అభిశంసన అస్త్రానికి బ్రేక్‌.. పీట్‌ హెగ్సెత్‌కు బిగ్‌ రిలీఫ్‌ | Us House Blocks Bid To Impeach Defence Secretary Pete Hegseth | Sakshi
Sakshi News home page

అభిశంసన అస్త్రానికి బ్రేక్‌.. పీట్‌ హెగ్సెత్‌కు బిగ్‌ రిలీఫ్‌

Nov 11 2026 11:13 AM | Updated on Nov 11 2026 11:27 AM

Us House Blocks Bid To Impeach Defence Secretary Pete Hegseth

వాషింగ్టన్‌: అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌కు ప్రస్తుతానికి భారీ ఊరట లభించింది. ఇరాన్‌పై కాంగ్రెస్‌ అనుమతి లేకుండా యుద్ధం చేస్తున్నారన్న ఆరోపణలతో ఆయనను పదవి నుంచి తొలగించేందుకు చేపట్టిన అభిశంసన ప్రయత్నం విఫలమైంది. అభిశంసన ప్రయత్నం విఫలం కావడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోషల్‌ మీడియా వేదిక ట్రూత్‌ సోషల్‌లో స్పందించారు. అభిశంసన ప్రయత్నం ఘోరంగా విఫలమైందన్న ట్రంప్‌.. వెనిజులా, ఇరాన్‌లలో ఆయన సాధించిన విజయాలను ప్రస్తావించారు.

డొనాల్డ్ ట్రంప్.. హెగ్సెత్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించడంతో రిపబ్లికన్ సభ్యులు ఈ తీర్మానాన్ని అడ్డుకున్నారు. ట్రంప్ మద్దతుతో హెగ్సెత్ ‘అభిశంసన’ గండం నుంచి బయటపడ్డారు. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన కెంటకీ ఎంపీ థామస్‌ మాసీ ఈ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే, తీర్మానాన్ని రిపబ్లికన్ల ఆధిపత్యంలోని హౌస్‌ జ్యుడీషియరీ కమిటీకి పంపించేందుకు మంగళవారం జరిగిన ఓటింగ్‌లో 211 మంది అనుకూలంగా, 204 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ ఓటింగ్‌కు 11 మంది డెమొక్రాట్లతో సహా పలువురు సభ్యులు గైర్హాజరయ్యారు. తీర్మానాన్ని కమిటీకి పంపించడమంటే ప్రస్తుతానికి అభిశంసన ప్రక్రియకు తెరపడినట్లే.

ఆరు నెలల విరామం తర్వాత పెంటగాన్‌లో తొలిసారిగా మీడియా సమావేశం నిర్వహించిన హెగ్సెత్‌.. తనపై అభిశంసన ప్రయత్నాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. రాజకీయ కుట్రగా అభివర్ణించారు. ట్రంప్‌ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న ఓ రాజకీయ ప్రత్యర్థి చేపట్టిన చర్యగా పేర్కొన్నారు. ఈ తీర్మానం జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తుందని అన్నారు. చట్టబద్ధమైన సైనిక చర్యలు విజయవంతంగా నిర్వహించినందుకు అమెరికా తన సైనికులను, పౌర నాయకత్వాన్ని శిక్షిస్తుందనే సంకేతాలు శత్రు దేశాలకు వెళ్తాయని వ్యాఖ్యానించారు. ఇది దేశభక్తి కాదని, విధ్వంసక చర్య అని మండిపడ్డారు.

సోమవారం ప్రతినిధుల సభలో అధికారికంగా ప్రవేశపెట్టిన ఎనిమిది అభిశంసన ఆరోపణల్లో మాసీ పలు అంశాలను ప్రస్తావించారు. కాంగ్రెస్‌ అనుమతి లేకుండానే 90 రోజులకు పైగా ఇరాన్‌తో యుద్ధం కొనసాగించడం ద్వారా హెగ్సెత్‌ చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపించారు. ఇందుకు ఆయన బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు.

మరో వైపు, ఓటింగ్‌ ఫలితంపై మాసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫలితం ఊహించిందే అయినప్పటికీ నిరాశకు గురయ్యా.. ఏం చేయాలో కాంగ్రెస్‌ సభ్యులకు తెలుసని, కానీ రాజకీయంగా ప్రయోజనం ఉన్నప్పటికీ ఆ నిర్ణయం తీసుకునే ధైర్యం చేయలేకపోతున్నారని విమర్శించారు. ప్రస్తుతానికి అభిశంసన గండం నుంచి బయటపడినప్పటికీ హెగ్సెత్‌ భవిష్యత్తుపై అమెరికా రాజకీయాల్లో చర్చ కొనసాగుతోంది. ఆయనను ట్రంప్‌ తొలగించవచ్చని, స్వయంగా రాజీనామా చేయవచ్చని రిపబ్లికన్‌ సెనేటర్‌ టెడ్‌ క్రూజ్‌ మంగళవారం అంచనా వేశారు.

ఇదీ చదవండి: ఓటమి వేళ ట్రంప్‌కు మరో పరీక్ష.. యుద్ధానికి ముగింపు పలికేనా?

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement