నారు. తొలుత రూ.9,300 వరకు ధర పెట్టిన వ్యాపారులు.. నాణ్యత లేదన్న సాకుతో ధర తగ్గించి.. క్వింటాకు రూ.8300 ఇస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. వర్షాభావంతో దిగుబడి తగ్గిన నేపథ్యంలో మద్దతు ధర పెంచాలని, సీసీఐ కొనుగోళ్ల నిబంధనలను సులభతరం చేయాలని రైతులు కోరుతున్నారు.
సీసీఐ కేంద్రాలకు వెళ్లని రైతులు
సీసీఐ మద్దతు ధర క్వింటాకు రూ.8,667 ఉండగా, ప్రైవేట్ వ్యాపారులు తొలుత అంతకంటే ఎక్కువ ధర చెల్లించారు. దీంతో రైతులు సీసీఐ కేంద్రాల వైపు చూడలేదు. సీసీఐలో పత్తి విక్రయించాలంటే స్లాట్‌బుక్ చేసుకోవడం, ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసుకోవడం, లోడింగ్‌కు కూలీల ఖర్చు భరించడం వంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. క్వింటాకు రూ.200కు పైగా అదనపు ఖర్చు అవుతోంది. ప్రైవేటు వ్యాపారులకై తే గ్రామాల్లోనే విక్రయించే అవకాశం ఉండటంతో ఊళ్లోనే అమ్మేందుకు మొగ్గు చూపుతున్నారు.
చిట్యాల మండలం పెద్దకాపర్తిలోని కావేరి కాటన్ మిల్లులో గత నెల 22న సీసీఐ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు ఐదుగురు రైతులు స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ ఒక్కరూ పత్తిని కేంద్రానికి తీసుకురాలేదు. చండూరు మండలం బంగారిగడ్డలోని మంజీత్ మిల్లులోనూ గత నెల 25 సీసీఐ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు ఒక్క క్వింటా పత్తి కూడా కొనుగోలు చేయలేదని మునుగోడు సీసీఐ అధికారి బాలచందర్ నింజా తెలిపారు. మరోవైపు తాస్కానిగూడెంలోని వరలక్ష్మీ కాటన్ మిల్లులో ప్రైవేట్‌గా ఇప్పటివరకు 3 వేల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు.


