ఖర్చుకు ముందే.. బిల్లు పెట్టాలట! | - | Sakshi
Sakshi News home page

ఖర్చుకు ముందే.. బిల్లు పెట్టాలట!

Nov 5 2026 1:40 AM | Updated on Nov 5 2026 1:40 AM

జిల్లాకు రూ.3.79 కోట్ల గ్రాంట్‌..

నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ కోసం విడుదలైన గ్రాంట్ల వినియోగం ప్రధానోపాధ్యాయులకు తలనొప్పిగా మారింది. పాఠశాలల అవసరాల కోసం కేటాయించిన నిధులను ఈ నెల 15వ తేదీలోగా ఖర్చు చేసి, సంబంధిత బిల్లులు సమర్పించాలని విద్యాశాఖ ఆదేశించడంతో హెచ్‌ఎంలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే చేసిన ఖర్చులకు బిల్లులు సమర్పించడంతోపాటు, ఇంకా ఖర్చు చేయాల్సిన నిధులకు కూడా ముందస్తుగా బిల్లులు సిద్ధం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గడువులోగా బిల్లులు సమర్పించకపోతే రెండో విడత గ్రాంట్లు నిలిచిపోయే అవకాశం ఉండటంతో ప్రధానోపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

15లోగా బిల్లులు ఇవ్వాల్సిందే..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఈ గ్రాంట్లను నిర్ణీత గడువులోగా వినియోగించి, ఖర్చులకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. ఈ నెల 15వ తేదీని గడువుగా నిర్ణయించడంతో హెచ్‌ఎంలు హడావుడి పడుతున్నారు. బిల్లులు సమర్పిస్తేనే తదుపరి విడత గ్రాంట్లు విడుదలయ్యే అవకాశం ఉంది. లేనిపక్షంలో రెండో విడత నిధులు నిలిచిపోయే పరిస్థితి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు.

ఖర్చు చేయకుండానే బిల్లులెలా?

వాస్తవానికి పాఠశాలలకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత బిల్లులు సమర్పించడం సాధారణ విధానం. అయితే ప్రస్తుతం అమలవుతున్న కొత్త చెల్లింపుల విధానంలో వెండర్‌ వివరాలు సేకరించి, వారి ఖాతాల్లోనే నగదు జమ చేసేలా మార్పులు చేశారు. దీంతో పాఠశాల అవసరాలకు అనుగుణంగా కొనుగోళ్లు చేయడం, బిల్లులు సమర్పించడం విషయంలో ప్రధానోపాధ్యాయులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంకా కొనుగోలు చేయని వస్తువులకు ముందుగానే బిల్లులు ఎలా సమర్పించాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు గడువు, మరోవైపు రెండో విడత గ్రాంట్లు నిలిచిపోతాయనే ఆందోళనతో హెచ్‌ఎంలు తలలు పట్టుకుంటున్నారు.

ఫ రూ.3.79 కోట్ల స్కూల్‌ గ్రాంట్లు విడుదల

ఫ 15వ తేదీలోగా ఖర్చుల వివరాలు ఇవ్వాలని ఆదేశం

ఫ బిల్లులు సమర్పిస్తేనే రెండో విడత నిధులు

ఫ కొనుగోలు చేయకముందే బిల్లు ఎలా పెట్టాలంటున్న హెచ్‌ఎంలు

నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు వివిధ కేటగిరీల కింద సుమారు రూ.3.79 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఇందులో కాంపోజిట్‌ స్కూల్‌ గ్రాంట్‌ కింద రూ.2.63 కోట్లు, స్పోర్ట్స్‌ గ్రాంట్‌ కింద రూ.1.08 కోట్లు, గర్‌ల్స్‌ అండ్‌ చైల్డ్‌ ఎంపవర్‌మెంట్‌ గ్రాంట్‌ కింద రూ.7.12 లక్షలు కేటాయించారు. ఈ నిధులు సుమారు రెండు నెలల క్రితమే పాఠశాలలకు చేరాయి. పాఠశాలల నిర్వహణ, క్రీడా సామగ్రి కొనుగోలు, బాలికలు, చిన్నారుల సాధికారత కార్యక్రమాలకు వీటిని వినియోగించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement