సెనెగల్‌లోని డకార్‌లో జరిగిన యూత్ ఒలింపిక్ గేమ్స్‌లో మహిళల వంద మీటర్‌ల హర్డిల్స్‌లో శౌర్య అంబురే కాంస్య పతకాన్ని గెలుచుకుంది. అథ్లెటిక్స్‌లో యూత్ ఒలింపిక్స్ పతకాన్ని గెల్చుకున్న తొలి భారత మహిళగా పదిహేడేళ్ల శౌర్య చరిత్ర సృష్టించింది.
తొమ్మిది మంది మహిళల ఫైనల్‌లో 13.59 సెకన్‌ల సమయంతో మూడోస్థానంలో నిలిచింది...‘నా ఆటలో నిన్నటి కంటే ఈరోజు ఎంత మెరుగయ్యాను అని తెలుసుకోవడం కంటే గొప్ప అనుభూతి మరొకటి లేదు’ అనేది అమెరికన్ హర్డిలర్, స్ప్రింటర్ సిడ్నీ మెక్‌లాఫ్లీన్ మాట. ట్రాక్ అండ్ ఫీల్డ్ చరిత్రలో గొప్ప పేరున్న అథ్లెట్‌లలో మెక్‌లాఫ్లీన్ ఒకరు. ఆమె ప్రతి మాటా శౌర్యకు ఎంతో ఇష్టం.
∙పెద్దగా శిక్షణ తీసుకోక పోయినా...
గత సంవత్సరం ‘ఖేల్ ఇండియా యూత్ గేమ్స్’లో తొలిసారి అడుగుపెట్టిన శౌర్య 14.11 సెకన్‌లలో స్వర్ణం కైవసం చేసుకుంది. ‘ఆ సమయంలో నా బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతుండడంతో, ఆసియా ఛాంపియన్‌షిప్‌కు అర్హత పోటీ కావడం వల్ల పోటీలలో పాల్గొనడానికి రెండు పరీక్షలు రాయలేదు. ఇక పోటీ విషయానికి వస్తే నేను పెద్దగా శిక్షణ తీసుకోలేదు. అయితే గెలవగలననే నమ్మకం గట్టిగా ఉండేది’ గతాన్ని గుర్తు చేసుకుంది శౌర్య. సౌదీ అరేబియాలో జరిగిన యూత్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం గెలుచుకొని వావ్ అనిపించింది.
∙వేల మైళ్లు ప్రయాణం చేసి...
ముంబైకి సమీపంలోని థానే శౌర్య అంబురే స్వస్థలం. థానేలో ఆకాశాన్ని తాకే భవంతులు ఉండొచ్చు...అయితే సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ మాత్రం లేదు. ఒకప్పుడు దాదోజీ కొండదేవ్ స్టేడియంలో ట్రాక్ ఉండేది. అయితే ఇప్పుడు ఆ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లు మాత్రమే ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో శౌర్య తన కోచ్ కులకర్ణీతో కలిసి
రోజువారీ శిక్షణ కోసం ముంబై శివారులోని బాంద్రాకు, ఘట్‌కోపర్ లేదా పుణేలోని బలేవాడి స్టేడియానికి 150 కిలోమీటర్‌ల దూరం ప్రయాణించేది.
నాలుగు వందల మీటర్‌ల హర్డిల్స్‌లో ప్రపంచ రికార్డ్‌ను నెలకొల్పిన సిడ్నీ మెక్‌లాఫ్లీన్ శౌర్యకు స్ఫూర్తి. ‘ఒలింపిక్స్‌లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించి పతకం గెలవాలనేది నా కల’ అంటుంది శౌర్య.
మోకాలి గాయం బాధ పెడుతున్నా...
యూత్ ఒలిపింక్స్ గురించి ఏ రోజైతే విన్నదో, ఆరోజు నుంచే ఒక పతకం కచ్చితంగా గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది శౌర్య. అయితే ఆ కలకు అడ్డుపడేలా తన మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. శస్త్ర చికిత్స జరిగిన తరువాత అంతర్జాతీయ రేసులో పాల్గొనాలంటే ఎక్కడో ఆత్మవిశ్వాసం మిస్ అవుతుంది. అయితే శౌర్య ఏమాత్రం డీలా పడలేదు. ‘సాధించాలి’ అని అప్పుడు ఎలా అనుకుందో ఇప్పుడు కూడా అలాగే అనుకుంది.
ఆ సమయంలోనే ఒక ప్రముఖ అథ్లెట్ ఆమెతో ఇలా అన్నారు...‘గాయం గురించి ఎంతమాత్రం ఆలోచించవద్దు. నేను బాగానే ఉన్నాను అని నీకు నువ్వు చెప్పుకోవాలి. ఏదైనా మనసుకు సంబంధించిన విషయమే అని గుర్తు పెట్టుకోవాలి’. ఈ మాటను పదే పదే గుర్తు చేసుకునేది శౌర్య. కాంస్యం సాధించిన తరువాత ఆమె కళ్లలో కన్నీటి చుక్కలు కనిపించాయి. అవి కన్నీటి చుక్కలు కాదు విజయసూచికలు. పట్టుదల ముందు ప్రతికూలతలు వెనక్కి తగ్గుతాయనే చెప్పే హితబోధలు.


