'హ‌ర్మ‌న్‌ప్రీత్‌ నా ఫోన్‌కాల్స్ ఎత్త‌లేదు' | Rajeshwari Demands Reason-Exclusion-Harman-Not-Answered-Phone-Call | Sakshi
Sakshi News home page

'హ‌ర్మ‌న్‌ప్రీత్‌ నా ఫోన్‌కాల్స్ ఎత్త‌లేదు'

Nov 3 2026 9:13 AM | Updated on Nov 3 2026 9:19 AM

Rajeshwari Demands Reason-Exclusion-Harman-Not-Answered-Phone-Call

Photo Credit: Twitter

భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు సీనియ‌ర్ క్రికెట‌ర్ రాజేశ్వ‌రి గైక్వాడ్ త‌న‌ను జాతీయ జ‌ట్టుకు ఎంపిక చేయ‌క‌పోవ‌డంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. గాయం నుంచి కోలుకొని మంచి ఫామ్ ప్ర‌ద‌ర్శించిన‌ప్ప‌టికీ, త‌న‌ను ఎందుకు మిన‌హాయించారో కార‌ణం చెప్పాల‌ని డిమాండ్ చేసింది. 

క‌ర్నాట‌క‌కు చెందిన 35 ఏళ్ల రాజేశ్వ‌రి గైక్వాడ్ 2024లో ద‌క్షిణాఫ్రికాతో స్వ‌దేశంలో జ‌రిగిన టెస్టు మ్యాచ్‌లో భార‌త్ త‌ర‌ఫున చివ‌రిసారిగా ఆడింది. ఆ మ్యాచ్ సమయంలో, ఈ లెఫ్ట్-ఆర్మ్ స్పిన్నర్ తీవ్రమైన మోకాలి గాయానికి గురవడంతో ఆరు నెలల పాటు ఆటకు దూరమైంది. ప్ర‌స్తుతం వ‌న్డేల్లో ఆమె ఖాతాలో 99 వికెట్లు ఉన్నాయి. మ‌రో వికెట్ సాధిస్తే వంద వికెట్ల మార్క్ చేరుకోనుంది. 

యూట్యూబ‌ర్ దీప‌క్ ప‌రేఖ్ చాన‌ల్‌కు ఇంట‌ర్య్వూ ఇచ్చిన రాజేశ్వ‌రి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. "వన్డే ప్రపంచ కప్ గెలిచిన త‌ర్వాత జ‌ట్టులో చాలా మంది గాయ‌ప‌డ్డారు. వారిలో కొంద‌రు కోలుకొని తిరిగి జ‌ట్టులోకి కూడా వ‌చ్చారు. ఇదెలా సాధ్య‌మైంది? ఈ రోజుల్లో, ఒక ఆటగాడికి గాయమైనా, వారు తర్వాతి సిరీస్‌లోనే జట్టులో చోటు సంపాదించుకుంటున్నారు. 

కానీ నా విష‌యంలో మాత్రం అంతా రివ‌ర్స్‌గా ఉంది. నా గాయాల చ‌రిత్ర‌ను చూస్తే.. మోకాలి శ‌స్త్ర‌చికిత్స మాత్ర‌మే కెరీర్‌లో నాకు పెద్ద గాయం. అది మిన‌హాయిస్తే నేను పెద్ద‌గా గాయ‌ప‌డింది లేదు. మోకాలి గాయం నుంచి కోలుకొని జాతీయ జ‌ట్టులోకి రావ‌డానికి దేశ‌వాళీ టోర్నీల్లోనూ పాల్గొన్నాను.. ఫామ్‌లోకి వ‌చ్చాను. కానీ నాకు జ‌ట్టులో అవ‌కాశం మాత్రం ఇవ్వలేదు. 

99 వికెట్ల దగ్గరే ఆగిపోయా..
ప్ర‌స్తుతం వ‌న్డేల్లో నా ఖాతాలో 99 వికెట్లు ఉన్నాయి. వంద వికెట్ల మార్క్ అనేది ఏ బౌల‌ర్‌కైనా ఒక ట్రేడ్‌మార్క్‌. ఈ మార్క్‌ను చేరుకునేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తుంటారు. కానీ నేను ప్ర‌య‌త్నిస్తున్న‌ప్ప‌టికీ, జ‌ట్టులో చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో ఆ ఫీట్‌ను అందుకోలేక‌పోయాను. 

నన్ను ఎంపిక చేయ‌క‌పోవ‌డంపై చాలా ప్రశ్నలు ఉన్నాయి, కానీ వాటికి ఎవరు సమాధానం చెబుతారు? నన్ను ఎంపిక చేయకపోవడానికి గల కారణం ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను జట్టులో లేనప్పుడు కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్‌, కోచ్‌తో మాట్లాడటానికి ప్రయత్నించాను, కానీ నా కాల్స్‌కు వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు." అని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

ఈ తరానికి రూల్స్‌ వర్తించవా?
ఇక ఫిట్‌నెస్ నిరూపించుకోవడానికి తనను దేశీయ, ఇండియా 'ఎ' మ్యాచ్‌లు ఆడమని అడిగిన సందర్భాలను కూడా రాజేశ్వరి గుర్తుచేసుకుంది. ఇదే విధానాన్ని ప్రస్తుత తరం ఆటగాళ్లకు ఎందుకు వర్తింపజేయడం లేదని ఆమె ప్రశ్నించింది. ప్రస్తుతం సీనియర్ మహిళల టీ20 ట్రోఫీ ఎలైట్‌లో కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజేశ్వరి గైక్వాడ్‌, మహిళల ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్ త‌ర‌ఫున ఆడుతోంది.  

ఇక 2014లో భార‌త్ త‌ర‌ఫున‌ అంత‌ర్జాతీయ మ‌హిళ‌ల క్రికెట్‌లో అరంగేట్రం చేసిన రాజేశ్వ‌రి గైక్వాడ్ 64 వ‌న్డేల్లో 99 వికెట్లు, 58 టీ20ల్లో 61 వికెట్లు, ఐదు టెస్టుల్లో 11 వికెట్లు ప‌డ‌గొట్టింది.

ఇదీ చదవండి: శ‌త‌క్కొట్టిన జైస్వాల్‌.. 200 పరుగుల ఆధిక్యంలో భారత్‌

రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ఆసీస్‌ స్టార్‌ క్రికెటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement