PC: ICC/BCCI
ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ముందు వరుసలో ఉంటాడు. సుమారు రెండున్నర దశాబ్దాల అంతర్జాతీయ కెరీర్‌లో లెక్కకు మిక్కిలి రికార్డులు నెలకొల్పిన ఘనత ‘మాస్టర్ బ్లాస్టర్’కు ఉంది.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా శతక శతకాలు బాదిన వీరుడిగా చెక్కుచెదరని ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు సచిన్ టెండుల్కర్. అయితే, టీమిండియా కెప్టెన్‌గా మాత్రం ఈ ముంబైకర్ విఫలమయ్యాడు. సారథిగా 1996-97, 1999-2000 సంవత్సరాల్లో సచిన్ జట్టును ముందుకు నడిపించాడు.
సచిన్ కెప్టెన్సీలో 25 టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు కైవలం నాలుగు గెలిచి.. తొమ్మిది ఓడిపోయింది. మిగిలిన 12 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఇక వన్డేల్లో 73 మ్యాచ్‌లకు సచిన్ సారథ్యం వహించగా.. కేవలం 23 గెలిచిన టీమిండియా.. 43 మ్యాచ్‌లు ఓడిపోయింది.
తాజాగా తన కెప్టెన్సీ రోజులను సచిన్ టెండుల్కర్ గుర్తు చేసుకున్నాడు. రెడిట్‌లో 'Ask me Anything' సెషన్‌లో భాగంగా ఓ అభిమాని సచిన్‌కు కెప్టెన్సీకి సంబంధించిన ప్రశ్న వేశాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘టీమిండియా సారథిగా వ్యవహరించడం గొప్ప గౌరవం.
అయితే, అప్పట్లో జట్టును ఎంచుకునేందుకు బీసీసీఐ నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చేది కాదు. నా సొంతంగా ఆటగాళ్లను ఎంపిక చేసుకునే వీలు ఉండకపోయేది. 1990వ దశకంతో పోలిస్తే బీసీసీఐ ఇప్పుడు మరింత ప్రొఫెషనల్‌గా మారింది. ఆ సమయంలోనే భారత క్రికెట్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది. అదొక చీకటి దశ (మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఉద్దేశించి)’’ అని సచిన్ పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: భారత బ్యాటర్ ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర


