అమెరికాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. కనిపించకుండా పోయిన 11 నెలల బాలుడు దాదాపు 24 గంటల పాటు భూమిలో పాతిపెట్టిన స్థితిలో ఉన్నప్పటికీ ప్రాణాలతో బయటపడ్డాడు. దక్షిణ కరోలినా రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో ఓ కుక్కను ఉంచే ఇనుప బోనులో బాలుడిని పెట్టి మట్టితో కప్పేశారు. దాదాపు ఒక అడుగు లోతులో పాతిపెట్టిన ఆ బోను నుంచి చిన్నారి ఏడుపు వినిపించడంతో సహాయక సిబ్బంది అతడిని గుర్తించారు.
బాలుడిని కోయా షార్ప్‌గా గుర్తించారు. మంగళవారం మధ్యాహ్నం అతడిని గుర్తించే సమయానికి ఓ టవల్‌లో చుట్టి బోనులో ఉంచారు. అప్పటికే బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ ప్రాణాలతో ఉన్నాడు. సహాయక సిబ్బంది తవ్వకాలు చేపడుతున్న సమయంలో బోను లోపలి నుంచి ఏడుపు వినిపించింది. వెంటనే అతడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
లెక్సింగ్టన్ కౌంటీ షెరీఫ్ జే కూన్ ఈ ఘటనపై స్పందిస్తూ.. ‘‘దేవుడు నిజంగా గొప్పవాడు. కొద్దిసేపటి క్రితమే 11 నెలల చిన్నారి కోయాను ప్రాణాలతో కనుగొన్నాం. సజీవంగా పాతిపెట్టినప్పటికీ ప్రాణాల కోసం పోరాడుతూ ఏడుస్తున్నాడు’’ అని పేర్కొన్నారు.
దాదాపు 100 మంది పోలీసు, అత్యవసర సహాయక సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. బాలుడి తండ్రి తరఫు తాత ఇంటికి సుమారు 45 మీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో ఇటీవల తవ్విన ఆనవాళ్లను అధికారులు గుర్తించారు. బోను చుట్టూ చుట్టిన టవల్ కారణంగా లోపలికి కొంత గాలి చేరి ఉండవచ్చని, అది చిన్నారి ప్రాణాలతో బయటపడటానికి దోహదపడి ఉండవచ్చని షెరీఫ్ తెలిపారు.
ఏయే పరిణామాలు చోటుచేసుకున్నాయి?
విచారణ వివరాల ప్రకారం.. సోమవారం తండ్రి తరఫు నానమ్మ సంరక్షణలో ఉన్న సమయంలో బాలుడు కనిపించకుండా పోయాడు. మైఖేల్ కామర్ (25) ఇంటికి వచ్చి చిన్నారిని చూసుకుంటున్నాడు. నానమ్మ ఓ పనిమీద బయటకు వెళ్లిన సమయంలో అతడు బాలుడితో ఉన్నాడు. అయితే మరో సంరక్షకుడు బాధ్యతలు తీసుకునేందుకు వచ్చినప్పుడు కామర్, చిన్నారి ఇద్దరూ కనిపించలేదు.
కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో గాలింపు మొదలైంది. కామర్ తండ్రికి చెందిన ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని, లోపల చిన్నారి వస్తువులు కనిపించడాన్ని పోలీసులు గుర్తించారు. అయితే తండ్రీకొడుకుల ఆచూకీ లభించలేదు. నిఘా కెమెరాల దృశ్యాలను పరిశీలించగా, కామర్ చిన్నారి లేకుండా పలు ప్రాంతాల్లో కనిపించినట్లు తెలిసింది.
సోమవారం రాత్రి బేట్స్‌బర్గ్‌లోని ఓ ఆస్తి ప్రాంగణంలో ఉన్న భవనంలో కామర్‌ను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. చొరబాటు, అరెస్టును అడ్డుకోవడం వంటి అభియోగాలు నమోదు చేశారు. అయితే అప్పటికి బాలుడు అతడి వద్ద లేడు. మంగళవారం కూడా కొనసాగిన గాలింపులో చిన్నారి ఆచూకీ లభించింది.
కామర్‌పై మరిన్ని అభియోగాలు నమోదు చేయాలా అనే విషయంపై న్యాయవాదులతో అధికారులు చర్చిస్తున్నారు. మరోవైపు కోయా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. అతడు పూర్తిగా కోలుకోవాలని వైద్యులు, అధికారులు ఆశిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.


