source: X
రంజీ ట్రోఫీ 2026-27లో బరోడా యువ బ్యాటర్ ప్రియాన్షు మోలియా (21) చరిత్ర సృష్టించాడు. జమ్మూ కశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అజేయమైన ట్రిపుల్ సెంచరీ (321) చేయడంతో బరోడా తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో 79 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. 1947లో గుల్ మహమ్మద్ చేసిన 319 పరుగుల నేటి వరకు బరోడా తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉండింది. ఈ రికార్డును ప్రియాన్షు ఇవాళ అధిగమించాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. బరోడా తొలుత బ్యాటింగ్ చేయగా.. ప్రియాంన్షు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. 492 బంతుల్లో 36 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 321 పరుగులు చేశాడు. ఈ క్రమంలో మహేశ్ పిథియాతో కలిసి ఏడో వికెట్‌కు 232 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. పిథియా తన తొలి ఫస్ట్‌క్లాస్ సెంచరీ (102) సాధించాడు. ప్రియాంన్షు, పిథియా సత్తా చాటడంతో బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 616 పరుగులకు ఆలౌటైంది.
21 ఏళ్ల 132 రోజుల వయసులో ట్రిపుల్ సెంచరీ చేసిన ప్రియాన్షు, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఏడో అతి పిన్న భారత బ్యాటర్‌గా నిలిచాడు. అతి పిన్న వయసులో ట్రిపుల్ సెంచరీ సాధించిన భారత బ్యాటర్‌గా వసీం జాఫర్ (18 ఏళ్ల 262 రోజులు) చలామణి అవుతున్నాడు.
బరోడా ఇన్నింగ్స్ పూర్తైన అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన జమ్మూ కశ్మీర్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. కమ్రాన్ ఇక్బాల్ (0), షుభమ్ ఖజూరియా (2) క్రీజ్‌లో ఉన్నారు. జమ్మూ కశ్మీర్ బరోడా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 610 పరుగులు వెనుకపడి ఉంది.
ఇదీ చదవండి: రంజీ ట్రోఫీ.. డబుల్ సెంచరీలతో మోతెక్కించిన బ్యాటర్లు


