PC: Sachin Tendulkar Instagram
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ఉద్వేగానికి లోనయ్యాడు. తన అన్న కూతురు కరిష్మా టెండుల్కర్ ప్రతిష్టాత్మక అవార్డు సాధించిందని.. ఆమెను చూసి మనసు గర్వంతో ఉప్పొంగిపోయిందని పేర్కొన్నాడు.
కుమారుడి వివాహం.. కెరీర్‌లో దూసుకువెళ్తున్న కుమార్తె
కాగా అంతర్జాతీయ క్రికెట్ శతక శతకాల ధీరుడిగా పేరొందిన సచిన్ టెండుల్కర్.. రిటైర్మెంట్ తర్వాత వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ ఏడాది కుమారుడు అర్జున్ టెండుల్కర్ వివాహం చేశాడు సచిన్. ఇక కుమార్తె సారా టెండుల్కర్ న్యూట్రీషనిస్టుగా, మోడల్, ఇన్‌ఫ్ల్యూయెన్సర్‌గా రాణిస్తూ.. ఇటీవలే ఓ వెల్‌నెస్ సెంటర్ కూడా స్థాపించింది.
అన్నలు, అక్కతో అనుబంధం
అంతేకాదు.. సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్ వ్యవహారాలు కూడా సారా చూసుకుంటోంది. ఇక సచిన్ కుటుంబం విషయానికొస్తే.. అతడి తల్లిదండ్రులు రజినీ టెండుల్కర్- రమేశ్ టెండుల్కర్. సచిన్‌కు ఇద్దరు అన్నలు నితిన్, అజిత్.. అక్క సవిత ఉన్నారు. వీరి మధ్య మంచి అనుబంధం ఉంది.
బెల్ ఫార్మా అవార్డు
సచిన్ పెద్దన్న నితిన్ ఎయిర్ ఇండియాలో పనిచేసినట్లు సమాచారం. ఆయన కూతురే కరిష్మా టెండుల్కర్ అని తెలుస్తోంది. కరిష్మా కంటి వైద్యురాలు అని సమాచారం. ఇటీవల ఆమె.. బెస్ట్ సర్జికల్ రీసెర్చ్ పేపర్ సమర్పించిన అత్యంత పిన్న వయస్కురాలైన ఆప్తమాలజిస్ట్‌గా ‘బెల్ ఫార్మా అవార్డు’ అందుకుంది.
మీ బాబాయి అందరికీ గొప్పగా చెప్పుకొంటాడు
ముంబైలో జరిగిన మహారాష్ట్ర ఆప్తమాలజిస్ట్ సొసైటీ వార్షిక సమావేశంలో కరిష్మాకు వార్డు ప్రధానం చేశారు. ఈ నేపథ్యంలో అవార్డు అందుకున్న కరిష్మా ఫొటో ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘‘నా అన్న కూతురు కరిష్మాకు శుభాభినందనలు.
నీ శ్రమకు ఫలితం దక్కడం చూస్తుంటే ఆనందంగా ఉంది. నువ్వు సాధించిన ఈ విజయం గురించి మీ బాబాయి అందరితో గర్వంగా చెప్పుకొంటాడని నీకు తెలిసే ఉంటుంది. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది’’ అని సచిన్ టెండుల్కర్ ఉద్వేగానికి లోనయ్యాడు.
ధన్యవాదాలు సచూ కాకా!
ఇందుకు బదులిస్తూ.. ‘‘మీకు ధన్యవాదాలు సచూ కాకా!.. మీ నుంచి ఇలాంటి ప్రశంస అందుకోవడం నిజంగా గొప్ప విషయం. నాకు ఎల్లప్పుడు మీరే స్ఫూర్తిదాయకం’’ అని కరిష్మా టెండుల్కర్ తన బాబాయికి కృతజ్ఞతలు తెలిపింది.
కాగా కరిష్మా మహాత్మ గాంధీ మిషన్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అనంతరం ఆప్తమాలజీలో మాస్టర్ ఆఫ్ సర్జరీలో డిగ్రీ సాధించింది. ఆమె విట్రియోరెటీనల్ సర్జన్ అని తెలుస్తోంది. పుణెలో కరిష్మా NAMAH పేరిట సూపర్‌స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి.. దానికి డైరెక్టర్‌గా కూడా కొనసాగుతున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి: కోహ్లి కాదు!.. రొనాల్డో ఫాలో అయ్యే ఒకే ఒక్క ఇండియన్ అతడే!
అనిరుధ్‌తో కావ్యా మారన్ పెళ్లి: ఏజ్ గ్యాప్, ఇద్దరి ఆస్తుల విలువ ఎంత?


