న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి వేదికగా మానవ హక్కుల పేరుతో కొన్ని దేశాలను లక్ష్యంగా చేసుకోవడంపై భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మానవ హక్కుల అంశాలను దేశాలపై రాజకీయ ఒత్తిడి తెచ్చే ఆయుధాలుగా మార్చవద్దని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ బర్ఖా తామ్రకర్ ఐరాస సాధారణ సభ మూడో కమిటీ సమావేశంలో పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌ను అప్రతిష్టపాలు చేసేలా దురుద్దేశపూర్వక చిత్రీకరణలను సహించేది లేదని తామ్రకర్ తేల్చిచెప్పారు. అంతర్జాతీయ మానవ హక్కుల యంత్రాంగాలతో భారత్ ఎల్లప్పుడూ నిర్మాణాత్మక చర్చలు, సహకారం, పారదర్శకతతోనే కలిసి పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు. కేవలం అసంపూర్తి సమాచారం, నిరాధార ఆరోపణలు లేదా దేశ పరిశీలన లేని నివేదికల ఆధారంగా తుది తీర్పులు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు.
మానవతా దృక్పథంతో చేసే ప్రాథమిక సంప్రదింపులను కొందరు తప్పుడు ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారని, సరైన ఆధారాలున్న కేసులను అధికారిక మార్గాల్లో పరిష్కరించేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని గుర్తుచేశారు. న్యూఢిల్లీలో ఇటీవల యువత చేపట్టిన నిరసనలపై ఐరాసకు చెందిన కొందరు నిపుణులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో భారత్ ఈ ఘాటు స్పందనను తెలియజేసింది. పోలీసుల చర్యలపై జెనీవా కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల నిపుణులు నివేదికలు ఇవ్వడాన్ని, అరెస్టులపై ఆందోళన వ్యక్తం చేయడాన్ని భారత్ ఇదివరకే 'కేవలం వినికిడి ఆధారిత సమాచారం'గా కొట్టిపారేసింది.
ఎలాంటి క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా అసత్య ఆరోపణల ఆధారంగా ప్రచారాలు నిర్వహించడం బాధ్యతారాహిత్యమని మండిపడింది. చివరగా, ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం చేసిన ఈ వ్యాఖ్యలు పూర్తిగా అనవసరమైనవని, భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో తీవ్రమైన జోక్యమేనని న్యూఢిల్లీ స్పష్టం చేసింది. అంతర్జాతీయ వేదికలు తమ నిష్పాక్షికతను కాపాడుకోవాలని, తప్పుడు ఆరోపణల ఆధారంగా దేశాల సార్వభౌమాధికారాన్ని, అంతర్గత శాంతిభద్రతల నిర్వహణను ప్రశ్నించే ప్రయత్నాలను తక్షణమే మానుకోవాలని గట్టి హెచ్చరిక చేసింది.
ఇదీ చదవండి: Jammu & Kashmir: లోయలో పడ్డ బస్సు.. 16 మందికి గాయాలు


