ఎన్‌వీడియా సీఈఓపై.. రాజుల కాలం నాటి వ్యూహంతో చైనా పన్నాగం | The Ancient Strategy China Used Against Nvidia CEO | Sakshi
Sakshi News home page

ఎన్‌వీడియా సీఈఓపై.. రాజుల కాలం నాటి వ్యూహంతో చైనా పన్నాగం

Nov 12 2026 1:59 AM | Updated on Nov 12 2026 2:16 AM

The Ancient Strategy China Used Against Nvidia CEO

వాషింగ్టన్‌ : టెక్ ఆధిపత్య పోరులో భాగంగా పాత కాలపు వ్యూహాలకు మళ్లీ తెరలేచింది. ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా టెక్నాలజీ,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని గురిపెట్టేందుకు చైనా నిఘా వర్గాలు అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. కేవలం డిజిటల్ హ్యాకింగ్, సైబర్ దాడులకే పరిమితం కాకుండా.. మనుషుల బలహీనతలను ఆసరాగా చేసుకుని, వ్యక్తిగత సంబంధాలు, అఫైర్లు, హనీట్రాప్ పద్ధతుల ద్వారా కీలక రహస్యాలను తస్కరిస్తున్న ఉదంతం ప్రస్తుతం అమెరికాలో కలకలం రేపుతోంది.

అమెరికాలోని సిలికాన్ వ్యాలీ, ప్రముఖ టెక్ కంపెనీల అధిపతులు, టాప్ ఇంజనీర్లు, సైంటిస్టులు ప్రధాన లక్ష్యంగా చైనా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ  ఈ ఆపరేషన్లకు పాల్పడుతున్నట్లు యూఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. అత్యంత సున్నితమైన రీసెర్చ్ డేటా, అత్యాధునిక ఏఐ చిప్స్  తయారీ సాంకేతికతను రాబట్టేందుకు నిఘా వర్గాలు ఆకర్షణీయమైన మహిళలను పావులుగా మారుస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

పాత కాలపు వ్యూహమే.. కానీ సరికొత్త రూపంలో!
చరిత్రలో గూఢచర్యానికి ఎలాగైతే ‘సె* అండ్ లైస్’ ఆయుధాలుగా వాడారో, ఇప్పుడు సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజాలపై కూడా అదే పద్ధతిని ప్రయోగిస్తున్నారు. చూడటానికి అత్యంత ఆకర్షణీయంగా ఉండే మహిళలు టెక్ నిపుణులతో పరిచయాలు పెంచుకోవడం, వ్యాపార సంబంధాలు ఏర్పరచుకోవడం, క్రమేణా వాటిని వ్యక్తిగత సాన్నిహిత్యంగా మార్చుకోవడం వంటి పథకాల ద్వారా రహస్య సమాచారాన్ని తస్కరిస్తున్నట్లు బయటపడింది.

ఇటీవలి కాలంలో ప్రపంచ ప్రఖ్యాత చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ వివాదంలో చిక్కుకోవడం ఈ కోవకే చెందుతుందనే చర్చ అంతర్జాతీయ మీడియాలో జరుగుతోంది. చైనా నిఘా వర్గాలతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళలతో ఏర్పడిన సాన్నిహిత్యం టెక్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది.

అమెరికా నిఘా వర్గాల ఆందోళన
అమెరికా టెక్నాలజీ గుండెకాయ లాంటి సిలికాన్ వ్యాలీలో ఈ తరహా గూఢచర్య కార్యకలాపాలు విపరీతంగా పెరిగిపోయాయని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇతర భద్రతా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌ల ద్వారా ఉద్యోగార్ధుల ముసుగులో, వ్యాపార వేదికల ద్వారా ఈ  హనీట్రాప్ ఏజెంట్లు టెక్ నిపుణులకు గాలం వేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

అమెరికా-చైనా మధ్య సాంకేతిక ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిన వేళ, ఈ హనీట్రాప్ వివాదాలు వాషింగ్టన్‌ను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. భవిష్యత్తులో అమెరికా జాతీయ భద్రతకు, టెక్ గుత్తాధిపత్యానికి ఇది పెను ప్రమాణంగా మారుతుందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement