నేటి నుంచి ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీ
జలంధర్: ప్రతిష్టాత్మక ఆసియా హాకీ పురుషుల చాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. నేటి నుంచి జరిగే ఈ పోరులో ఆరు జట్లు తలపడనున్నాయి. ఇటీవలే ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. గతంలో ఈ టోర్నీని భారత్ నాలుగుసార్లు గెలుచుకుంది. లీగ్ దశలో ఒక్కో జట్టు ఐదుగురు ప్రత్యర్థులను ఎదుర్కొంటుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 8వ స్థానంలో ఉన్న భారత్ నేడు జరిగే తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. అనంతరం టీమిండియా ఈనెల 29న చైనాతో, 30న జపాన్‌తో తలపడతుంది.
ఆ తర్వాత నవంబర్ 1, 2 తేదీల్లో మలేసియా, దక్షిణ కొరియాలను భారత్ ‘ఢీ’కొంటుంది. లీగ్ దశలో టాప్–4లో నిలిచిన టీమ్‌లు సెమీస్ చేరతాయి. నవంబర్ 5న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. పంజాబ్‌లో 17 ఏళ్ల తర్వాత ఒక అంతర్జాతీయ హాకీ టోర్నీ జరగనుండటం విశేషం. 2009లో గోల్డ్ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం ఇచ్చింది. ఈ టోర్నీ తర్వాత నలుగురు సీనియర్ ప్లేయర్ల అంతర్జాతీయ కెరీర్ ముగియవచ్చు. మన్‌దీప్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, నీలకంఠ శర్మలకు భారత్ తరఫున ఇదే ఆఖరి టోర్నీ అని హాకీ ఇండియా ఇప్పటికే వారికి తెలియజేసినట్లు సమాచారం.


