పోడియంపై ఆంటోనెలిని భుజంపై ఎత్తుకున్న వెర్‌స్టాపెన్ (ఎడమ), హామిల్టన్ (కుడి)
ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు
20 ఏళ్ల 68 రోజుల వయసులో జగజ్జేతగా నిలిచిన మెర్సిడెస్ డ్రైవర్
380 పాయింట్లతో నాలుగు రేసుల ముందే ప్రపంచ టైటిల్ ఖరారు
2025లోనే ఎఫ్1 ట్రాక్ బరిలోకి దిగిన ఆంటోనెలి రెండో సీజన్‌లో అద్భుతాలు చేయడం అసాధారణం. గతంలో అతి చిన్న వయసులో ఎఫ్1 గెలుచుకున్న జర్మనీ డ్రైవర్ వెటెల్ (రెడ్‌బుల్; 2010లో) రికార్డును ఆంటోనెలి 3 సంవత్సరాల 66 రోజుల తేడాతో సవరించడం విశేషం. 73 ఏళ్ల తర్వాత ఎఫ్1 చాంపియన్‌షిప్ గెలిచిన ఇటలీ దేశస్తుడిగా కూడా అతను ఘనత వహించాడు. 1953లో ఇటాలియన్ ఆల్బర్టో అస్కారి టైటిల్ నెగ్గాడు.
మెక్సికో సిటీ: ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్... మెక్సికో సిటీ వేదికగా 19వ రేస్... సీనియర్ రేసర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ విజేతగా నిలవగా, మరో దిగ్గజం లూయిస్ హామిల్టన్ రెండో స్థానం సాధించాడు. కానీ ఈ ఇద్దరి తర్వాత మూడో స్థానంతో ముగించిన ఒక కుర్రాడు మాత్రమే పోటీ ముగిసిన తర్వాత అక్కడ అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తిగా నిలిచాడు. అతడే మెర్సిడెస్ యువ డ్రైవర్ కిమీ ఆండ్రియా ఆంటోనెలి. ఈ రేస్ ముగియడంతోనే అతను 2026 సీజన్ చాంపియన్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు.
20 ఏళ్ల 68 రోజుల వయసులో టైటిల్ సాధించి ఎఫ్1 చరిత్రలో అత్యంత పిన్న వయసులో విజేతగా శిఖరాన నిలిచిన రేసర్‌గా ఆంటోనెలి ప్రపంచ రికార్డు సృష్టించాడు. సీజన్‌లో మరో నాలుగు రేస్‌లు మిగిలి ఉండగానే టైటిల్ ఆంటోనెలి సొంతం కావడం విశేషం. 19 రేస్‌లలో 9 రేస్‌లు గెలుచుకున్న ఈ యువ సంచలనం 3 రేస్‌లలో రెండో స్థానం, మరో 4 రేస్‌లలో మూడో స్థానంలో నిలిచాడు. మొత్తం 380 పాయింట్లతో అతను కొత్త చాంపియన్‌గా అవతరించాడు. వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్; 261 పాయింట్లు) రెండో స్థానంలో, హామిల్టన్ (ఫెరారీ; 259 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నారు.
తండ్రి ‘స్టీరింగ్’ అందించగా...
ఆటగాడిగా తాను సాధించలేని విజయాలను కొడుకు సాధించాలని కోరుకునే, అందుకోసం అన్నీ తానే అయి నడిపించే నాన్నలు ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రీడాంశాల్లో కనిపిస్తుంటారు. ఈ జాబితాలో రేసర్ మార్కో ఆంటోనెలీ పేరు కూడా చేర్చవచ్చు. రేసింగ్ డ్రైవర్‌గా పలు దిగువ స్థాయి టోర్నీలకు మార్కో కెరీర్ పరిమితమైంది. అతను ఎప్పుడూ ఎఫ్1 స్థాయికి చేరలేకపోయాడు. ఎఫ్4 స్థాయి జట్టుకు యజమానికిగా కూడా ఉన్న అతనికి తన కుమారుడి రూపంలో చాంపియన్ డ్రైవర్ కనిపించాడు. అందుకే బుడిబుడి నడకలు నేర్చిన ప్రాయంనుంచే కిమీ ఆంటోనెలి అడుగులు కార్ల వైపు నడిచేలా చేశాడు.
సహజంగానే తన తండ్రి ఆసక్తి, అక్కడి వాతావరణం కిమీని కార్ రేసింగ్‌పై ఆసక్తి పెరిగేలా చేశాయి. శిక్షణలో కూడా పూర్తి స్థాయిలో కొడుకుపైనే మార్కో దృష్టి పెట్టడంతో మరో ఆలోచన లేకుండా పోయింది. ‘15 రోజుల వయసు ఉన్నప్పుడే నేను అతడిని మొదటిసారి కార్ గ్యారేజ్‌లోకి తీసుకెళ్లాను’ అని మార్కో గుర్తు చేసుకున్నాడు. మూడేళ్ల వయసులో ‘సిమ్యులేటర్’తో రేసింగ్ ఆడుకున్న ఆ అబ్బాయి పదేళ్లు వచ్చేసరికి తండ్రి ఒళ్లో కూర్చొని ఆయన సూచనలు ఇస్తుండగా ‘లాంబోర్గిని’ని నడిపించాడు. కార్టింగ్ రేస్‌తో మొదలు పెట్టి సింగిల్ సీటర్ ఫార్ములా–4, ఆపై జీటీ సిరీస్ కార్లపై మెల్లగా కిమీకి పట్టు వచ్చింది.
ఎక్కడ అడుగు పెట్టినా, ఏది నేర్పించినా చాలా వేగంగా నేర్చుకొని వేగంగా దూసుకుపోయే తత్వంతో ఆ కుర్రాడు తండ్రికి నమ్మకం కలిగించడంతో పాటు అందరి దృష్టీ తనపై పడేలా చేశాడు. కిమీలో అసాధారణ ప్రతిభను 11 ఏళ్ల వయసులో గుర్తించిన రేసింగ్ దిగ్గజం మెర్సిడెస్ అతడిని తమ డ్రైవర్ అకాడమీలో చేర్చుకోవడం కీలక పరిణామం. దీని వల్ల కిమీ భవిష్యత్తు కోసం ఖర్చు చేయాల్సిన భారీ మొత్తం డబ్బు గురించి తండ్రి ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయింది. 17 ఏళ్ల వయసు వచ్చేసరికి ఫార్ములా–4తో పాటు ఫార్ములా–3లో కూడా యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో తిరుగులేకుండా కిమీ వరుస విజయాలు సాధిస్తూ వచ్చాడు. దాంతో మెర్సిడెస్ యాజమాన్యం అతనిలో తమ భవిష్యత్తు ఎఫ్1 డ్రైవర్‌ను చూసింది.
తమ దిగ్గజ డ్రైవర్, ఏడు చాంపియన్‌షిప్‌ల విజేత లూయిస్ హామిల్టన్ 40 ఏళ్లకు దగ్గర పడుతుండటంతో ప్రత్యామ్నాయంగా ఒక యువ డ్రైవర్‌ను ప్రోత్సహించాలని భావించి కిమీని అందుకు సరైనవాడిగా గుర్తించింది. రెండేళ్ల కాలానికి అధికారికంగా ఒప్పందం చేసుకున్న తర్వాత 2024లో అతను టెస్టు (రిజర్వ్) డ్రైవర్‌గా జట్టుతో కలిసి పని చేశాడు. అయితే కిమీ అపార ప్రతిభకు అదృష్టం కూడా కలిసొచ్చింది. మెర్సిడెస్‌ను వదిలి 2025 సీజన్‌లో ఫెరారీతో హామిల్టన్ ఒప్పందం చేసుకున్నాడు.
మెర్సిడెస్ యజమాని టోటో వాల్ఫ్... మార్కో ఆంటోనెలికి ఫోన్ చేసి ‘మీ అబ్బాయిని మా ఎఫ్1 డ్రైవర్‌గా ఎంపిక చేశాం. మీరేమంటారు’ అని అడిగాడు. అంతే... మార్కో ఒక్కసారిగా ఆనందాశ్చర్యాలకు లోనయ్యాడు. ఆ క్షణాన 19 ఏళ్ల కొడుకు ప్రస్థానాన్ని కూడా ఆయన ఎంతో గర్వపడ్డాడు. యాజమాన్యం నమ్మకాన్ని వమ్ము చేయకుండా సత్తా చాటిన కిమీ ఏడో స్థానంతో తన తొలి సీజన్‌ను ముగించాడు. ఏడాది తిరిగే లోపే ట్రాక్‌పై అదరగొట్టే ప్రదర్శనతో చాంపియన్‌గా నిలిచి ఎఫ్1 చరిత్రలో తన పేరును ప్రత్యేకంగా లిఖించుకున్నాడు. ఎఫ్1 ట్రాక్‌పై రాబోయే రోజులు తనవే అని సంకేతం ఇచ్చాడు.


