పెద్దపల్లి జిల్లా: తనను ప్రేమించి మరొకరితో చనువుగా ఉండడాన్ని సహించలేని పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్ జెట్టి నవీన్‌కుమార్.. పథకం ప్రకారమే యువతి తాండ్ర అక్షితరాణి (20)ని ఆత్మహత్యకు ప్రేరేపించి ఆపై మృతి చెందేవరకూ ప్లాన్ అమలు చేసినట్లు పోలీసులు తేల్చారు. నిన్నటివరకూ ఆత్మహత్య చేసుకున్నట్లు అందరూ భావించారు. కానీ, పోలీసుల దర్యాప్తులో హత్యగానే తేలింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ రాంరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని లెనిన్‌నగర్‌కు చెందిన అక్షితరాణి 2022లో మంచిర్యాల జిల్లా సీసీ నస్పూర్‌లోని సింగరేణి పాలిటెక్నిక్‌లో చదివింది. ఆ సమయంలో కాంట్రాక్ట్ లెక్చరర్ నవీన్‌కుమార్‌తో సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారింది. నవీన్‌కుమార్‌కు అప్పటికే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నా.. అక్షితరాణిని పెళ్లి చేసుకునే వరకూ తీసుకెళ్లాడు. కానీ, డిప్లొమా పూర్తయ్యాక ఆమె హైదరాబాద్‌లో బీటెక్ మైనింగ్ చదువుతూ జీడీకే–2వ గనిలో అప్రెంటిషిప్ చేసింది. ఈక్రమంలో ఓవర్‌మన్ బొమ్మకంటి రవికుమార్‌తో పరిచయం ఏర్పడి నవీన్‌కుమార్‌కు దూరంగా ఉంటూ వస్తోంది. దీంతో అసూయ పెంచుకున్న నవీన్‌కుమార్ ఆమెను హత్య చేయాలని పకడ్బందీ పథకం రచించాడు.
ఈనెల12న గౌతమినగర్‌లోని ఓ కంప్యూటర్ సెంటర్‌లో అక్షితరాణి విధులు ముగించుకుని ఆటోలో వెళ్తుండగా ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్డు వద్ద అడ్డగించి కారులో ఎక్కించుకుని వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ గొడవ పడ్డాడు. రవికుమార్ తనపై అత్యాచారం చేయడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ప్రేరేపించి సూసైడ్ నోట్ రాయించాడు. అప్పటికే తన వద్ద సిద్ధంగా ఉంచుకున్న పురుగుల మందును బలవంతంగా తాగించాడు. స్పృహ కోల్పోయిన యువతిని ఆస్పత్రికి తరలించకుండా అనేక ప్రాంతాల్లో తిప్పి కావాలనే జాప్యం చేశాడు. చివరకు యువతి ఫోన్‌నుంచి ఆమె తండ్రికి ఫోన్‌కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించేందుకు యత్నించాడు. రాత్రి సుమారు 7.30 సమయంలో యువతిని ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రులను కారులో ఎక్కించుకుని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్షితరాణి చికిత్స పొందుతూ ఈనెల 13న మృతి చెందింది.
ఆధారాలు చెరిపేసే యత్నం
యువతి మృతితో తన విషయం బయటపడుతుందనే భయంతో నవీన్‌కుమార్ ఆధారాలను ధ్వంసం చేసేందుకు యత్నించాడు. కారు శుభ్రం చేయడం, సూసైడ్‌నోట్, పురుగులమందు బాటిల్, మొబైల్ సిమ్‌లు తొలగించాడు. అనంతరం హైదరాబాద్‌కు పారిపోయాడు. అయితే కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. సీసీ కెమెరా ఫుటేజీలు, కాల్‌డేటా, కాల్‌రికార్డింగ్స్ తదితర సాంకేతిక ఆధారాలు విశ్లేషించి నవీన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత విచారణ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
రవికుమార్‌పై ఆరోపణలపైనా దర్యాప్తు
జీడీకే–2 గని ఓవర్‌మన్ రవికుమార్‌తో అక్షితరాణికి పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇష్టానికి విరుద్ధంగా శారీరక సంబంధానికి పాల్పడ్డాడు. దీంతో సింగరేణి అధికారులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో రవికుమార్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమావేశంలో గోదావరిఖని ఏసీపీ రమేశ్, సీఐ ఇంద్రసేనారెడ్డి, రెండో సీఐ అఫ్జలుద్దీన్, ఎస్‌ఐ మనోహర్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అక్క వివాహేతర సంబంధం చెల్లికి తెలియడంతో..


