ఓటమి వేళ ట్రంప్‌కు మరో పరీక్ష.. యుద్ధానికి ముగింపు పలికేనా? | Russia Ukraine hold first peace talks Trump pushes for deal | Sakshi
Sakshi News home page

ఓటమి వేళ ట్రంప్‌కు మరో పరీక్ష.. యుద్ధానికి ముగింపు పలికేనా?

Nov 11 2026 8:06 AM | Updated on Nov 11 2026 8:06 AM

Russia Ukraine hold first peace talks Trump pushes for deal

అబుదాబి: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం దౌత్య ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి తర్వాత తొలిసారిగా రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో ప్రత్యక్షంగా సమావేశమై శాంతి చర్చలు జరిపారు. తొలి విడత చర్చలు సానుకూలంగా, నిర్మాణాత్మకంగా సాగినట్లు అమెరికా ప్రకటించగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ కూడా చర్చలపై ఆశాభావం వ్యక్తం చేశారు. రెండో విడత చర్చలు బుధవారం కొనసాగనున్నాయి.

ఈ చర్చల్లో అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ పాల్గొన్నారు. యుద్ధ ఖైదీల విడుదల, మానవతా అంశాలు, ఉక్రెయిన్ భద్రత, భవిష్యత్తులో రష్యా నుంచి మళ్లీ దాడులు జరగకుండా తీసుకోవాల్సిన దీర్ఘకాలిక భద్రతా హామీలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తొలి విడత చర్చలు చాలా ఉత్పాదకంగా సాగాయని పేర్కొన్నారు. అయితే సమావేశంలో ఏయే అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందనే వివరాలను వెల్లడించలేదు.

డెన్మార్క్‌లో మీడియాతో మాట్లాడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. అమెరికా ప్రతినిధుల నుంచి అందిన సంకేతాలు తనకు సానుకూలంగా ఉన్నాయని తెలిపారు. చర్చల్లో మార్పు కనిపిస్తోందని, ఇప్పటివరకు వచ్చిన పరిణామాలపై సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు. యుద్ధ ఖైదీల విడుదల తమకు అత్యంత ప్రాధాన్యమని జెలెన్‌స్కీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వెల్లడించారు. ఉక్రెయిన్‌కు కల్పించాల్సిన భద్రతా హామీల స్వరూపం, అవి దీర్ఘకాలం అమలులో ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై ప్రతినిధులు విస్తృతంగా చర్చించారని తెలిపారు.

అమెరికా ప్రతినిధి జారెడ్ కుష్నర్ కూడా చర్చల పురోగతిపై ఆశాభావం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వం, భద్రత, అభివృద్ధికి భరోసా కల్పించడంతో పాటు యూరప్‌లో శాశ్వత శాంతి నెలకొల్పేందుకు అమెరికా కృషి చేస్తోందని పేర్కొన్నారు. అయితే రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్‌కోవ్ మాత్రం రెండో విడత చర్చలు పూర్తయ్యే వరకు ఫలితాలపై ఎలాంటి అంచనాలకు రావడం తొందరపాటేనని వ్యాఖ్యానించారు.

భూభాగం, నాటో సభ్యత్వమే ప్రధాన అడ్డంకులు
శాంతి చర్చలు తిరిగి ప్రారంభమైనప్పటికీ రష్యా, ఉక్రెయిన్ మధ్య కీలక అంశాలపై విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా భూభాగాల అప్పగింత, నాటో సభ్యత్వం, ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు ప్రధాన సమస్యలుగా మారాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ భూభాగంలో దాదాపు ఐదో వంతు రష్యా ఆధీనంలో ఉంది. తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతంపై రష్యా తన పట్టును మరింత బలపరచాలని భావిస్తోంది. ఈ ప్రాంతాన్ని పూర్తిగా అప్పగించాలన్న మాస్కో డిమాండ్‌ను జెలెన్‌స్కీ అంగీకరించడం లేదు. తమ సైనికులు పోరాడి కాపాడుకున్న భూభాగాన్ని వదులుకునే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ స్పష్టం చేస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరాలన్న ఆకాంక్షను విరమించుకుని తటస్థ దేశంగా ఉండాలని రష్యా కోరుతోంది. భవిష్యత్తులో మరోసారి రష్యా దాడి జరగకుండా తమకు పటిష్ఠమైన అంతర్జాతీయ భద్రతా హామీలు కావాలని ఉక్రెయిన్ పట్టుబడుతోంది.

యుద్ధాన్ని ముగించేందుకు ఒప్పందానికి రావాలని ట్రంప్ ఉక్రెయిన్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు వార్తలు వెలువడ్డాయి. గత వారం ఈ యుద్ధం ముగింపునకు సంబంధించి ఒక భారీ ఒప్పందం దాదాపు సిద్ధమవుతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే గతంలోనూ ఆయన చేసిన శాంతి ప్రయత్నాల ప్రకటనలు ఆచరణలో ఫలించలేదు.

మరోవైపు శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ యుద్ధభూమిలో మాత్రం దాడులు కొనసాగుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ నగరాలు, విద్యుత్, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను కొనసాగిస్తోంది. దీనికి ప్రతిగా ఉక్రెయిన్-రష్యా చమురు శుద్ధి కర్మాగారాలు, ఇతర వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులను తీవ్రతరం చేస్తోంది. రష్యా దాడులు ఉక్రెయిన్ ఇంధన వ్యవస్థను దెబ్బతీస్తున్న నేపథ్యంలో గగనతల రక్షణ వ్యవస్థలకు అవసరమైన ఇంటర్‌సెప్టర్ల సరఫరాను వేగవంతం చేయాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోను కోరినట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రి సిబిహా తెలిపారు. శాంతి దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తూనే రష్యాపై ఒత్తిడి కూడా కొనసాగించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌ రాజకీయాల్లో కొత్త రగడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement