శ్రమించి గెలిచిన సింధు | PV Sindhu overcame the first round hurdle at the French Open with great difficulty | Sakshi
Sakshi News home page

శ్రమించి గెలిచిన సింధు

Oct 22 2026 4:29 AM | Updated on Oct 22 2026 4:29 AM

PV Sindhu overcame the first round hurdle at the French Open with great difficulty

తన్వీ, అష్మిత కూడా ముందంజ

ఆయుశ్‌ శెట్టి చేతిలో శ్రీకాంత్‌ ఓటమి

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు తొలి రౌండ్‌ అడ్డంకిని అతికష్టమ్మీద అధిగమించింది. ప్రపంచ 26వ ర్యాంకర్‌ సుపనిద కటెథోంగ్‌ (థాయ్‌లాండ్‌)తో జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్‌ సింధు 21–14, 8–21, 23–21తో గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. 64 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు 19–8తో ఆధిక్యంలోకి వెళ్లి విజయానికి రెండు పాయింట్ల దూరంలో నిలిచింది. ఈ దశలో సుపనిద ఒక్కసారిగా చెలరేగి వరుసగా 11 పాయింట్లు గెలిచి స్కోరును 19–19తో సమం చేసింది. 

ఆ తర్వాత రెండుసార్లు ఇద్దరూ చెరో పాయింట్‌ గెలవడంతో స్కోరు 20–20తో, 21–21తో సమమైంది. ఈ దశలో సింధు వరుసగా రెండు పాయింట్లు గెలిచి 23–21తో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. భారత్‌కే చెందిన తన్వీ శర్మ, అష్మిత చాలిహా కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించగా... ఉన్నతి హుడా, దేవిక సిహాగ్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. తన్వీ శర్మ 21–12, 21–12తో భారత్‌కే చెందిన ఇషారాణి బారువాపై, అష్మిత 21–18, 24–22తో హాన్‌ కియాన్‌ జి (చైనా)ను ఓడించింది. ఉన్నతి 18–21, 21–12, 17–21తో రికో గుంజి (జపాన్‌) చేతిలో, దేవిక 9–21, 21–16, 20–22తో పుత్రి కుసుమ వర్ధిని (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడిపోయారు. 

నేడు జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో టాప్‌ సీడ్‌ ఆన్‌ సె యంగ్‌తో తన్వీ శర్మ; మూడో ర్యాంకర్‌ అకానె యామగుచి (జపాన్‌)తో అష్మిత, రికో గుంజితో సింధు తలపడతారు. పురుషుల సింగిల్స్‌లో భారత ప్లేయర్‌ ఆయుశ్‌ శెట్టి ముందంజ వేశాడు. భారత్‌కే చెందిన కిడాంబి శ్రీకాంత్‌తో జరిగిన తొలి రౌండ్‌లో ఆయుశ్‌ 19–21, 21–16, 21–12తో గెలుపొందాడు. లక్ష్య సేన్‌ తన ప్రత్యర్థి కొడాయ్‌ నరోకా (జపాన్‌)కు వాకోవర్‌ ఇచ్చాడు.  

సాత్విక్‌–చిరాగ్‌ జోడీకి నిరాశ 
పురుషుల డబుల్స్‌ విభాగంలో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ వరుసగా మూడో టోర్నీలో తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 19–21, 21–18, 13–21తో క్రిస్టో పొపోవ్‌–టోమా జూనియర్‌ పొపోవ్‌ (ఫ్రాన్స్‌) జంట చేతిలో ఓడిపోయింది. డెన్మార్క్‌ ఓపెన్‌లో, ఆసియా క్రీడల్లోనూ సాత్విక్‌–చిరాగ్‌ జోడీ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్‌) ద్వయం 17–21, 18–21తో లిన్‌ చి చున్‌–యాంగ్‌ చు యున్‌ (చైనీస్‌ తైపీ) జంట చేతిలో పరాజయం పాలైంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement