భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అభిప్రాయం
టెన్నిస్‌తో పోలిస్తే ఆదాయం తక్కువన్న స్టార్ షట్లర్
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు ఇటీవల యూరోప్ సర్క్యూట్‌లో భాగంగా వరుసగా నాలుగు టోర్నీల్లో (ఫిన్‌లాండ్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ) పాల్గొన్నారు. సాధారణంగా టోర్నీల్లో ఆడేందుకు అవసరమైన వసతి, ప్రయాణం, ఇతర ఖర్చులను నిబంధనల ప్రకారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) భరిస్తుంది. అయితే ఈ నాలుగు టోర్నీల కోసం ‘సాయ్’ ఎలాంటి నిధులు విడుదల చేయలేదు. దాంతో ఆటగాళ్లంతా తమ సొంత డబ్బులతోనే వెళ్లాల్సి వచ్చింది. ఫిన్లాండ్ ఓపెన్ ఆరంభానికి ముందు చివరి నిమిషంలో ఈ సమాచారాన్ని ఆటగాళ్లకు ‘సాయ్’ వెల్లడించింది.
దాంతో మొత్తం 26 మంది భారత షట్లర్లూ పాల్గొనగా... తర్వాతి మూడు టోర్నీల నుంచి వరుసగా ఆరు, ఏడు, తొమ్మిది మంది చొప్పున తప్పుకున్నారు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరగ్గా... ‘అసలు ప్రొఫెషనల్ అథ్లెట్లకు ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇవ్వాలి. మొత్తం నిధులు లాగేసుకుంటున్నారు. లక్ష్య సేన్, సింధులాంటి ప్లేయర్లు టెన్నిస్ తరహాలో సొంతంగా ఖర్చు పెట్టుకోవచ్చు కదా’ అని ఒకరు తీవ్రంగా వ్యాఖ్యానించారు. దీనిపై భారత స్టార్ షట్లర్ పీవీ సింధు స్పందించింది. ప్రత్యేకంగా తన పేరును ప్రస్తావించడంతో ఆమె ఈ విషయంలో సుదీర్ఘ వివరణ ఇచ్చింది.
తనలాంటి ప్లేయర్లకు డబ్బులకు లోటు లేకపోయినా... ఇతర యువ ఆటగాళ్లకు ప్రభుత్వ సహకారం కావాల్సిందేనని చెబుతూ ఆమె టెన్నిస్‌తో పోలుస్తూ అన్ని అంశాలు వివరించింది. ‘వింబుల్డన్ తొలి రౌండ్‌లో ఓడిపోతే 80 వేల పౌండ్లు (సుమారు రూ.1 కోటి రూపాయలు) లభిస్తాయి. అదే బ్యాడ్మింటన్‌లో అతి పెద్ద టోర్నీల్లో ఒకటైన చైనా ఓపెన్ టోర్నీలో విజేతగా నిలిస్తే సుమారు 1 కోటి 30 లక్షలు దక్కుతాయి. తొలి రౌండ్‌లో ఓడితే సుమారు రూ.2 లక్షలు మాత్రమే ఇస్తారు. కానీ ప్రయాణం, కోచ్‌లు, ఫిజియో, ఇతర సహాయక సిబ్బంది వంటి ఖర్చులు మాత్రం టెన్నిస్ తరహాలోనే ఉంటాయి.
గతంలో రోహన్ బోపన్నతో కూడా ఈ విషయం చాలాసార్లు మాట్లాడాను. నాకు మంచి స్పాన్సర్లు ఉన్నారు కాబట్టి సమస్య లేదు. ఎక్కడికైనా సొంత ఖర్చులతో వెళ్లగలను. కానీ యువ షట్లర్లకు అలాంటి పరిస్థితి లేదు. మంచి భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న 18 ఏళ్ల ప్లేయర్‌కు ఇది సాధ్యం కాదు. ఈ సమయంలో ప్రభుత్వ సహకారం తప్పనిసరి. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం అలాగే అండగా నిలుస్తోంది. అథ్లెట్లకు సహాయం చేస్తే ప్రభుత్వ వ్యవస్థ నాశనమైపోదు. భారత క్రీడల భవిష్యత్తు కోసం పెడుతున్న పెట్టుబడిగా దానిని భావించాలి’ అని సింధు తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పింది.


