లగ్జరీ కారులో మంటలు ఎలా చెలరేగాయి? | Khammam Doctor Kasakurthi Jagadish Car Accident Latest Update | Sakshi
Sakshi News home page

లగ్జరీ కారులో మంటలు చెలరేగడంపై పోలీసుల ఆరా

Sep 21 2026 1:35 PM | Updated on Sep 21 2026 1:43 PM

Khammam Doctor Kasakurthi Jagadish Car Accident Latest Update

దగ్ధమైన కారును పరిశీలిస్తున్న పోలీసులు. ఇన్‌సెట్‌లో జగదీశ్‌ (ఫైల్‌)

రోడ్డు ప్ర‌మాదంలో ఖ‌మ్మం వైద్యుడు దుర్మ‌ర‌ణం

అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టిన కారు

ఖమ్మం నుంచి హైదరాబాద్‌ వెళుతుండగా, పిల్లలమర్రి వద్ద ఘటన

మంటల్లో కాలిపోయిన కారు... గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహం

ఖమ్మం టోల్‌గేట్‌ వద్ద సీసీఫుటేజీ ఆధారంగా గుర్తింపు

సూర్యాపేటటౌన్‌/ఖమ్మం అర్బన్‌ : కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఇనుప రెయిలింగ్‌ను ఢీకొనడంతో మంటలు వ్యాపించి అందులో ప్రయాణిస్తున్న డాక్టర్‌ సజీవ దహనమయ్యారు. ఈ ఘటన సూర్యాపేట మండలం పిల్లలమర్రి సమీపంలో ఆదివారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం సుంకువారిగుంట గ్రామానికి చెందిన వైద్యుడు కాసుకుర్తి జగదీశ్‌(50) ఇరవై ఏళ్లుగా ఖమ్మంలోని మమత ఆస్పత్రిలో న్యూరో సర్జన్‌గా పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. ఆయన భార్య సుమప్రీతి హైదరాబాద్‌లోని సురభి మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జగదీశ్‌ భార్య, పిల్లలు హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. వారం లేదా 15 రోజులకు ఒకసారి కుటుంబ సభ్యులను కలిసేందుకు జగదీశ్‌ హైదరాబాద్‌కు వెళ్తుంటారు.

కుమార్తె పుట్టినరోజుకు వెళ్తూ.. 
సోమవారం జగదీశ్‌ కుమార్తె పుట్టినరోజు ఉండటంతో ఆదివారం ఉదయం 6 గంటల సమీపంలో ఆయన ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు కారులో బయల్దేరారు. మార్గమధ్యలో పిల్లలమర్రి సమీపంలో ఖమ్మం–హైదరాబాద్‌ హైవేపై ఫ్లైఓవర్‌ ఎక్కుతుండగా కారు అదుపుతప్పి పక్కనే ఉన్న ఇనుప రెయిలింగ్‌ను ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల రైతులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే కారు పూర్తిగా కాలిపోగా.. జగదీశ్‌ సజీవ దహనమయ్యారు.

జగదీశ్‌ మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో పోలీసులు వాహనం వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కొత్త కారు కావడంతో ఇంకా నంబర్‌ ప్లేటు కూడా లేదు. దీంతో ఖమ్మం రహదారిపై ఉన్న టోల్‌గేట్‌ వద్ద వాహనాన్ని గుర్తించి, అందులో డాక్టర్‌ జగదీశ్‌ ప్రయాణిస్తున్నట్టు పోలీసులు నిర్ధారించుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని సూర్యాపేట ఆస్పత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

పోలీసుల ఆరా..
అత్యంత ఖరీదైన కారులో మంటలు చెలరేగడంపై పోలీ సులు దర్యాప్తు చేస్తున్నారు. అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఈ కారు రెయిలింగ్‌ను ఢీకొన్న సమయంలో ఇంధనం, విద్యుత్‌ వ్యవస్థలో ఏదైనా సమస్య తలెత్తిందా అని పరిశీలిస్తున్నారు. వాహనం పూర్తిగా దగ్ధం కావడంతో ప్రమాదానికి ముందు కారులో ఏదైనా సాంకేతిక సమస్య ఏర్పడిందా అనే అంశంతోపాటు ప్రమాదానికి ముందు కారు వేగం, డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయిన పరిస్థితుల పైనా ఆరా తీస్తున్నారు.

బాలాజీ–సరోజిని దంపతులకు నాలుగో సంతానంగా జగదీశ్‌ జన్మించారు. తండ్రి రైల్వే కూలీగా, తల్లి దినసరి కూలీగా పనిచేస్తుండగా, అన్నయ్య, అక్కయ్యలు సైతం వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించే వారు.  జగదీశ్‌  ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఉపాధ్యాయులు, శ్రేయోభి లాషుల సహకారంతో వైద్యవిద్య పూర్తిచేశారు.  

వినాయకుడిని సాగనంపి.. పేషెంట్‌ను చూసి..
డాక్టర్‌ జగదీశ్‌ శనివారం రాత్రి వరకు వైద్యులు, విద్యార్థులతో కలిసి వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. ఉత్సాహంగా నృత్యం చేశారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో అత్య వసర కేసు రావడంతో ఆస్పత్రికి వెళ్లి రోగిని పరిశీలించారు. సోమవారం ఆపరేషన్‌ చేస్తానని రోగి కుటుంబీకులకు చెప్పారు. ఇంతలోనే ప్రమాదం జరిగింది. దీనికి నిద్రమత్తు కారణమా అన్న చర్చ జరుగుతోంది.  

ఖరీదైన కారు.. అయినా దక్కని ప్రాణం
సురక్షిత ప్రయాణం కోసం సుమారు రూ.1.20 కోట్లు వెచ్చించి రెండు నెలల క్రితమే డాక్టర్‌ జగదీశ్‌ ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు సహచరులు తెలిపారు. అయితే అదే కారులో జరిగిన ప్రమాదం ఆయన ప్రాణాలను కాపాడలేకపోయిందని పలువురు వైద్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రమాదం ఎలా జరిగిందన్న పూర్తి వివరాలు అధికారిక దర్యాప్తులో తేలాల్సి ఉంది.

డాక్టర్‌ జగదీశ్‌ భార్య, కుమార్తెలను ఓదార్చిన డాక్టర్లు
డాక్టర్‌ జగదీశ్‌ బాబు మృతదేహంతో మమత ఆసుపత్రి ప్రాంగణానికి వచ్చిన డాక్టర్‌ భార్య, ఇద్దరుకుమార్తెలను పలువురు డాక్టర్లు ఓదార్చారు. ఇంతటి ఘోరం జరగడం ఎంతో బాధకరం అని పలువురు వారికి తమ సంతాపం వ్యక్తం చేశారు.

వేలాదిమందితో అంతిమయాత్ర
సూర్యాపేటలో పోస్టుమార్టం అనంతరం డాక్టర్‌ జగదీశ్‌బాబు మృతదేహాన్ని ఖమ్మానికి తీసుకొచ్చారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వైద్యులు నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి మమత ఆసుపత్రి వరకు అంతిమయాత్ర నిర్వహించారు. వేలాదిమంది వైద్యులు, వైద్య విద్యార్థులు, ఆసుపత్రి సిబ్బంది, జగదీశ్‌బాబు వద్ద వైద్యం పొందిన రోగులు, వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ అంతిమయాత్రలో పాల్గొన్నారు. మమత ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మమత వైద్య విద్యాసంస్థల కార్యదర్శి పువ్వాడ జయశ్రీ తదితరులు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైద్యులు, విద్యార్థులు డాక్ట‌ర్ జగదీశ్‌ పార్థీవ‌దేహాన్ని సందర్శించి కన్నీటి వీడ్కోలు పలికారు. కుటుంబ సభ్యుల రోదనలు, సహచర వైద్యుల కన్నీళ్లతో ఆసుపత్రి ప్రాంగణంలో తీవ్ర విషాదం అలుముకుంది.

పేదల గుడిసెల వద్దకు వెళ్లి వైద్యం
ఒంగోలు టౌన్‌: నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన డాక్టర్ కాసుకుర్తి జగదీశ్‌ కసితో ఉన్నత శిఖరాలు అందుకున్నారు. అయినప్పటికీ తన మూలాలను మరిచిపోకుండా పేదలకు వైద్య సేవలందించారు. వైద్యాన్ని వ్యాపారంగా కాకుండా ప్రజా సేవగా తలచిన డాక్టర్‌ జగదీశ్‌పేదల గుడిసెల వద్దకు వెళ్లి వైద్య చికిత్సలు చేశారని ప్రజా సంఘాల నాయకులు చెబుతున్నారు. 

ఇదీ చ‌ద‌వండి: మిస్ట‌రీ డాక్ట‌ర్ ఎక్క‌డ‌?

అణగారిన ప్రజల బాధలను తన బాధగా భావించి నిరుపేదలకు అండగా నిలిచిన డాక్టర్‌ జగదీశ్‌ మరణం సామాన్య ప్రజలకు తీరని లోటని సీపీఐఎంఎల్‌ న్యూడెమక్రసీ రాష్ట్ర నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు సంతాపం తెలిపారు. కొత్తపట్నం మండలం నుంచి వచ్చిన తొలి వైద్యుడు జగదీష్‌ మతి పట్ల శ్రీరాం సూపర్‌ స్పెషాలిటీ హాస్పటల్ ఎండీ డాక్టర్‌ చాపల వంశీకష్ణ నివాళులు అర్పించారు. నిరుపేదలకు వైద్యం చేయడంలో డాక్టర్‌ జగదీశ్‌ ముందుండేవారని, సామాజిక సేవాతో వ్యవహరించే ఆయన మరణం బాధకలిగిస్తుందన్నారు. చిన్నవయసులోనే నూరేళ్లు నిండిన డాక్టర్‌ జగదీశ్‌కు పలువురు వైద్యులు  నివాళులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement