హైదరాబాద్: మూడేళ్ల పసివాడి నవ్వులు అర్ధంతరంగా ఆగిపోయాయి. అమ్మానాన్నల కళ్లెదుటే కారు రూపంలో మృత్యువు కబళించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. ఐఎస్ సదన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ సంతోష్‌నగర్ కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మొహియుద్దీన్ దంపతులు తమ మూడేళ్ల కుమారుడు ఇజ్వానుద్దీన్‌తో కలిసి శనివారం రాత్రి ఐఎస్ సదన్ చౌరస్తాలోని ఓ హోటల్‌కు పార్శిల్ తెచ్చుకునేందుకు వెళ్లారు.
రాత్రి 10.55 గంటల సమయంలో ఒకవైపు తండ్రి, మరోవైపు తల్లి ఉండటంతో బాలుడు అటూ ఇటూ తిరుగుతూ.. రోడ్డు దాటుతుండగా మితిమీరిన వేగంతో కారు దూసుకొచ్చి బాలుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుమారుడిని తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఒవైసీ ఆసుపత్రికి తరలించారు. బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో గుండెలసేలా రోదించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.


