source: X
ముంబై ఆల్‌రౌండర్ ముషీర్ ఖాన్ సంచలనం సృష్టించాడు. రంజీ ట్రోఫీలో అరుదైన ఘనత సాధించాడు. హర్యానాతో జరుగుతున్న గ్రూప్-డి మ్యాచ్‌లో తొలుత సెంచరీతో సత్తా చాటిన ముషీర్, ఆ తర్వాత బంతితోనూ అదరగొట్టి ఐదు వికెట్లు పడగొట్టాడు.
తద్వారా ఓ రంజీ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో పాటు ఐదు వికెట్లు పడగొట్టిన ఆరో ముంబై ఆటగాడిగా నిలిచాడు. చివరిసారిగా 1990-91 సీజన్‌లో భారత మాజీ కెప్టెన్ రవిశాస్త్రి ముంబై తరఫున ఈ ఘనత సాధించాడు. 36 ఏళ్ల తర్వాత ముషీర్ ఈ ఫీట్‌ను పునరావృతం చేశాడు.
ముంబై తరఫున ఒకే రంజీ మ్యాచ్‌లో సెంచరీ, ఐదు వికెట్ల ఘనత సాధించిన ఆటగాళ్లు
- మదన్ రైజీ: మహారాష్ట్రపై, 1947-48
- దత్తు ఫడ్కర్: మద్రాస్‌పై, 1948-49
- వినూ మన్కడ్: మద్రాస్‌పై, 1953-54
- పాలీ ఉమ్రిగర్: మహారాష్ట్రపై, 1957-58
- రవిశాస్త్రి: మధ్యప్రదేశ్‌పై, 1990-91
- ముషీర్ ఖాన్: హర్యానాపై, 2026-27
మ్యాచ్ విషయానికొస్తే.. ముషీర్ (109)తో పాటు అంగ్‌కృష్ రఘువంశీ (114) సెంచరీలతో కదంతొక్కడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 430 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ముషీర్ బంతితోనూ (6-78) చెలరేగడంతో హర్యానా తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యేలా కనిపిస్తుంది. మూడో రోజు రెండో సెషన్ సమయానికి ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. ముంబై తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 168 పరుగులు వెనుకపడి ఉంది.
ఇదీ చదవండి: విండీస్‌తో టెస్టు.. బంగ్లాదేశ్ బ్యాటర్ అరుదైన రికార్డు


