డబుల్‌ బెడ్రూం ఇళ్ల మీకొద్దంటే..ఇతరులకిస్తాం | Last chance for double bedroom house beneficiaries | Sakshi
Sakshi News home page

డబుల్‌ బెడ్రూం ఇళ్ల మీకొద్దంటే..ఇతరులకిస్తాం

Sep 21 2026 7:35 AM | Updated on Sep 21 2026 7:35 AM

Last chance for double bedroom house beneficiaries

సాక్షి, హైదరాబాద్‌: ‘డబుల్‌ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులకు చివరి అవకాశం..  మూడేళ్ల క్రితం కేటాయించిన ఇళ్లకు తాళాలు వేసి.. రెండు విడతల నోటీసులకు సైతం స్పందించనివారికి హౌసింగ్‌ శాఖ చివరి అల్టిమేటం ఇచ్చింది. ఆదివారం బహిరంగ ప్రకటన ద్వారా నోటీసు జారీ చేసింది. వారం రోజుల్లోగా ఇళ్లలోకి రాకపోతే కేటాయింపులను శాశ్వతంగా రద్దు చేస్తాం. అర్హులైన పేదలకు కేటాయిస్తామని బహిరంగ నోటీసులో స్పష్టం చేసింది’ క్యూర్‌ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాల పరిధిలో  గత ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన డబుల్‌ బెడ్రూం సముదాయాల్లోని సుమారు పదిశాతానికిపైగా ఇళ్లకు ఇంకా తాళాలు పయి. మొత్తం ఇళ్లలో సుమారు  30 శాతం ఖాళీగా ఉన్నట్లు వెలుగులోకివచ్చింది.

ఈ ఇళ్లలో నివాసం ఉండకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన హౌసింగ్‌ శాఖ ఇప్పటికే లబ్ధిదారులకు రెండు విడతలుగా నోటీసులు జారీ చేసింది. ఇందులో 20 శాతం లబ్ధి కుటుంబాలు మాత్రమే స్పందించడంతో  ఆదివారం హైదరాబాద్‌ జిల్లాలో మూడోసారి బహిరంగ నోటీసుల ప్రకటన ఇచ్చింది. ఏడు రోజుల్లో లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇళ్లల్లోకి చేరి నివాసం ఉండాలని ఆదేశించింది. నిర్దేశిత కాలపరిమితి దాటినా ఇళ్లలోకి మారకపోతే కేటాయింపులను రద్దు చేస్తామని తేల్చిచెప్పింది. వాటిని అర్హులైన పేద కుటుంబాలకు కేటాయిస్తామని స్పష్టం చేసింది. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

ఇందిరమ్మ టవర్స్‌ ఇళ్ల కేటాయింపు నేటినుంచి.. 
క్యూర్‌ పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్‌ లబ్ధిదారులకు ఎల్‌ఐజీ ఇళ్ల కేటాయింపు (అలాట్‌మెంట్‌) లెటర్లుæ సోమవారం నుంచి జారీ చేస్తున్నట్లు ఆదివారం హౌసింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్, ఎండీ వీపీ గౌతమ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన లబ్ధిదారుల రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్లకు ఎస్‌ఎంఎస్, వాట్సాప్‌ ద్వారా అలాట్‌మెంట్‌ లెటర్లు నేరుగా పంపిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ హౌసింగ్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లోనూ వీటిని అందుబాటులో ఉంచనున్నట్లు  తెలిపారు. 

నేడు రాయదుర్గంలో భూమి పూజ
శేరిలింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి రాయదుర్గంలో ఇందిరమ్మ టవర్స్‌ ఇళ్ల నిర్మాణానికి సోమవారం గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూమిపూజ చేయనున్నట్లు వీపీ గౌతమ్‌ పేర్కొన్నారు.  

విలువైన భూముల్లో..  
గ్రేటర్‌లో అత్యధిక స్థిరాస్తి విలువలు నమోదవుతున్న రాయదుర్గం–నాలెడ్జ్‌ సిటీ  ప్రాంతంలో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణంపై హర్షం వ్యక్తమవుతోంది. ఇక్కడ ఇటీవల వేలంలో ఎకరం భూమి రూ.264 కోట్ల నుంచి రూ.269 కోట్లు పలికింది. ఈ లెక్కన ఇందిరమ్మ టవర్స్‌ ప్రాజెక్టు కోసం వినియోగిస్తున్న 2.85 ఎకరాల విలువ రూ.752 కోట్ల నుంచి రూ.767 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇంత విలువైన ప్రధాన ప్రాంతంలో ఏర్పాటు చేసే టవర్‌లో ఒక్కొక్కటి సుమారు 528 చ.అ. విస్తీర్ణంతో 480 ఫ్లాట్లు నిర్మించనున్నారు. సాధారణ మార్కెట్‌లో సమానమైన ఫ్లాట్‌ విలువ సుమారు రూ.50 లక్షల కంటే అధికమే. ప్రభుత్వం మాత్రం కేవలం రూ.ఆరు లక్షలకే (మిగతా రూ.5 లక్షలు సబ్సిడీ) ఇళ్లు ఇవ్వడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement