ద్వారక థీమ్‌లో నీటి అడుగున వినాయకుడు.. భారీగా జనం క్యూ.. | Shivdi Cha Raja Celebrates 75th Year With Underwater Dwarka Theme | Sakshi
Sakshi News home page

ద్వారక థీమ్‌లో నీటి అడుగున వినాయకుడు.. భారీగా జనం క్యూ..

Sep 21 2026 9:57 AM | Updated on Sep 21 2026 10:05 AM

Shivdi Cha Raja Celebrates 75th Year With Underwater Dwarka Theme

ముంబై: ముంబైలోని ప్రసిద్ధ గణేశ మండపాల్లో ఒకటైన శివ్డీ చా రాజా (Shivdi Cha Raja).. ఈ వినాయక చవితికి 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. నిర్వాహకులు నీటి అడుగున కొలువైన పురాతన ద్వారకా నగరం థీమ్‌తో భారీ మండపాన్ని ఏర్పాటు చేశారు. గత 75 ఏళ్లుగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టిన కమిటీ నిర్వాహకులు ఈ ఏడాది భక్తులకు సరికొత్త అనుభూతిని అందించాలనే సంకల్పంతో ఈ వినూత్న మండపాన్ని తీర్చిదిద్దారు.
 

గోమతి నది, అరేబియా సముద్రం మధ్య నీటి గర్భంలో మునిగిపోయిన పౌరాణిక ద్వారకా నగరాన్ని తలపించేలా ఈ మండపాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. వినాయక విగ్రహంతో పాటు కృత్రిమ సముద్ర జీవులు, జలచరాలు, చారిత్రక శిథిలాల నమూనాలను ఏర్పాటు చేసి నీటి అడుగున ఉన్న వాతావరణాన్ని కళ్లకు కట్లినట్లు ఏర్నాటు చేశారు. స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ఈ విభిన్నమైన విజువల్ సెట్టింగ్‌ను ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని ఈ వేదిక భక్తులకు కల్పిస్తోంది.

శివ్డీ చా రాజా దర్శనంతో పాటు ఈ ప్రత్యేక ద్వారకా నగరం ప్రదర్శనను తిలకించేందుకు మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. సాంప్రదాయబద్ధంగా మొత్తం 11 రోజుల పాటు ఈ వినాయకుడి ప్రతిమ మండపంలోనే పూజలందుకుంటుంది. ద్వారకా నమూనా ప్రత్యేక ప్రదర్శనను ప్రతిరోజూ మధ్యాహ్నం 12:00 గంటల నుండి సాయంత్రం సుమారు 6:00 లేదా 7:00 గంటల వరకు సందర్శకుల కోసం తెరిచి ఉంచుతున్నారు.

ఈ నీటి అడుగున ద్వారకా ప్రదర్శన రూపకల్పనకు కమిటీ నిర్వాహకులు ఎంతో కష్టపడ్డారు. ప్లాటినం జూబ్లీ ఉత్సవాల సందర్భంగా దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులకు సరికొత్త అనుభూతిని పంచాలన్న పట్టుదలతో ఈ సవాలును స్వీకరించామని, శివ్డీ చా రాజా ఆశీస్సులతో ఈ భారీ ప్రాజెక్ట్ విజయవంతమైందని కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్ జాదవ్ తెలిపారు.

ఇదీ చదవండి: ఎల్‌ నినోకు చెక్‌.. గణపయ్యల నిమజ్జనానికి సరికొత్త విధానం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement