ఆ విగ్రహం... ఓ స్టార్ ఎట్రాక్షన్ | Mammootty Visits Statue Of Unity Latest | Sakshi
Sakshi News home page

Mammootty: ప్రపంచంలోని అతి ఎత్తయిన విగ్రహం చెంత సినీ ప్రముఖులు

Sep 24 2026 12:26 PM | Updated on Sep 24 2026 12:50 PM

Mammootty Visits Statue Of Unity Latest

దేశంలోని వివిధ ప్రసిద్ధ పర్యాటక కేంద్రాల్లో ఇకపై ప్రతి ఏడాది జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం నిర్వహిస్తామని, తద్వారా పర్యాటకం, సినీ ఇండస్ట్రీలని అనుసంధానించడం జరుగుతుందని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇప్పటికే ప్రకటించేశారు. అందుకు తగ్గట్టే, తాజాగా 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానం జరిగిన గుజరాత్‌లోని ఏక్తానగర్ ప్రాంతంలోని దర్శనీయ స్థలాలకు సినీ ప్రముఖులని తీసుకువెళ్లారు. అలా మరోసారి ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ వార్తల్లో నిలిచింది.

నర్మదా నదీ తీరంలో... సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్‌కు చేరువలో
గుజరాత్‌లోని బరోడా (వడోదరా) నుంచి దాదాపు 2 గంటల రోడ్డు ప్రయాణ దూరంలోని కేవడియా (సరికొత్త పేరు ఏక్తానగర్‌) ఓ గిరిజన నివాసం. అక్కడ వింధ్యాచల్, సాత్పూరా పర్వతాల నడుమ నుంచి నర్మదా నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతంలో దశాబ్దాల కలగా నిర్మాణమైన భారీ ‘సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్’ మాత్రమే చాలాకాలంగా అక్కడి ప్రాంతీయ పర్యాటక దర్శనీయ స్థలం. రెండు పర్వత ప్రాంతాల నడుమ కట్టిన ఈ భారీ సాగు, విద్యుత్ నీటి ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇప్పుడు ఆ దిగువనే నదీ తీరంలో 2018లో నిర్మాణమైన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ (సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ భారీ విగ్రహం) తోడైంది. అమెరికాలోని ‘స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’ లాంటి వాటినన్నిటినీ తలదన్నేలా, ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన విగ్రహ నిర్మాణంగా తయారైన ఈ విగ్రహం ఇప్పుడు అక్కడ ఓ భారీ పర్యాటక ఆకర్షణ.

హైదరాబాద్ సంస్థాన విలీన విశేషాలూ ఆ గ్యాలరీలో
182 మీటర్ల ఎత్తైన ఆ భారీ విగ్రహ నిర్మాణం, ఆవిష్కరణ ఎనిమిదేళ్ళ క్రితం పూర్తయ్యేసరికి, ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి. రోడ్లు, ప్రాథమిక వసతి సౌకర్యాలు, పర్యాటకులకు ఎన్నెన్నో హోటల్స్ వెలిశాయి. సుదూర ప్రాంతాల నుంచి సైతం పర్యాటకులను ఆకర్షిస్తున్న ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ విగ్రహం ముంగిటే, బస్సులు నిలిపే సువిశాల ప్రాంగణంలో తాజా జాతీయ అవార్డుల ప్రదానం జరిగింది. 

ఇదీ చ‌ద‌వండి: జాతీయ అవార్డుల్లో ఆ ముగ్గురికి స్టాండింగ్ ఒవేష‌న్‌

అవార్డుల ప్రదానం జరిగిన తర్వాత రోజు అనగా బుధవారం సినీ ప్రముఖులు పలువురు ప్రత్యేకంగా ఆ విగ్రహం చెంతకు వెళ్ళి, ఆ భారీ నిర్మాణాన్నీ సందర్శించారు. పటేల్ భారీ విగ్రహ పాదాల కిందనే, భారీ గ్యాలరీలో ఆ మహానాయకుడి జీవిత కథ, భారీ విగ్రహం తాలూకు నిలువెత్తు నమూనా విగ్రహం, అలాగే నిజాం, మైసూర్ తదితర సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసేందుకు పటేల్ సాగించిన కృషిని, అప్పటి పత్రికల్లోని వార్తా కథనాల ఫోటోలు వగైరాలను సందర్శకుల దర్శనార్థం ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.

కేవలం 38 సెకన్ల వ్యవధిలో లిఫ్ట్ ద్వారా ఆ భారీ విగ్రహం ఛాతీ ప్రాంతం దాకా పర్యాటకులు చేరుకోవచ్చు. అంత ఎత్తు నుంచి నర్మదా నది, సర్దార్ సరోవర్ డ్యామ్ తదితర దృశ్యాలను విహంగ వీక్షణం చేయవచ్చు. పటేల్ విగ్రహం పాదాల చెంత నిల్చొని, ఫోటోలు, వీడియో తీసుకోవచ్చు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న సినీ ప్రముఖులు మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్, సంజయ్ మిశ్రా, వివిధ అవార్డుల జ్యూరీ సభ్యులు తదితరులు సర్దార్ పటేల్ భారీ విగ్రహాన్ని ప్రత్యేకంగా దర్శించారు.

సతీ సమేతంగా స్నేహితులతో కలసి మమ్ముట్టి
ఉత్తమ నటుడి అవార్డు విజేత హోదాలో ప్రభుత్వ అతిథిగా విచ్చేసిన సుప్రసిద్ధ హీరో మమ్ముట్టి ప్రత్యేకంగా తన సతీమణి సుల్ఫత్‌తో, సన్నిహిత మిత్రులతో కలసి విగ్రహాన్ని సందర్శించారు. ఈయన వెంట మలయాళ సినీ నిర్మాతలు ఆంటో జోసెఫ్, జార్జ్ తదితరులు ఉన్నారు. నేషనల్ అవార్డుల ప్రదానోత్సవాన్నీ, పర్యాటకాన్నీ మిళితం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సరికొత్త సంకల్పానికి ఇలా ప్రపంచంలోని అతి ఎత్తైన విగ్రహం సాక్షిగా తొలి అడుగులు పడినట్టే అనిపిస్తోంది. 

- గుజరాత్‌లోని ఏక్తా నగర్ నుంచి ఆర్. జయ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement