ముంబై డబుల్‌ బోనస్‌ | Mumbai team secures a win with a bonus point for the second consecutive match in the Ranji Trophy | Sakshi
Sakshi News home page

ముంబై డబుల్‌ బోనస్‌

Oct 22 2026 4:32 AM | Updated on Oct 22 2026 4:32 AM

Mumbai team secures a win with a bonus point for the second consecutive match in the Ranji Trophy

వరుసగా రెండో మ్యాచ్‌లోనూ బోనస్‌ పాయింట్‌తో విజయం

ఇన్నింగ్స్‌ 97 పరుగుల తేడాతో హిమాచల్‌ ఓటమి 

రంజీ ట్రోఫీ క్రికెట్‌ టోర్నీ  

బిలాస్‌పూర్‌: మాజీ చాంపియన్‌ ముంబై జట్టు మరోసారి బ్రహ్మాండమైన ఆటతీరుతో రంజీ ట్రోఫీలో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ బోనస్‌ పాయింట్‌తో కూడిన విజయాన్ని అందుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌ జట్టుటతో జరిగిన గ్రూప్‌ ‘డి’ లీగ్‌ మ్యాచ్‌లో సిద్దేశ్‌ లాడ్‌ సారథ్యంలోని ముంబై జట్టు ఇన్నింగ్స్‌ 97 పరుగుల తేడాతో గెలుపొందింది. రంజీ ట్రోఫీ నిబంధనల ప్రకారం 10 వికెట్ల తేడాతో లేదంటే... ఇన్నింగ్స్‌ తేడాతో గెలిచిన జట్టుకు ఆరు పాయింట్లతోపాటు అదనంగా ఒక బోనస్‌ పాయింట్‌ లభిస్తుంది. తొలి మ్యాచ్‌లో చండీగఢ్‌పై ఇన్నింగ్స్‌ తేడాతో గెలిచిన ముంబై... రెండో మ్యాచ్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. 

హిమాచల్‌ ప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 140 పరుగులకు ఆలౌట్‌ కాగా... ముంబై 528/8 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. సర్ఫరాజ్‌ ఖాన్‌ (228 బంతుల్లో 154; 19 ఫోర్లు), ఆకాశ్‌ ఆనంద్‌ (239 బంతుల్లో 117 నాటౌట్‌; 14 ఫోర్లు) సెంచరీలతో సత్తాచాటారు. ఫలితంగా ముంబై జట్టుకు 388 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో హిమాచల్‌ ప్రదేశ్‌ 99.1 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ పుఖ్‌రాజ్‌ మాన్‌ (126 బంతుల్లో 50; 6 ఫోర్లు), వైభవ్‌ కాల్టా (169 బంతుల్లో 63; 10 ఫోర్లు) అర్ధశతకాలు సాధించారు. ముంబై బౌలర్లలో మోహిత్‌ అవస్థి 44 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తుషార్‌ దేశ్‌పాండే, షమ్స్‌ ములానీ చెరో రెండు వికెట్లు తీశారు. సర్ఫరాజ్‌ ఖాన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. గ్రూప్‌ ‘డి’లో భాగంగా ఈ నెల 26 నుంచి హరియాణాతో ముంబై జట్టు తలపడనుంది. 

జమ్మూ కశ్మీర్‌ పరాజయం 
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ జమ్మూ కశ్మీర్‌ జట్టు ప్రభావం చూపలేకపోతోంది. తొలి మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న కశ్మీర్‌ జట్టు... రెండో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. శ్రీనగర్‌ వేదికగా మూడు రోజుల్లో ముగిసిన ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో విదర్భ జట్టు 3 వికెట్ల తేడాతో జమ్మూ కశ్మీర్‌ను ఓడించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ జమ్మూ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 260 పరుగులు చేయగా... విదర్భ 305 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో కశ్మీర్‌ జట్టు 123 పరుగులకే ఆలౌటైంది. 

అబ్దుల్‌ సమద్‌ (39; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌. విదర్భ బౌలర్లలో నచికేత్‌ 48 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో ప్రత్యర్థి ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. అయితే కశ్మీర్‌ బౌలర్లు సైతం మెరుగ్గా రాణించడంతో విదర్భకు కొంతం లక్ష్యమే కొండంతగా మారింది. ఒక దశలో పరాజయం వెంటాడినా... చివరకు విదర్భ 22.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. హర్‌‡్ష దూబే (22 నాటౌట్‌), మండర్‌ మహలె (25) పోరాడారు. కశ్మీర్‌ బౌలర్లలో సునీల్‌ కుమార్‌ 4 వికెట్లు పడగొట్టాడు. 

గ్రూప్‌ ‘ఎ’ ఇతర మ్యాచ్‌ల్లో బరోడా 10 వికెట్ల తేడాతో బిహార్‌ను ఓడించగా... మధ్యప్రదేశ్, పుదుచ్చేరి మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసింది. గోవాతో జరిగిన పోరులో ఉత్తరప్రదేశ్‌ 68 పరుగుల తేడాతో గెలిచింది. గ్రూప్‌ ‘సి’లో భాగంగా జరిగిన మ్యాచ్‌ల్లో కేరళ ఇన్నింగ్స్‌ 36 పరుగుల తేడాతో ఒడిశా జట్టుపై, బెంగాల్‌ 60 పరుగుల తేడాతో సర్వీసెస్‌పై విజయం సాధించాయి. జార్ఖండ్, మహారాష్ట్ర జట్ల మధ్య మ్యాచ్‌... ఢిల్లీ, గుజరాత్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిశాయి.  

సాయి కిషోర్‌ ‘హ్యాట్రిక్‌’ 
టీమిండియా ప్లేయర్, తమిళనాడు స్పిన్నర్‌ సాయి కిషోర్‌ రంజీ ట్రోఫీలో ‘హ్యాట్రిక్‌’తో మెరిశాడు. ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో భాగంగా ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో తమిళనాడు ఇన్నింగ్స్‌ 66 పరుగుల తేడాతో విజయం సాధించడంలో సాయి కిషోర్‌ కీలక పాత్ర పోషించాడు. తమిళనాడుకు ఏడు పాయింట్లు లభించాయి.  చెన్నై వేదికగా మూడు రోజుల్లో ముగిసిన ఈ పోరులో ఉత్తరాఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులకు ఆలౌటైంది. తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 313 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ప్రదోశ్‌ రంజన్‌ పాల్‌ (136; 12 ఫోర్లు) సెంచరీ నమోదు చేశాడు. 

అనంతరం ఉత్తరాఖండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 45.4 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటైంది. తమిళనాడు బౌలర్లలో సాయికిషోర్‌ 34 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇన్నింగ్స్‌ 43వ ఓవర్‌లో అతడు ‘హ్యాట్రిక్‌’ నమోదు చేశాడు. నాలుగో బంతికి లక్ష్య రాయ్‌చందాని (19)ని అవుట్‌ చేసిన సాయి కిషోర్‌... ఐదో బంతికి సౌరభ్‌ రావత్‌ (0)ను వెనక్కి పంపాడు. ఇక చివరి బంతికి ఆదిత్య రావత్‌ (0) కూడా అవుట్‌ కావడంతో సాయి కిషోర్‌ ‘హ్యాట్రిక్‌’ పూర్తయింది. రాజస్తాన్, రైల్వేస్‌ జట్ల మధ్య జరిగిన గ్రూప్‌ ‘డి’ మరో మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసింది.  

పంజాబ్‌ గెలుపు బోణీ 
భారత టెస్టు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పంజాబ్‌ జట్టు... రంజీ ట్రోఫీ తాజా సీజన్‌లో తొలి విజయం సాధించింది. ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో భాగంగా గత మ్యాచ్‌లో ‘డ్రా’తో సరిపెట్టుకున్న పంజాబ్‌... తాజా పోరులో ఛత్తీస్‌గఢ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. పంజాబ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 456 పరుగులు చేయగా... ఛత్తీస్‌గఢ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 206 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారీ ఆధిక్యం దక్కించుకున్న పంజాబ్‌ ప్రత్యర్థిని ఫాలోఆన్‌ ఆడించింది. ఈసారి కాస్త మెరుగైన ప్రదర్శన కనబర్చిన ఛత్తీస్‌గఢ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 116.2 ఓవర్లలో 335 పరుగులకు ఆలౌటైంది. ఆయుశ్‌ పాండే (111; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. 

అమన్‌దీప్‌ (62), ధర్మేంద్ర జడేజా (47) కాస్త పోరాడారు. పంజాబ్‌ బౌలర్లలో హర్జాస్‌ సింగ్, ఇమన్‌జ్యోత్‌ సింగ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 86 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌ 16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేధించింది. కెప్టెన్‌ ఉదయ్‌ సహారణ్‌ (40 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయంగా జట్టును గెలిపించాడు. గ్రూప్‌ ‘బి’లోని ఇతర మ్యాచ్‌ల్లో అస్సాం తొమ్మిది వికెట్ల తేడాతో త్రిపురను ఓడించగా... కర్ణాటక, సౌరాష్ట్ర జట్ల మధ్య మ్యాచ్‌ ‘డ్రా’ అయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement