‘ఆర్ఎక్స్ 100’తో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో కార్తికేయ గుమ్మకొండ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. తన పుట్టినరోజు సందర్భంగా ‘కమ్‌బ్యాక్’ అనే కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాతో హీరోగా నటించడంతో పాటు తొలిసారి దర్శకుడిగానూ కార్తికేయ మెగాఫోన్ పట్టారు. కార్తికేయ హీరోగానే కాకుండా టాలీవుడ్ హీరో నానీ నటించిన 'గ్యాంగ్ లీడర్’, తమిళ నటుడు అజిత్‌తో ‘వలిమై’ వంటి చిత్రాల్లో నటించి విలనిజంతోనూ మెప్పించాడు. కథానాయకుడిగా రెండేళ్ల విరామం తర్వాత సరికొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆయన సతీమణి లోహితా రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన గ్లింప్స్‌లో కార్తికేయ బాక్సర్‌గా పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించారు. ‘బాక్సింగ్ వరల్డ్‌లో తన పేరు వినిపించి మూడేళ్లవుతోంది. ఇట్ ఫీల్స్ లైక్ సూసైడ్ మిషన్’ అంటూ సాగే వాయిస్ ఓవర్ గ్లింప్‌కు ప్రత్యేక ఆకర్శనగా నిలిచింది. బాక్సింగ్ ప్రాక్టీస్, స్కిప్పింగ్ సన్నివేశాలతో గ్లింప్స్ ఆసక్తికరంగా సాగింది. విజయ్ బుల్గానిన్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది.
సరస్వతి శుక్లా సమర్పిస్తున్న ఈ చిత్రానికి జగదీశ్ చీకటి సినిమాటోగ్రఫీ, కళ్యాణ్ సూర్యప్రకాష్ ఎడిటింగ్ అందిస్తున్నారు. సూర్య ఆకెళ్ల క్రియేటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.


