సాక్షి, హైదరాబాద్: ప్రభ్‌సిమ్రన్ సింగ్ (126 బంతుల్లో 81; 9 ఫోర్లు, 1 సిక్స్), సలీల్ అరోరా (143 బంతుల్లో 57 బ్యాటింగ్; 2 ఫోర్లు), రమణ్‌దీప్ సింగ్ (79 బంతుల్లో 52; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించడంతో... హైదరాబాద్ జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ భారీ స్కోరుకు బాటలు వేసుకుంది. సికింద్రాబాద్ జింఖానా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ ఉదయ్ సహారణ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి పంజాబ్ 90 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది. విహాన్ మల్హోత్రా (12; 2 ఫోర్లు), హర్నూర్ సింగ్ (17), ఉదయ్ సహారణ్ (16; 2 ఫోర్లు) తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా.. జషన్‌ప్రీత్ సింగ్ (84 బంతుల్లో 45; 5 ఫోర్లు) అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. హైదరాబాద్ బౌలర్లలో రక్షణ్ రెడ్డి రెండు వికెట్లు తీసుకోగా... కెప్టెన్ సీవీ మిలింద్, తనయ్ త్యాగరాజ్, అనికేత్ రెడ్డి ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఆంధ్ర 231 ఆలౌట్
సాక్షి, విజయవాడ: ఛత్తీస్‌గఢ్‌తో సోమవారం మొదలైన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు బ్యాటర్లు తడబడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 73.2 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. సీరం వెంకట రాహుల్ (173 బంతుల్లో 89; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. కేవీ శశికాంత్ (31; 1 ఫోర్, 1 సిక్స్), అభిషేక్ రెడ్డి (23; 4 ఫోర్లు), షేక్ రషీద్ (24; 4 ఫోర్లు), కెప్టెన్ రికీ భుయ్ (23; 2 ఫోర్లు, 1 సిక్స్), త్రిపురాణ విజయ్ (20; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు.
ఛత్తీస్‌గఢ్ బౌలర్లలో జయంత్ యాదవ్ 4, అజయ్ మండల్ 3, ధర్మేంద్ర సింగ్ జడేజా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఛత్తీస్‌గఢ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 14 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 35 పరుగులు సాధించింది. ఆయుశ్ పాండే (13; 3 ఫోర్లు) రనౌట్ అవ్వగా... అనూజ్ తివారీ (11 బ్యాటింగ్), మయాంక్ వర్మ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.


