అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు  | International Narco-Cartel Busted In Northeast Under Operation Trident | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు 

Oct 26 2026 2:40 AM | Updated on Oct 26 2026 2:40 AM

International Narco-Cartel Busted In Northeast Under Operation Trident

మయన్మార్‌ నాయకుడు సహా 18 మంది అరెస్ట్‌ 

రూ.100 కోట్ల హవాలా రాకెట్‌ బట్టబయలు 

రూ.17.82 కోట్ల ఆస్తులు సీజ్‌ చేసిన ఈడీ 

డ్రగ్స్‌ ముఠాల పీచమణుస్తామన్న హోం మంత్రి అమిత్‌ షా

న్యూఢిల్లీ: నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ), మూడు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పోలీసులు కలిసి అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు చేశాయి. ఆపరేషన్‌ ట్రైడెంట్‌లో భాగంగా భారత్, మయన్మార్, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో డ్రగ్స్‌ రవాణా కార్యకలాపాలకు పాల్పడుతున్న మయన్మార్‌కు చెందిన ముఠా నాయకుడు, మరో 18 మందిని అధికారులు అరెస్ట్‌ చేశారు. 

ఈ ముఠా నడిపే 1,424 బ్యాంకు అక్కౌంట్లను స్తంభింపజేసి, సుమారు రూ.100 కోట్ల హవాలా రాకెట్‌ను అధికారులు బట్టబయలు చేశారు. ఈ ముఠా అక్రమ కార్యకలాపాల ద్వారా సంపాదించిన రూ.17.82 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేశారు. దాడుల సందర్భంగా 500 డిటోనేటర్లు, రూ.12 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. 

ఈ ఆపరేషన్‌లో భాగంగా ఈ నెల 23వ తేదీన నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ)కి చెందిన 38 బృందాలు అసోం, మిజోరం, మణిపూర్‌లలో ఏకకాలంలో 38 ప్రాంతాల్లో మెరుపు దాడులు చేపట్టాయి. అధికారులు సోదాలు జరిపిన ప్రాంతాల్లో మిజోరంలోని ఐజ్వాల్, చంఫాయ్, జోఖావ్తార్, మణిపూర్‌లోని చురాచంద్‌పూర్, అసోంలోని కచార్‌ ప్రధానంగా ఉన్నాయి. ఈ ముఠాకు చెందిన రవాణా మౌలిక సదుపాయాలు, ఆర్థిక మూలాలను దెబ్బతీయడంతోపాటు అనుమానితులు, డొల్ల కంపెనీలు, మ్యూల్‌ అక్కౌంట్లు, అక్రమ ఆర్థిక లావాదేవీలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.  

సమన్వయంతో సక్సెస్‌ 
మయన్మార్‌కు చెందిన థంగ్‌సింట్‌వాంగ్‌ అలియాస్‌ చింట్‌వాంగ్‌ అలియాస్‌ టిలువాంగా సారథ్యంలోని ముఠా సరిహద్దుల మీదుగా మెథాంఫెటమైన్, హెరాయిన్‌లను భారత్, బంగ్లాదేశ్‌ల లోపలికి సరఫరా చేస్తోంది. ‘ఈ డ్రగ్‌ కార్టెల్‌పై ఎన్‌సీబీ, రాష్ట్రాల పోలీసు నిఘా వ్యవస్థలు కన్నేసి ఉంచాయి. ఇతర విభాగాలతో సమన్వయంతో పథకం ప్రకారం పనిచేసి, విజయవంతంగా ఈ ఆపరేషన్‌ను పూర్తి చేశాయి.

 నిరంతర నిఘా సమాచారంతో ఈ ఏడాది మేలో టిలువాంగాను దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మయన్మార్‌కే చెందిన డ్రగ్స్‌ రవాణా, సరఫరాలను సమన్వయం చేసే అతడి సన్నిహితుడు వుంగ్‌ఖంథవ్‌నాను కూడా మేలోనే పట్టుకున్నారు. ప్రధాన హవాలా ఆపరేటర్‌ లాల్‌రాంపారిని ఎన్‌సీబీ 2024లోనే అరెస్ట్‌ చేసింది. ఇతడి ద్వారా ఈ నెట్‌వర్క్‌తో సంబంధమున్న రూ. 100 కోట్ల అక్రమ హవాలా లావాదేవీలు బయట పడ్డాయి. 

అనంతరం, ఈడీ అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేసింది. ఈ ముఠా అసోం కారిడార్‌ రవాణా వ్యవహారాలను పర్యవేక్షించే అబూ సాలే అలియాస్‌ సైఫుద్దీన్‌ను 2025లో అసోంలోని కచార్‌లో అరెస్ట్‌ చేశారు. ఈ విషయంలో మూడు రాష్ట్రాల పోలీసు బలగాలు, కేంద్ర సంస్థలు కలిసికట్టుగా పక్కా వ్యూహంతో ముందుకు సాగాయి’అని అధికారులు వివరించారు. టిలువాంగాపై ఇప్పటికే దేశంలో డ్రగ్స్‌ చట్టం కింద 10కి పైగా కేసులున్నాయని, మయన్మార్‌ నుంచి డ్రగ్స్‌ను ఇతడి ముఠా మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోంలకు రవాణా చేస్తోందని వెల్లడైందన్నారు.

హోం మంత్రి ప్రశంసలు 
దేశంలోకి మాదక ద్రవ్యాలను దొంగచాటుగా తరలించే ముఠాలను తుదముట్టించడం ఖాయమని హోం మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. డ్రగ్స్‌ రవాణాదారులను కట్టడి చేసేందుకు ఇటీవల చేపట్టిన ‘ఆపరేషన్‌ ట్రైడెంట్‌’అద్భుత ఫలితాలనిచ్చిందన్నారు. ఈ ముఠా నాయకుడి అరెస్ట్‌తో ‘డెత్‌ ట్రయాంగిల్‌ కారిడార్‌’గా పిలిచే భారత్, మయన్మార్, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ అంతర్జాతీయ ముఠా ఆటకట్టించామన్నారు. 2029 డిసెంబర్‌ 31వ తేదీ నాటికి దేశంలో డ్రగ్‌ నెట్‌వర్క్‌ను నామరూపాల్లేకుండా చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ప్రకటించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement