మరణ ధ్రువీకరణ మాయాజాలం | - | Sakshi
Sakshi News home page

మరణ ధ్రువీకరణ మాయాజాలం

Nov 5 2026 1:40 AM | Updated on Nov 5 2026 1:40 AM

తొలుత డిసెంబర్‌లోనే దరఖాస్తు.. జనవరిలో తిరస్కరణ..

నల్లగొండ టూటౌన్‌ : వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి పదవీ విరమణ పొందాక మృతిచెందాక తప్పుడు తేదీతో జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రం వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అతనికి రెండు రోజుల వ్యవధిలోనే రెండు చిరునామాలతో రెండు మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన నీలగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పేరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మొదట ఒక వార్డు ఆఫీసర్‌ తిరస్కరించిన ఫైల్‌ను మరో వార్డు ఆఫీసర్‌ చేత సంతకం చేయించింది ఎవరు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తిరస్కరించిన ఫైల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కనిపించకుండా పోవడం వెనుక ఉన్న అదృశ్య శక్తి ఏదీ అనే కోణంలో విచారణ జరపాల్సి ఉంది. కానీ, ఓ చిన్న ఉద్యోగిపై నెపం నెట్టి మమ అనిపించేందుకు ఓ ఉన్నతాధికారి సిద్ధమైనట్లు విశ్వనీయ వర్గాల తెలిసింది.

నల్లగొండ చిరునామాతో దరఖాస్తు..

నకిరేకల్‌కు చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి, సీహెచ్‌.వెంకటేశ్వర్లు సూర్యాపేటలో 2025 నవంబర్‌ 17న మృతిచెందాడు. మరణ ధ్రువీకరణ పత్రం కోసం ఆన్‌లైన్‌ ద్వారా నీలగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కార్యాలయంలో ఆయన సతీమణి వసంత దరఖాస్తు చేసుకున్నారు. నీలగిరి నగరంలోని 10వ డివిజన్‌, ఇంటి నంబర్‌ 4–11–500/1, న్యూ చైతన్యపురి కాలనీ, డీవీకే రోడ్‌, పిన్‌ కోడ్‌ 508001 అనే చిరునామాతో దరఖాస్తు చేశారు. దీనిని 9–03–2026 రోజున ఆన్‌లైన్‌ చేసి 10వ తేదీ రాత్రి 8 గంటలకు వెంకటేశ్వర్లు 2025మే 28న మృతిచెందినట్లు సర్టిఫికెట్‌ జారీ చేశారు.

రెండు రోజుల తేడాతో మరో సర్టిఫికెట్‌..

రెండు రోజుల తేడాతో చిరునామా మార్చి రెండో మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. మార్చి 11వ తేదీన ఇంటి నంబర్‌ 11–150/ఏ, శివాజీనగర్‌, నకిరేకల్‌ అని చిరునామా మార్చాలని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. పైచిరునామాతో 13వ తేదీన మళ్లీ మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. ఇక్కడ మాత్రం పిన్‌కోడ్‌ నమోదు చేయలేదు. వార్డు ఆఫీసర్‌ ప్రమేయం లేకుండానే ఇక్కడ చిరునామా మార్చి రెండో మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. ఇలా రెండు సర్టిఫికెట్లు ఎందుకు జారీ చేయాల్సి వచ్చింది.. చిరునామా ఎవరు మా ర్చారు.. ఎందుకు మార్చాల్సి వచ్చింది.. మార్చిన అక్రమార్కులు ఎవరు.. ఎందుకు ఈ తతంగం చేశారనే ప్రశ్నలు వస్తున్నాయి.

ఫ నీలగిరి కార్పొరేషన్‌లో రెండు రోజుల తేడాతో రెండు డెత్‌ సర్టిఫికెట్లు జారీ

ఫ వార్డు ఆఫీసర్‌ ప్రమేయం లేకుండానే మారిన చిరునామా

ఫ రూ.లక్షలు తిని.. లక్షణంగా మార్చేశారని ఆరోపణలు

ఈ రిటైర్డ్‌ ఉద్యోగికి మరణ ధ్రువీకరణ పత్రం కోసం 2025 డిసెంబర్‌లో తొలుత దరఖాస్తు చేసుకున్నారు. 10వ డివిజన్‌ వార్డు ఆఫీసర్‌ దానికి ఏదో కారణం చూపుతూ 2026 జనవరిలో దాన్ని తిరస్కరించి మున్సిపల్‌ కార్యాలయంలోని ఇన్‌వార్డులో కూడా రాసినట్లు తెలిసింది. దరఖాస్తు చేసినప్పటి కమిషనర్‌ సయ్యద్‌ ముసాబ్‌ అహ్మద్‌ బదిలీఅయి కొత్తగా.. శరత్‌చంద్ర కమిషనర్‌గా వచ్చాక ఈ ఏడాది మార్చిలో మరో దరఖాస్తు పెట్టించారు. అయితే 10 డివిజన్‌ ఆఫీసర్‌ తన సోదరుడి వివాహం ఉండడంతో సెలవుపై వెళ్లిన రోజు చూసి మరణ ధ్రువీకరణ పత్రం అత్యవసరం అని మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని ఓ కీలక ఉద్యోగి 25వ డివిజన్‌ వార్డు ఆఫీసర్‌ చేత విచారణ రిపోర్ట్‌పై సంతకం చేయించినట్లు తెలిసింది. ఈ తతంగంలో కీలక సూత్రధారి తప్పించుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేసి చిరు ఉద్యోగి మీదకి నెట్టుతున్నట్లు కార్యాలయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement