source: X
రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు ఆంధ్రపై 267 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. తనయ్ త్యాగరాజన్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 11 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన తనయ్, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో ఆంధ్ర పతనాన్ని శాసించాడు. 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర 130 పరుగులకే కుప్పకూలింది. తనయ్ రెండో ఇన్నింగ్స్‌లో అర్ధశతకం కూడా సాధించాడు.
మిగతా మ్యాచ్ విషయానికొస్తే.. కేరళ జట్టు ఒడిశాపై ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో గెలిచింది. జలజ్ సక్సేనా ఐదు వికెట్లతో సత్తాచాటాడు. ముంబై జట్టు హిమాచల్ ప్రదేశ్‌పై ఇన్నింగ్స్ 97 పరుగుల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ ఏడు వికెట్ల తేడాతో ఛత్తీస్‌గఢ్‌ను ఓడించింది. మేఘాలయ మూడు పరుగుల తేడాతో మణిపూర్‌పై ఉత్కంఠ విజయం సాధించింది.
మహారాష్ట్ర-జార్ఖండ్, ఢిల్లీ-గుజరాత్, రైల్వేస్-రాజస్థాన్, కర్ణాటక-సౌరాష్ట్ర మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో మహారాష్ట్ర, ఢిల్లీ, సౌరాష్ట్ర పైచేయి సాధించాయి. మిజోరం నిర్దేశించిన 581/9 స్కోరుకు బదులుగా నాగాలాండ్ 516 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో వెనుకబడింది. మిజోరం బ్యాటర్ చిన్మయ్ సుతార్ 400 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఇదీ చదవండి: ముంబై డబుల్ బోనస్


