దేశ రాజకీయాల్లో జెన్‌జీ చుట్టూ కొత్త ఫోకస్ కనిపిస్తోంది. విద్యార్థులు, యువత సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వరుస కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. ‘చత్రోన్ కీ గూంజ్’ వేదికగా విద్య, ఉద్యోగాలు, పోటీ పరీక్షలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేస్తున్నారు. దీంతో యువతను చేరుకోవడంపై అధికార, ప్రతిపక్ష శిబిరాల్లోనూ కసరత్తు మొదలైంది.
ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా యువతతో మరింతగా మమేకం కావాలని ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. కేబినెట్ భేటీలతో పాటు తరచూ జరుగుతున్న పార్టీ సమావేశాల్లోనూ ఎంపీలకు, నేతలకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవడంతో పాటు.. ఇన్‌స్టాగ్రామ్, రీల్స్ వంటి డిజిటల్ వేదికల ద్వారా జెన్‌జీకి దగ్గర కావాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే.. రాహుల్ గాంధీకి మోదీ ‘తురుపుముక్క’గా భావిస్తున్న చిరాగ్ పాస్వాన్ నుంచి కౌంటర్‌కు రంగం సిద్ధమైంది.
ఎన్డీయే మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) తాజా జెన్‌జీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ (రామ్‌విలాస్) అధినేత చిరాగ్ పాస్వాన్ యూత్ బోలె తో(Youth Bole To) పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ యువత కార్యక్రమాలకు కౌంటర్ అనే చర్చ జోరందుకుంది.

తొలి కార్యక్రమ ఉద్దేశం ఏంటంటే..
పాట్నాలోని వెటర్నరీ గ్రౌండ్‌లో ‘Youth Bole To’ తొలి కార్యక్రమం జరగనుంది. ఇందులో చిరాగ్ పాస్వాన్ బిహార్ యువతతో, ముఖ్యంగా జెన్‌జీ ప్రతినిధులతో నేరుగా మాట్లాడనున్నారు. విద్య, ఉద్యోగాలు, స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, టెక్నాలజీ, డిజిటల్ యుగంలో ఎదురవుతున్న సవాళ్లపై యువతతో చర్చించనున్నారు.
యువత తమ ప్రశ్నలు, అభిప్రాయాలు, సూచనలను నేరుగా చిరాగ్ ముందుంచేలా కార్యక్రమాన్ని రూపొందించారు. పార్టీ బిహార్ అధ్యక్షుడు సురేంద్ర వివేక్ మాట్లాడుతూ.. యువతను ఓటుబ్యాంకుగా చూడటం లేదని, వారి సమస్యలు, ఆకాంక్షలను తెలుసుకుని వాటిపై చర్చించడమే తమ ఉద్దేశమని తెలిపారు.
రాహుల్ ఫోకస్.. ఎన్డీయేలో కదలిక
ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీ విద్యార్థులు, యువతతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ‘చత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమాల్లో విద్య, ఉద్యోగాలు, పోటీ పరీక్షలు, యువత భవిష్యత్తు వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూ.. యువత సమస్యలను రాజకీయ చర్చలోకి తీసుకొస్తున్నారు. ఒకానొక దశలో ఇవి విమర్శలకు దారి తీస్తున్నప్పటికీ.. యువతను ఆకర్షిస్తున్నాయనే చర్చా నడుస్తోంది. దీంతో జెన్‌జీని ఎవరు ఎలా చేరుకుంటారన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. అటు రాహుల్ గాంధీ ప్రత్యక్ష కార్యక్రమాలతో యువతను కలుస్తుండగా.. ఇటు మోదీ ప్రభుత్వం డిజిటల్ వేదికలపై దృష్టి పెడుతోంది. ఇప్పుడు ఎన్డీయే తరఫున చిరాగ్ పాశ్వాన్ ప్రత్యక్షంగా జెన్‌జీతో సంభాషించేందుకు ప్రత్యేక వేదికను సిద్ధం చేస్తున్నారు.
బిహార్ నుంచి యూపీకి..
చిరాగ్ వ్యూహం బిహార్‌తోనే ఆగడం లేదు. సెప్టెంబర్ 24న పాట్నా.. ఆ తర్వాత సెప్టెంబర్ 27న ప్రయాగ్‌రాజ్‌లో తదుపరి ‘Youth Bole To’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆ తర్వాత యూపీలోని ఇతర నగరాల్లోనూ యువతను కలిసే కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇక్కడే ఎన్నికల లెక్కలు కూడా తెరపైకి వస్తున్నాయి.
బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్న సమయంలో చిరాగ్ తన సొంత పార్టీకి యువతలో మరింత కనెక్ట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు 2027లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా యువతను చేరుకునే కార్యక్రమాలు పార్టీ విస్తరణకు ఉపయోగపడే అవకాశం ఉంది. అదే సమయంలో ఎన్నికలు జరగబోయే ఇతర రాష్ట్రాల్లోనూ ఈ తరహా కౌంటర్ కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ, మిత్రపక్షాలకు ఢిల్లీ హైకమాండ్ సూచించినట్లు తెలుస్తోంది.
యువతే టార్గెట్.. కొత్త వ్యూహం
బిహార్‌లో మొదలై యూపీకి విస్తరించనున్న ఈ కార్యక్రమం ద్వారా చిరాగ్ లాంటి యువనేతతో.. యువతతో నేరుగా మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్య, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, టెక్నాలజీ వంటి అంశాలపై జెన్‌జీతో చర్చించనున్నారు. మరోవైపు ఎన్డీయే కూడా యువతను చేరుకునే ప్రయత్నాలకు ప్రాధాన్యత ఇస్తోంది.
రాహుల్ గాంధీ జెన్‌జీతో మమేకమవుతూ యువత సమస్యలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న సమయంలో.. అధికార పక్షం కూడా యువతను చేరుకునేందుకు వివిధ మార్గాలను అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలోనే చిరాగ్ పాస్వాన్ ‘Youth Bole To’ కార్యక్రమంతో రంగంలోకి దిగుతున్నారు.
మోదీ తురుపుముక్కగా చిరాగ్ పాస్వాన్‌ను రాజకీయ వర్గాల్లో కొందరు అభివర్ణిస్తున్న నేపథ్యంలో.. ఆయన చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా బిహార్ నుంచి యూపీ వరకు జెన్‌జీని ఆకట్టుకునేలా ప్రత్యక్ష కార్యక్రమాలు నిర్వహించడం.. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయే వ్యూహంలో భాగంగానే రాజకీయ వర్గాలు చూస్తున్నాయి.


