రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి అవార్డు స్వీకరిస్తున్న మమ్ముట్టి
72వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం
72వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో స్టార్స్‌కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచన
‘‘దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సినీ నటులకు దేశ ప్రజలను, ముఖ్యంగా యువతను ప్రభావితం చేసే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. స్టార్స్ క్రమశిక్షణతో కూడిన జీవన శైలి ప్రాముఖ్యత గురించి మాట్లాడితే... ప్రజలు ఆసక్తిగా వింటారు. ఆ మాటలను, వాళ్లను అనుకరిస్తారు. అందుకే భారతదేశంలో ఉన్న అగ్ర శ్రేణి సినీ తారలందరికీ సూచిస్తున్నాను. ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులను ప్రచారం చేయవద్దు... సపోర్ట్ చేయవద్దు. స్టార్ అంటే వెలుగుని పంచేవాళ్లు... చీకటిని కాదు’’ అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
ప్రతిష్ఠాత్మక జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో జరిగింది. ప్రతి ఏడాది ఢిల్లీలో జరిగే ఈ జాతీయ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఈసారి గుజరాత్‌లో నిర్వహించారు. ఈ ఏడాది జూలై 18న 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాల విజేతలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024 ఏడాదికిగాను ఎంపిక చేసిన ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు రాష్ట్రపది ద్రౌపది ముర్ము పురస్కారాలతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు.
జ్యూరీలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలి
ఈ అవార్డుల ప్రదానోత్సవంలో ద్రౌపది ముర్ము ఇంకా మాట్లాడుతూ – ‘‘ఒక సినిమా నిర్మాణానికి ఎంతో మంది కృషి ఉంటుంది. అవార్డులు గెలుచుకున్న విజేతలను నేను కోరేదేంటంటే... మీరు అవార్డులు గెలుచుకునేందుకు కారకులైన మీ చిత్రబృందంలోని సభ్యులందరికీ నా అభినందనలను తప్పక తెలియజేయండి. మీరందరూ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు (క్రియేటివ్ ఎకానమీ) ప్రముఖ ప్రతినిధులు.
ఈ ఆర్థిక వ్యవస్థకు సహకరిస్తున్న సినీ కార్మికులు, చిన్న కళాకారులు, సహాయకులు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులకు గౌరవం, సామాజిక భద్రత లభించాలనే విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోవాలి. ఈ రోజు అవార్డులు స్వీకరించిన కళాకారుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. కాబట్టి అవార్డుల జ్యూరీ ప్యానెల్‌లో కూడా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఏ రంగంలోనైనా మహిళల ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వివిధ భాషలు, ప్రాంతాలకు చెందిన చిత్రాలతో ఈ ప్రాంగణంలో అంతర్లీనంగా భారతీయత స్ఫూర్తి కనిపిస్తోంది’’ అని అన్నారు.
72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని సీనియర్ నటుడు అనంత్ నాగ్ అందుకున్నారు. జాతీయ ఉత్తమ నటుడి విభాగంలో ఇద్దరు నటులు మమ్ముట్టి (భ్రమయుగం), కార్తీక్ ఆర్యన్ (చందు ఛాంపియన్), ఉత్తమ నటి అవార్డును యామీ గౌతమ్ (ఆర్టికల్ 370), ఉత్తమ చిత్రం విభాగంలో ఇదే సినిమాకి నిర్మాత ఆదిత్య ధర్, ‘అమరన్’ చిత్రానికి దర్శకుడి అవార్డుని రాజకుమార్ పెరియసామికి ప్రదానం చేశారు.
తెలుగు సినిమాకు 9 అవార్డులు లభించాయి. జాతీయ స్థాయిలో సకుటుంబ వినోదం అందించి, ప్రజాదరణ పొందిన ఉత్తమ చిత్రంగా ఎంపికైన ప్రభాస్ ‘కల్కి’ నిర్మాత
సి. అశ్వినీదత్, దర్శకుడు నాగ్ అశ్విన్ అవార్డులు అందుకున్నారు. అలాగే ఉత్తమ బాలల చిత్రం ‘35... చిన్న కథ కాదు’ నిర్మాత సృజన్ ఎర్రబోలు, (మరో నిర్మాత – నటుడు విశ్వదేవ్ రాచకొండ), దర్శకుడు నంద కిశోర్ ఈమని అవార్డులు అందుకున్నారు.
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా డైరెక్టర్ సుకుమార్ (‘పుష్ప–2’), ఉత్తమ సంభాషణల రచయితగా దర్శకుడు వెంకీ అట్లూరి (‘లక్కీ భాస్కర్’) పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ బాల నటుడు (అరుణ్ దేవ్‌పోతుల – ‘35 చిన్న కథ కాదు’), ఉత్తమ ప్రోడక్షన్ డిజైన్ (నితిన్ జిహానీ చౌధరీ – ‘కల్కి’), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ (దీపాలీ నూర్, శీతల్ ఇక్బాల్ చంద్ శర్మ – ‘పుష్ప2’), ఉత్తమ మేకప్ (పసుపులేటి రవికుమార్ – ‘కమిటీ కుర్రోళ్ళు’) కేటగిరీల్లోనూ పురస్కారాలు అందుకున్నారు.
ఈ అవార్డు నా ఒక్కడిది మాత్రమే కాదు!
– దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారగ్రహీత అనంత్ నాగ్
‘‘ఈ సందర్భంగా నటుడిగా నా 50 ఏళ్ల ప్రయాణంలో నాకు తోడుగా నిలిచినవారందరినీ గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. ఈ అవార్డు కేవలం నా ఒక్కడిదే కాదు. నాతో అవిశ్రాంతంగా పని చేసిన ప్రతి నిర్మాత, దర్శకుడు, సంభాషణల కథారచయిత, గీత రచయిత, ఛాయాగ్రాహకుడు, కాస్ట్యూమ్ డిజైనర్, మేకప్ ఆర్టిస్ట్, ప్రోడక్షన్ మేనేజర్, సహాయకులు మరియు సహచరులందరికీ చెందుతుంది. ఐదున్నర దశాబ్దాలుగా నా పాత్రలను మనసుతో ఆదరించిన లక్షలాది మంది ప్రేక్షకులకు కూడా చెందుతుంది’’ అని దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారగ్రహీత అనంత్ నాగ్ భావోద్వేగంగా ప్రసంగించారు.
ఇంకా మాట్లాడుతూ– ‘‘గతంలో దాదాపు ఐదేళ్ల కాలంలో సుమారు 50 నాటకాలలో నటించాను. అవే నా నటనకు శిక్షణా వేదికగా నిలిచాయి. ఆ తర్వాత నాకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ముందు కన్నడలో, ఆపై శ్యామ్ బెనెగల్, ఎం.ఎస్. సత్యు వంటి ప్రముఖ దర్శకుల చిత్రాల్లో హిందీలోనూ నటించాను. కర్ణాటకలో అద్భుతమైన అవకాశాలు లభించాయి.
అందుకే బెంగ ళూరులో స్థిరపడాలనుకున్నా. అదే నా ‘కర్మభూమి’గా మారింది. గత 50 ఏళ్లల్లో ఇతర భాషల్లోనూ ఎన్నో సినిమాలు చేశాను. కానీ నాకు అత్యుత్తమ అవకాశాలు, నటనకు మంచి గుర్తింపు కన్నడ చిత్రాల ద్వారా లభించాయి. నా నటనా ప్రతిభ పట్ల అక్కడి వారికి ఉన్న గౌరవం కారణంగా నేను కర్ణాటకకు రాయబారిగా వెళ్లాను’’ అని అనంత్ నాగ్ అన్నారు.
ఈ అవార్డు మా ఆవిడదే!
– ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత అవార్డు అందుకున్న దర్శకుడు సుకుమార్
ఈ అవార్డు వేడుకకు సతీమణి తబితతో కలిసి హాజరయ్యారు సుకుమార్. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ– ‘‘మా సినిమాను దేశవ్యాప్తంగా ఎంతమంది ఇష్టపడ్డారో ఇక్కడ చూస్తుంటే మరోసారి అర్థమైంది. అందరి కష్టంతో రూ పొందిన ఓ భారీ సినిమాకు వాణిజ్య విజయంతో పాటు పురస్కారాలు సైతం రావడం ఎప్పుడూ ఆనందమే ఇస్తుంది. గతంలో ‘పుష్ప’కు అవార్డులు వ
చ్చాయి. అయితే ‘పుష్ప–2’కి ఇది నాకు వ్యక్తిగతంగా వచ్చిన తొలి నేషనల్ అవార్డు కావడం నా కన్నా నా సతీమణికి ఎక్కువ సంతోషాన్నిచ్చింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకొని వేదిక దిగాక ఆ అవార్డు మా ఆవిడ చేతిలోనే పెట్టాను. ఆమె కళ్ళల్లో ఆనందం కోసమే ఈ శ్రమంతా. అందుకే, ఈ అవార్డు నాది కాదు... నన్ను సహించి, భరించి, నిత్యం నన్ను ్రపోత్సహించే మా ఆవిడది’’ అని వ్యాఖ్యానించారు.

తెలుగు విజేతల ఆనంద దృశ్యం
అవార్డు విజేతలుగా నిలిచిన తెలుగు సినీ ప్రముఖులు పరస్పరం అభినందించుకుంటూ, రెడ్ కార్పెట్ ఏరియా వద్ద ప్రత్యేకంగా ఫోటోలు దిగారు. ప్రధాన జ్యూరీలో ఉన్న దర్శకుడు వి.ఎన్. ఆదిత్యను సైతం కలుపుకొని, కెమెరా ముందు తమ చేతుల్లోని అవార్డులను ప్రదర్శించడం ఫోటో ఆఫ్ ది డేగా మారింది. నటి, ‘కమిటీ కుర్రోళ్ళు’ నిర్మాత నిహారిక కొణిదెల తోటి అవార్డు విజేతలతో కలసి ఫోటోలు దిగడమే కాక, మరింత ప్రోఫెషనల్‌గా ఫోటోలు తీస్తానంటూ దర్శకులందరినీ నిలబెట్టి, తానే స్వయంగా ఆ ఆనంద క్షణాలను ఫోన్‌లోని కెమెరాలో బంధించారు.

గుజరాత్‌లో జరిగిన 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను
కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. 2024 ఏడాదికిగాను ఎంపిక చేసిన ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు రాష్ట్రపది ద్రౌపది ముర్ము పురస్కారాలతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురి విజేతల స్పందన ఈ విధంగా... ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడం చాలా గౌరవంగా ఉంది. నా జీవితకాలం గుర్తుండిపోయే గొప్ప గౌరవం ఇది. నాతో పాటు కొన్నేళ్లుగా నటుడిగా నా పనిని చూస్తూ, సపోర్ట్ చేస్తూ, సెలబ్రేట్ చేసుకుంటూ, కనెక్ట్ అయి ఉన్న అందరికీ ఈ అవార్డు చెందుతుంది. నా ప్రయాణంలో భాగమైన అందరికీ ధన్యవాదాలు. – మమ్ముటీ
ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. యాక్టర్ అవుతానంటే మన వైపు చూసి నవ్వే వాతావరణం ఉన్న గ్వాలియర్ అనే చిన్న పట్టణం నుంచి వచ్చిన ఒక సాధారణ వ్యక్తిగా ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు నవ్వు వస్తోంది. యాక్టర్‌గా ఎదిగే ధైర్యం చేశాను. దేశంలోని ప్రతి నటుడి కల... జాతీయ ఉత్తమ యాక్టర్‌గా నిలవాలని. ఫైనల్‌గా ఇప్పుడు ఒక మంచి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
భారతదేశపు మొట్టమొదటి పారాలింపిక్ స్వర్ణ పతక విజేత మురళీకాంత్ పేట్కర్ సార్ జీవితం ఆధారంగా రూ పొందిన ‘చందు ఛాంపియన్ ’ సినిమాలో నటించే అవకాశం కల్పించిన మురళీకాంత్ పెట్కర్, దర్శకుడు కబీర్ ఖాన్ , నిర్మాత సాజిద్‌గార్లకు ధన్యవాదాలు. భారతదేశంలో ఉన్న ప్రతి పారా ఒలింపియన్ తో నా ఈ గౌరవాన్ని పంచుకుంటున్నాను. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముగారికి, జ్యూరీకి, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు. మరిన్ని మైలురాళ్లను చేరుకునే నా ప్రయాణంలో ఇదొక ఆరంభమని భావిస్తున్నాను. – కార్తీక్ ఆర్యన్
‘‘ప్రతి ప్రయాణంలోనూ, మనం ఆ ప్రయాణాన్ని ఎందుకు వదిలిపెట్టకూడదో గుర్తుచేసే ఒక క్షణం ఉంటుంది. ఈ రోజు నాకు అలాంటి క్షణమే. ‘ఆర్టికల్ 370’ చిత్రానికి ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం అందుకోవడం అనేది నా జీవితాంతం నేను గుర్తుపెట్టుకునే ఒక గొప్ప గౌరవం. ‘ఆర్టికల్ 370’ సినిమా కథను నేను ఎంతో నమ్మాను. మా నిర్మాణ సంస్థలో ఈ సినిమాను నిర్మించినందువల్ల ఈ గుర్తింపు నాకు మరింత భావోద్వేగంగా అనిపిస్తోంది. నీ ప్యాషన్ ను వదులుకోకుండా పట్టుదలగా ఉన్నప్పుడే కలలు నిజం అవుతాయి.
తమ కలను నిజం చేసుకోవాలని కల కనే ప్రతి ఒక్కరికోసం ఈ అవార్డు. ఎప్పటికీ నమ్మకాన్ని కోల్పోకండి. ఇక ఈ పురస్కారం ఒక కలకి ముగింపు కాదు, ఇది ఒక గొప్ప బాధ్యతకు నాంది. 14 సంవత్సరాలుగా నా వత్తికి కట్టుబడి, నా నటననే మాట్లాడేలా ప్రయత్నించాను. ఎన్నో సంవత్సరాలుగా నా హృదయంలో నేను మోస్తున్న కల ఇది. ఈ రోజు ఎంతో కృతజ్ఞతతో ఈ అవార్డును స్వీకరిస్తున్నాను’’ అంటూ సోషల్‌మీడియా వేదికగా ఓ సుధీర్ఘమైన నోట్‌ను షేర్ చేశారు యామీగౌతమ్.


