ఆస్టిన్: ఫార్ములావన్ తాజా సీజన్‌లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ కిమీ ఆంటోనెల్లి (ఇటలీ) తన జోరు కొనసాగిస్తున్నాడు. యునైటెడ్ స్టేట్స్ (యూఎస్) గ్రాండ్‌ప్రిలో 20 ఏళ్ల ఆంటోనెల్లి విజేతగా నిలిచాడు. నిర్ణీత 56 ల్యాప్‌లను ఆంటోనెల్లి అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 35 నిమిషాల 16.650 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానం సంపాదించాడు. ఈ సీజన్‌లో ఆంటోనెల్లికిది తొమ్మిదో విజయం కావడం విశేషం. 24 రేసుల ఈ సీజన్‌లో 18 రేసులు ముగిశాయి.
ప్రస్తుతం డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో ఆంటోనెల్లి 365 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. జార్జి రసెల్ (మెర్సిడెస్; 242 పాయింట్లు) రెండో స్థానంలో, లూయిస్ హామిల్టన్ (ఫెరారీ; 241 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నారు. నవంబర్ 1న జరిగే మెక్సికో గ్రాండ్‌ప్రిలో ఆంటోనెల్లి టాప్–9లో నిలిస్తే మరో నాలుగు రేసులు మిగిలి ఉండగానే అధికారికంగా ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంటాడు. అంతేకాకుండా ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టిస్తాడు


