టకానిని: న్యూజిలాండ్‌లో దీపావళి రాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దక్షిణ ఆక్లాండ్‌లోని టకానినిలో ఓ కారు అదుపుతప్పి బర్గర్‌ఫ్యూయల్ రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు పంజాబీ సంతతికి చెందిన యువకులు ప్రాణాలు కోల్పోయారు. నవంబర్ 8 ఆదివారం రాత్రి సుమారు 10.15 గంటల సమయంలో గ్రేట్ సౌత్ రోడ్డులోని రౌండబౌట్ వద్ద కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కకు దూసుకెళ్లి, కంచెను ఢీకొట్టి నేరుగా రెస్టారెంట్‌లోకి ప్రవేశించింది. కారులో ఉన్న ముగ్గురూ అక్కడికక్కడే మరణించినట్లు టకానిని పోలీసులు తెలిపారు.
న్యూజిలాండ్‌లోని సెంట్రల్ సిక్కు అసోసియేషన్, సుప్రీం సిక్కు సొసైటీ అధ్యక్షుడు దల్జీత్ సింగ్ మంగళవారం ఈ ఘటనపై స్పందించారు. మరణించిన ముగ్గురూ పంజాబీ మూలాలున్న యువకులేనని పేర్కొన్నారు. దీపావళి పండుగ రాత్రే ఈ విషాదం జరగడం పంజాబీ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. మృతులకు సంబంధించిన వివరాలను ప్రస్తుతం వెల్లడించలేమని సోషల్ మీడియా పోస్టులో తెలిపారు.
మృతదేహాలను భారత్‌కు తరలించాలని బాధిత కుటుంబాలు కోరుకున్నాయని దల్జీత్ సింగ్ వెల్లడించారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసుల దర్యాప్తు ముందుకు సాగిన తర్వాత బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రయత్నిస్తామన్నారు. న్యూజిలాండ్ పోలీసుల సీరియస్ క్రాష్ యూనిట్ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తోంది. ప్రమాదానికి ముందు ఆ వాహనంపై ఎలాంటి డ్రైవింగ్ ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు. కారు చోరీకి గురైనట్లు కూడా నమోదు కాలేదని, ప్రమాదం జరిగిన సమయంలో పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించడం లేదని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో రెస్టారెంట్ మూసివేసి ఉన్నప్పటికీ, సిబ్బంది లోపల ఉన్నారు. వారిలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తున్నది. ఈ ప్రమాదంలో రెస్టారెంట్ భవనం తీవ్రంగా దెబ్బతింది.
ఇదీ చదవండి: ఆస్ట్రేలియా మేయర్ పీఠంపై భారతీయుడు.. ఎవరీ అభిషేక్ అవస్థి?


