ఒకే గురువు దగ్గర శిష్యరికం. దాదాపు ఒకే తరహా నేపథ్యం. తొలి సినిమాతోనే మాంచి సక్సెస్‌తో పాటు దర్శకులుగానూ ప్రత్యేక ముద్ర. కానీ రెండో అడుగులో మాత్రం ఘోరమైన తడబాటు!. కారణం.. ‘భారీ’ అంచనాలేనా?. ఇలా ఇద్దరు యువ దర్శకుల కెరీర్ ఒకే పాయింట్ దగ్గరికి వచ్చి ఆగింది. పైగా ఈ ఇద్దరూ ఈ ఏడాది తమ రెండో సినిమాలతోనే చేదు ఫలితాన్ని చవిచూడటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సుకుమార్ శిష్యుడిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బుచ్చిబాబు సనా.. దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే సంచలనం సృష్టించారు. వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా తెరకెక్కిన ‘ఉప్పెన’ భారీ విజయాన్ని అందుకోవడంతో బుచ్చిబాబుపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. తొలి సినిమాతోనే రా అండ్ రస్టిక్ ట్రీట్‌మెంట్‌తో ఆకట్టుకున్నారనే గుర్తింపు వచ్చింది.
ఆ తర్వాత బుచ్చిబాబుకు ఏకంగా రామ్‌చరణ్‌తో సినిమా చేసే అవకాశం వచ్చింది. భారీ బడ్జెట్, స్టార్ హీరో, పాన్ ఇండియా స్థాయి అంచనాలతో ‘పెద్ది’ తెరకెక్కింది. దీంతో ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు స్థాయి మరింత పెరుగుతుందని అందరూ భావించారు. కానీ ‘పెద్ది’ అంచనాల మేరకు అలరించలేకపోయింది. రామ్‌చరణ్ నటనకు ప్రశంసలు వచ్చినప్పటికీ.. కథనం, కొన్ని సన్నివేశాలు, పాత్రల చిత్రీకరణపైనా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో వాటిని తొలగించాల్సి వచ్చింది.

మాస్ ముద్రే దెబ్బేసిందా?
ఇదే సమయంలో సుకుమార్ మరో శిష్యుడు శ్రీకాంత్ ఓదెల కూడా అదే పరీక్షను ఎదుర్కొన్నారు. నానితో ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం ‘దసరా’. తెలంగాణ నేపథ్యంలో బొగ్గు గనుల గ్రామీణ వాతావరణం, మాస్ ట్రీట్‌మెంట్, ఎమోషన్స్‌తో ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తొలి సినిమాతోనే శ్రీకాంత్ ఓదెల తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని చూపించారు.
‘దసరా’ తర్వాత సహజంగానే ఆయన రెండో సినిమాపై అంచనాలు పెరిగాయి. అందులోనూ మరోసారి నానితోనే జతకట్టి భారీ స్థాయిలో ‘ది ప్యారడైజ్’ తెరకెక్కించారు. ఈసారి కథ, స్కేల్, యాక్షన్ విషయంలో మరింత పెద్ద ప్రయత్నం చేశారు. ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ ఆసక్తి నెలకొంది.
అయితే సినిమా విడుదలైన రోజే ప్రేక్షకుల స్పందన పూర్తిగా ఏకపక్షంగా లేకుండా తీర్పు వచ్చేసింది. అంత భారీతనాన్ని హ్యాండిల్ చేయలేకపోయాడనే విమర్శ బలంగా వినిపిస్తోంది. కథా.. కథనం, ట్రీట్‌మెంట్‌పై చాలామంది ప్రేక్షకులు పెదవి విరిచేస్తున్నారు. ముఖ్యంగా హీరో-విలన్ల కాన్‌ఫ్లిక్ట్‌నే సరిగ్గా హ్యాండిల్ చేయకపోయాడనే రీమార్క్ వినిపిస్తోంది. దీంతో ‘దసరా’తో వచ్చిన స్థాయి స్పందనను రెండో సినిమాతో శ్రీకాంత్ ఓదెల అందుకోలేకపోయారనే చర్చ మొదలైంది.

ఇక్కడే సుకుమార్ శిష్యుల కథలో ఆసక్తికరమైన పోలిక కనిపిస్తోంది. ఇద్దిరిపైనా గురువు ప్రభావం ఉందని, ఆ తాలుకా ప్రభావంతో కథ చెప్పే విధానాన్ని తమదైన శైలిలో చూపించారు. కానీ రెండో సినిమాకు వచ్చేసరికి హీరోల స్థాయి, బడ్జెట్, అంచనాలు అన్నీ భారీగా పెరిగాయి. ఆ స్థాయికి తగ్గట్టుగా ప్రేక్షకుల్ని మెప్పించడంలో ఘోరంగా తడబడ్డారు.. ప్చ్!.


