రోబోటిక్స్ రంగంలో చైనా మరోసారి తన సత్తా చాటింది. చైనాకు చెందిన యూనిట్రీ రోబోటిక్స్ తాజాగా 'హెచ్2-ఎక్స్ కుంగ్ ఫూ లెజెండ్ గార్డియన్' పేరుతో ఓ హ్యూమనాయిడ్ రోబోట్ వీడియోను విడుదల చేసింది. ఇందులో రోబో చేసే విన్యాసాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రోబో కారు డోర్లను తన్నడం, సుమారు నాలుగు మీటర్ల ఎత్తు నుంచి కిందకు దూకడం, కత్తితో దాడి చేయడానికి వచ్చిన వ్యక్తిని ఎదుర్కోవడం వంటి సన్నివేశాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఇవి మాత్రమే కాకుండా.. వాహనం కింద చిక్కుకున్న వ్యక్తిని కాపాడేందుకు కారును పైకి ఎత్తడం కూడా వీడియోలో కనిపిస్తోంది.
ఈ వీడియోను షేర్ చేసిన యూనిట్రీ సంస్థ.. రోబోట్ స్టాండ్‌బై మోడ్‌లో సుమారు ఎనిమిది గంటల వరకు పనిచేయగలదని వెల్లడించింది. అయితే, వీడియోలో చూపించిన విన్యాసాలను రోబోట్ తనంతట తానే చేసిందా? లేక ముందుగా ప్రోగ్రామ్ చేసిన సూచనల ప్రకారం పనిచేసిందా? అనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. క్లిష్టమైన పనులు చేస్తున్నప్పుడు బ్యాటరీ ఎంతసేపు పనిచేస్తుంది, ఈ రోబోట్ ధర ఎంత, ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది అనే వివరాలపైనా స్పష్టత ఇవ్వలేదు.
ఈ వీడియోకు ఇప్పటికే సుమారు కోటి వ్యూస్ రావడంతో నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. రోబోట్ కదలికలు మనుషుల కదలికలను తలపిస్తున్నాయని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం రోబోట్లకు ఇలాంటి పోరాట సామర్థ్యాలు నేర్పడం ఎంతవరకు సరైనదని ప్రశ్నిస్తున్నారు. పేదలకు ఇళ్లు నిర్మించడం, గిడ్డంగుల్లో వస్తువులను తరలించడం, పరిశ్రమల్లో ప్రమాదకరమైన పనులు చేయడం వంటి ఉపయోగకరమైన పనుల కోసం ఈ సాంకేతికతను అభివృద్ధి చేస్తే బాగుంటుందని ఇంకొందరు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఇదీ చదవండి: AI రంగంలో అద్భుతం.. వచ్చేస్తోంది డెస్సా!
హెచ్2 రోబోట్ ప్రారంభ ధర 29,900 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. అయితే.. కొత్త H2-X మోడల్ ధరను సంస్థ ఇంకా వెల్లడించలేదు. అలాగే.. వీడియోలో కనిపించిన సామర్థ్యాలు నిజ జీవిత పరిస్థితుల్లో ఎంతవరకు పనిచేస్తాయనే దానిపై కూడా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Unitree Introducing: H2-X Kung Fu Legend Guardian🤖 Powerful performance to serve and guard you, with a maximum endurance of approximately 8 hours. Please use the robot safely and in a friendly manner. https://t.co/5RU5kDzSUK
— Unitree (@UnitreeRobotics) October 21, 2026


