హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో సినీ ప్రముఖుల సందడి | Hyderabad Airport Buzzes as Film Personalities Transit for 72nd National Film Awards | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో సినీ ప్రముఖుల సందడి

Sep 21 2026 11:49 PM | Updated on Sep 21 2026 11:49 PM

Hyderabad Airport Buzzes as Film Personalities Transit for 72nd National Film Awards

జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవానికి దేశం నలుమూలల నుంచి వివిధ భాషల సినీ ప్రముఖులు మంగళవారం జరిగే గుజరాత్‌లోని ఏక్తానగర్‌కు తరలివచ్చారు. ఏక్తానగర్‌కు నేరుగా ఫ్లయిట్‌ లేకపోవడంతో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులు పలువురు హైదరాబాద్‌ మీదుగా అక్కడకు ప్రయాణించారు. దాంతో, ఆదివారం, సోమవారం హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ విమానాశ్రయం సినీ రంగ ప్రముఖులు, అవార్డుల జ్యూరీ సభ్యులతో కళకళలాడింది.

2024వ సంవత్సరానికి గాను ఇస్తున్న 72వ జాతీయ అవార్డుల్లో ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీ జ్యూరీకి సారథ్యం వహించిన ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు జయరాజ్‌ సోమవారం హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఉత్సాహంగా అందరితో కలసి ఫొటోలు దిగుతూ కనిపించారు. జ్యూరీ సభ్యులందరితో కలసి ఆయన స్వయంగా సెల్ఫీలు దిగారు. 

అలాగే సెంట్రల్‌ జ్యూరీకి తెలుగు నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ దర్శకుడు వి.ఎన్‌.ఆదిత్య, సుప్రసిద్ధ డ్యాన్స్‌ మాస్టర్‌ కళ, సినిమాపై ఉత్తమ రచనల్ని ఎంపిక చేసిన జ్యూరీకి నేతృత్వం వహించిన ప్రముఖ మలయాళ జర్నలిస్ట్‌ ఫిల్మ్‌ క్రిటిక్‌ ఎ. చంద్రశేఖర్ కనిపించారు. అలాగే, నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీ జ్యూరీలో పనిచేసిన కన్నడ దర్శకురాలు తృప్తి, తమిళ దర్శకుడు ఈపీ గణేశ్‌బాబు, ప్రిలిమినరీ సౌత్‌ జ్యూరీలో సభ్యులైన తెలుగువారు ఎం.ఎస్‌.ప్రసాద్, ప్రశాంతి హారతి తదితరులు విమానాశ్రయంలో పరస్పరం పలకరించుకుంటూ, జ్యూరీ సభ్యులుగా గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. 
    
విజయేంద్ర ప్రసాద్‌ను చుట్టుముట్టిన కెమెరాలు  
అత్యుత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఎంపికైన ‘కల్కి’ చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్, ఆ చిత్ర నిర్మాత సి.అశ్వినీదత్, ప్రముఖ సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు వి. విజయేంద్ర ప్రసాద్‌ తదితరులు అందరి దృష్టినీ ఆకర్షించారు.  అలాగే, ప్రముఖ తమిళ సినీ పీఆర్‌వో డైమండ్‌ బాబు తదితరులు ఎయిర్‌పోర్ట్‌లో అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ కనిపించారు. వడోదరా విమానాశ్రయంలో దిగి బయటకు రాగానే, రచయిత విజయేంద్ర ప్రసాద్‌ను స్థానిక టీవీ మీడియా ప్రతినిధులు గుర్తుపట్టి అవార్డుల ప్రదానోత్సవం గురించి ఆయన అభిప్రాయాలను రికార్డు చేశారు.

రాష్ట్రపతి కాన్వాయ్‌ రావడంతో..
వడోదరా విమానాశ్రయం నుంచి అవార్డుల ప్రదానోత్సవం జరిగే స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ – సర్దార్‌ పటేల్‌ విగ్రహం ఉన్న ఏక్తానగర్‌ (కేవడియా) వరకు దారి పొడుగునా నేషనల్‌ అవార్డుల ప్రదానోత్సవం తాలూకు కటౌట్లు కనిపించాయి. మూడు రోజుల గుజరాత్‌ పర్యటనకు వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సైతం సోమవారం సాయంత్రమే కేవడియాకు తన కాన్వాయ్‌లో రావడంతో ఆమెకు దారి ఇవ్వడం కోసం పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను ఆపేయడం కనిపించింది. రాష్ట్రపతి సుదీర్ఘ కాన్వాయ్‌ శరవేగంతో దూసుకుపోయిన చాలా సేపటి తర్వాత వాహనాలను ఆ దారిలో అనుమతించ లేదు. ఫలితంగా, సినీ ప్రముఖులు ప్రయాణిస్తున్న వాహనాలు సైతం రోడ్డు పక్కనే ఆగి, నిరీక్షించక తప్పలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement