తల్లితో ఆసుపత్రి నిర్వాహకులు
సాక్షి, చెన్నై: చెన్నైలోని మైలాపూర్‌లో ఉన్న విధై బర్తింగ్ సెంటర్ అండ్ హాస్పిటల్ అరుదైన రికార్డును నమోదు చేసింది. ఒక గర్భిణి తొలిసారిగా నీటిలో ప్రసవం పొందింది. తల్లి కోరికలను పరిగణనలోకి తీసుకుని, భద్రత , గౌరవానికి ప్రాధాన్యతనిస్తూ ప్రసవ సంరక్షణ అందించినట్లు ఆసుపత్రి వ్యవస్థాపకురాలు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జె. నందిని తెలిపారు. శనివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ... నీటిలో ప్రసవం అనేది ఒక పద్ధతి.
దీనిలో వైద్యపరంగా ఆరోగ్యంగా ఉన్న గర్భిణి ప్రసవ సమయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటే, ప్రత్యేకంగా రూపొందించిన గోరువెచ్చని నీటి కొలనులో బిడ్డకు జన్మనిస్తుంది. ఇది ప్రసవ సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి , సౌకర్యవంతమైన భంగిమలలో కదలడానికి అవకాశం కల్పిస్తుందన్నారు. అయితే, ఈ పద్ధతి గర్భిణులందరికీ అనుకూలమైనది కాదని, వైద్య బృందం తల్లి , బిడ్డ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించిన తర్వాత మాత్రమే నీటిలో ప్రసవం నిర్వహిస్తారన్నారు. అవసరమైన సమయంలో వైద్య సహాయం అందించడానికి కూడా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.


