టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టింది. సీనియర్ మహిళల టీ20 ట్రోఫీ-2026లో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న జెమీమా.. శుక్రవారం పాండిచ్చేరి మహిళలతో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర సెంచరీతో చెలరేగింది.
మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు దిగిన జెమీమా తనదైన శైలిలో పాండిచ్చేరి బౌలర్లను ఉతికిపారేసింది. కేవలం 49 బంతుల్లోనే 16 ఫోర్లు, 2 భారీ సిక్సర్ల సహాయంతో అజేయంగా 107 పరుగులు సాధించింది. ఓపెనర్ హుమైరా కాజీతో కలిసి రెండో వికెట్‌కు కేవలం 86 బంతుల్లోనే 166 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై జట్టు 2 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు సాధించింది.
కాగా ది హండ్రెడ్ 2026 టోర్నీలో భాగంగా జెమీమీ హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురైంది. దీంతో ఆమె గత మూడు నెలలుగా ఆటకు దూరంగా ఉంటూ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించింది. ఈ గాయం కారణంగానే మహిళల ఆసియాకప్-2026, ఆసియా క్రీడలకు (జపాన్) దూరమవ్వాల్సి వచ్చింది.
అదేవిధంగా జింబాబ్వేతో వైట్ బాల్ సిరీస్‌లకు కూడా జెమీమా అందుబాటులో లేదు. అయితే ఈ ఏడాది డిసెంబర్‌లో భారత మహిళల జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య జట్టుతో ఒక టెస్ట్, మూడు వన్డేలు, మూడు టీ20ల్లో భారత్ తలపడనుంది. ఈ టూర్‌తో జెమీమా తిరిగి పునరాగమనం చేసే అవకాశముంది.
చదవండి: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్


