పాకిస్తాన్ క్రికెటర్ ఆజం ఖాన్‌కు విమర్శలు కొత్త కాదు. సొంత జట్టు అభిమానులే అతడిని బాడీషేమింగ్ చేస్తూ ఉంటారు. లావుగా ఉన్నాడని హేళన చేయడంతో.. ఇతర ఆటగాళ్లు విఫలమైనా జట్టు ఓటమికి అతడిని బాధ్యుడిని చేసి తిట్టడం గతంలో చాలాసార్లు జరిగింది.
ఇటీవల ఆజం ఖాన్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. ఇక తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. పాక్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం అభిమానులు విషపూరితమైన మనస్తత్వం కలవారని మండిపడ్డాడు. తన తల్లిని, తండ్రిని సైతం దూషించారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ మేరకు.. ‘‘మా సోషల్ మీడియాలో మూర్ఖులు ఎక్కువగా ఉంటారు. ఓసారి ఐర్లాండ్‌లో నేను బాబర్ ఆజంతో కలిసి బ్యాటింగ్ చేస్తున్నాను. అప్పుడు అతడు బహుశా 75 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నాడనుకుంటా.
మీ అమ్మ చచ్చిపోతుంది లేదంటే మీ నాన్నకు క్యాన్సర్
మా విజయానికి అప్పుడు 40 పరుగులు అవసరం. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఫొటో చూసిన ఓ వ్యక్తి.. ‘ఒకవేళ నువ్వు గనుక బాబర్ శతకం చేయకుండా అడ్డుపడ్డావంటే.. మీ అమ్మ చచ్చిపోతుంది లేదంటే మీ నాన్నకు క్యాన్సర్ వస్తుంది’ అన్నటుల్గా ఏదో కామెంట్ చేశాడు.
అతడి అభిమానులు మాత్రం టాక్సిక్
నిజానికి మా క్రికెటర్ల ఫ్యాన్‌బేస్ అంతా మూర్ఖులే. బాబర్‌తో నాకు ఎలాంటి గొడవ లేదు. కానీ అతడి అభిమానులు మాత్రం టాక్సిక్. అసలు నా గురించి, మా అమ్మానాన్నల గురించి అలా మాట్లాడాల్సిన అవసరం ఏమిటి?’’ అని ఆజం ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
కాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ కుమారుడైన ఆజం ఖాన్. పాకిస్తాన్ తరఫున 2021లో అరంగేట్రం చేశాడు. 28 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఇప్పటికి అంతర్జాతీయ క్రికెట్‌లో 14 టీ20 మ్యాచ్‌లు ఆడి 88 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, లీగ్ క్రికెట్‌లో మాత్రం ఆజం ఖాన్‌కు మంచి రికార్డే ఉంది.
ఇదీ చదవండి: Asia Cup: సెహ్వాగ్ ధనాధన్, లక్ష్య మెరుపులు.. బోణీ కొట్టిన భారత్


