చరిత్ర సృష్టించిన ధీనిధి | Dhinidhi Desinghu wins two medals at Youth Olympics | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన ధీనిధి

Nov 7 2026 3:51 AM | Updated on Nov 7 2026 3:51 AM

Dhinidhi Desinghu wins two medals at Youth Olympics

యూత్‌ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా రికార్డు 

డకర్‌ (సెనెగల్‌): భారత యువ స్విమ్మర్‌ ధీనిధి డేసింఘు కొత్త చరిత్ర సృష్టించింది. యూత్‌ ఒలింపిక్స్‌లో రెండు వ్యక్తిగత పతకాలు గెలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. శుక్రవారం జరిగిన మహిళల స్విమ్మింగ్‌ 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌ ఈవెంట్‌లో కర్ణాటకకు చెందిన 16 ఏళ్ల ధీనిధి కాంస్య పతకం దక్కించుకుంది. ధీనిధి 2ని:02.28 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానంలో నిలిచింది. ఇవే క్రీడల్లో ధీనిధి 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలోనూ కాంస్య పతకం సాధించింది. 

మరోవైపు పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ ఈవెంట్‌లో భారత స్విమ్మర్‌ తీర్థాంక్‌ పేగు కాంస్య పతకం గెలిచాడు. అస్సాంకు చెందిన 17 ఏళ్ల తీర్థాంక్‌ ఫైనల్‌ రేసును 2ని:01.25 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు. ఈక్వెస్ట్రియన్ క్రీడాంశం జంపింగ్‌ ఈవెంట్‌ ఫైనల్లో హైదరాబాద్‌కు చెందిన 15 ఏళ్ల మంతెన శ్రేష్ట్‌ రాజు ఏడో స్థానంలో నిలిచాడు. మహిళల ఆర్చరీ క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో గాథ 687 పాయింట్లతో మూడో స్థానం దక్కించుకుంది. సోమవారం మెడల్‌ ఈవెంట్‌లో గాథ మూడో సీడ్‌గా బరిలోకి దిగుతుంది.  

తన్వీ పత్రికి రజతం
బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత క్రీడాకారిణి తన్వీ పత్రి రన్నరప్‌గా నిలిచి రజత పతకం సొంతం చేసుకుంది. 82 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఫైనల్లో తన్వీ 21–15, 13–21, 24–26తో యి జిన్‌ జాంగ్‌ (చైనా) చేతిలో ఓడిపోయింది. లక్ష్య సేన్‌ (2018లో), హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ (2010లో) తర్వాత యూత్‌ ఒలింపిక్స్‌ చరిత్రలో రజతం నెగ్గిన మూడో భారతీయ షట్లర్‌గా తన్వీ గుర్తింపు పొందింది. ప్రస్తుతం భారత్‌ 6 పతకాలతో 34వ స్థానంలో ఉంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement