ఓ యువకుడి అపహరణ, హత్య ఘటన పంజాబ్‌లో కలకలం రేపింది. పాటియాలా జిల్లాలోని దకలా ప్రాంతానికి చెందిన నవాబ్ ఖాన్ బైక్‌పై వెళ్తుండగా ఓ నల్లరంగు మహీంద్రా స్కార్పియో ఆయనను ఢీకొట్టింది. ఆ తర్వాత కారులో నుంచి దిగిన కొందరు వ్యక్తులు ఆయనపై దాడి చేసి, బలవంతంగా అదే వాహనంలో తీసుకెళ్లారు. చివరకు సంగ్రూర్ జిల్లాలోని కాలా ఝర్ గ్రామం సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న కాలువలో ఆయన మృతదేహం లభ్యమైంది.
ప్రాథమిక వివరాల ప్రకారం.. దకలా ప్రాంతంలోని ఓ పెట్రోల్ బంకు సమీపంలో నవాబ్ ఖాన్ తన బైక్‌పై వెళ్తున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన నల్లరంగు స్కార్పియో ఆయన బైక్‌ను ఢీకొట్టింది. దీంతో నవాబ్ ఖాన్ రోడ్డుపై పడిపోయారు. వెంటనే ఆ వాహనంలో నుంచి కొందరు వ్యక్తులు కిందికి దిగి ఆయనపై దాడి చేసినట్లు సమాచారం. అనంతరం ఆయనను బలవంతంగా స్కార్పియోలో ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన తర్వాత నవాబ్ ఖాన్ ఆచూకీపై అనుమానాలు నెలకొన్నాయి. మరోవైపు, సంగ్రూర్ జిల్లాలోని కాలా ఝర్ గ్రామం సమీపంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న కాలువలో ఓ మృతదేహాన్ని గుర్తించారు. అది దకలా నివాసి దర్శన్ ఖాన్ కుమారుడు నవాబ్ ఖాన్‌దిగా పోలీసులు గుర్తించారు. ఆయనను హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని కాలువలో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పాటియాలాలోని రాజీంద్ర ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా దకలాలోని పెట్రోల్ బంకు సమీపంలో నమోదైన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అపహరణకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు ఈ దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఈ ఘటనకు సంబంధం ఉన్నట్లు భావిస్తున్న మరో వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉంది. అందులో నల్లరంగు స్కార్పియో రోడ్డుపై వెళ్తుండగా, వాహనం వెలుపల ఓ వ్యక్తి చేయి వేలాడుతూ కనిపిస్తోంది. అయితే, ఆ వాహనంలో నవాబ్ ఖాన్ ఉన్నారనే విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు.
ప్రస్తుతం అనుమానితులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. నవాబ్ ఖాన్‌ను ఎందుకు అపహరించారు? ఈ ఘటన వెనుక ఎవరున్నారు? హత్యకు దారితీసిన కారణాలేంటి? అనే అంశాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.
ఇదీ చదవండి: కుంగ్‌ఫూ ఫైటర్‌లా చైనా రోబోట్.. వీడియో చూస్తే షాకే!


