అమెరికా, చైనా సంబంధాలు భేష్‌!  | Donald Trump, Xi Jinping Hold Bilateral Meeting In The White House | Sakshi
Sakshi News home page

అమెరికా, చైనా సంబంధాలు భేష్‌! 

Sep 26 2026 5:54 AM | Updated on Sep 26 2026 5:54 AM

Donald Trump, Xi Jinping Hold Bilateral Meeting In The White House

ట్రంప్‌ కితాబు

వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌తో చర్చలు  

ఏఐపై కలిసి ముందుకు... 

మానవ నియంత్రణ అవసరం: షీ 

తైవాన్‌పై అమెరికాకు హెచ్చరిక

వాషింగ్టన్‌: అమెరికా, చైనా దేశాల సంబంధాలు ‘ఎన్నడూ లేనంత మెరుగ్గా’ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. భవిష్యత్తు తరాలకు అభివృద్ధి, భద్రతలను అందించేందుకు ఇరుదేశాలు భవిష్యత్తులోనూ పరస్పర సహకారాన్ని బలపరచుకోవచ్చునన్న ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం వైట్‌హౌస్‌ ఓవల్‌ అఫీసులో సుమారు రెండు గంటలపాటు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ట్రంప్‌ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.

 అనంతరం ఇరువురు నేతలు విలేకరులతో మాట్లాడారు. అమెరికా–చైనా సంబంధాలు మరో చారిత్రక మలుపు వద్దకు చేరుకున్నాయని షీ తెలిపారు. ట్రంప్‌తో నిజాయతీగా, లోతైన చర్చలు జరిపామని, అనేక అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చామని చెప్పారు. ఈ చర్చలు నిర్మాణాత్మక, వ్యూహాత్మకంగా స్థిరమైన ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త బలం చేకూర్చిందని వివరించారు. ఈ సందర్బంగానే ఇరు దేశాల మధ్య చారిత్రక సంబంధాలను నేతలు ప్రస్తావించారు. చైనా దౌత్యవేత్తలు 158 ఏళ్ల క్రితమే బోస్టన్‌ను సందర్శించారని ట్రంప్‌ తెలపగా...రెండో ప్రపంచ యుద్ధంలో ఇరు దేశాల సహకారాన్ని షీ గుర్తుచేశారు.  

తైవాన్‌పై స్పష్టమైన హెచ్చరిక 
ఓవల్‌ ఆఫీసులో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో తైవాన్‌ అంశంపై చైనా తన వైఖరిని స్పష్టం చేసింది. ఈ విషయంలో అమెరికా జాగ్రత్తగా వ్యవహరించాలని షీ సూచించారు. కృత్రిమ మేధస్సు విషయంలో ఇరు దేశాలు తమ బలాలను సమర్థంగా వాడుకోవాలని సూచించారు. ఏఐతో రాగల ప్రమాదాలు, ప్రయోజనాలపై చర్చలు కొనసాగించడంతోపాటు, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కలిసి పని చేయాలన్నారు. కృత్రిమ మేధస్సుపై మానవ నియంత్రణ కొనసాగాలని, ప్రజా సంక్షేమం కేంద్రంగా విధానాల రూపకల్పన జరగాలని చెప్పారు. ఏఐని మానవ ప్రగతికి ఉపయోగించేలా చూడాలని 
తెలిపారు. 

అధికారిక విందులో టెక్‌ దిగ్గజాలు... 
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ గౌరవార్థం వైట్‌హౌస్‌లోని ఈస్ట్‌రూమ్‌లో ఘనమైన విందు ఏర్పాటైంది. ఇరుదేశాల సంప్రదాయ వంటకాలతో నిండిన ఈ విందులోనే ట్రంప్‌ అమెరికా జాతీయ చిహ్నమైన గద్ద ప్రతిమను షీకి బహుకరించారు. విందుకు ఇరు దేశాల ప్రతినిధి బృందాల్లోని మంత్రులు, ఉన్నతాధికారులు ఐటీ కంపెనీల ప్రముఖులు హాజరయ్యారు. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్, ఎన్‌విడియా సీఈవో జెన్సన్‌ హువాంగ్, మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్, ఓపెన్‌ ఏఐ సీఈవో సామ్‌ 

ఆల్ట్‌మన్, గూగుల్‌ సీఈవో సుందర్‌ 
చాయ్, టెస్లా, స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్, మైక్రాన్‌ సీఈవో సంజయ్‌ మెహ్రోత్రా, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్, డెల్‌ అధినేత మైఖేల్‌ డెల్‌ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, అమెరికా, చైనా అధ్యక్షుల విందు సందర్భంగా కొంతమంది ఆందోళన కారులు వైట్‌హౌస్‌ సమీపంలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టిబెట్‌కు స్వేచ్ఛ కల్పించాలని కొందరు, హాంకాంగ్, ఈస్ట్‌ తుర్కిస్థాన్‌ల స్వేచ్ఛపై మరికొందరు నినాదాలు చేశారు. మరికొంత మంది షీ అమెరికా పర్యటనపై తమ నిరసన వ్యక్తం చేశారు.  

విందు మెనూ...
ళీ    విందులో గుమ్మడికాయ, పసుపులతో చేసిన సూప్, అడవి పుట్టగొడుగులు, పంది మాంసంతో చేసిన ఇటాలియన్‌ వంటకం పాన్‌సెట్టాలను స్టార్టప్‌లుగా వడ్డించారు. ప్రధాన వంటకాలుగా నువ్వుల సీ బాస్‌ చేప, బేబీ బక్‌చోయ్, వంకాయ, ప్రత్యేక సాస్‌లు ఏర్పాటు చేశారు. డెజర్ట్‌లుగా వెనీలా క్రీమ్యూ, పుల్లని చెర్రీ మిశ్రమం, వాల్‌నట్‌ ఫ్రాంజిపేన్, తేనెతో కూడిన ఐస్‌క్రీమ్‌ను 
అందించారు.  

అమెరికన్‌ విద్యార్థులకు ఆహ్వానం
చైనాను సందర్శించేందుకు, చదువుకునేందుకు రానున్న ఐదేళ్లలో లక్షమంది అమెరికన్‌ విద్యార్థులను ఆహ్వానిస్తామని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం వైట్‌హౌస్‌లో షీ మాట్లాడుతూ ఇరు దేశాల సంబంధాల భవిష్యత్తు యువతరంపై ఆధారపడి ఉందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement