సహిల్‌ కేసులో ట్విస్ట్‌.. ఐఐటీ బాంబే క్షమాపణ! | IIT Bombay Student Row: IIT Takes U Turn Apologises for Earlier Statement | Sakshi
Sakshi News home page

సహిల్‌ కేసులో ట్విస్ట్‌.. ఐఐటీ బాంబే క్షమాపణ!

Sep 21 2026 12:45 PM | Updated on Sep 21 2026 1:00 PM

IIT Bombay Student Row: IIT Takes U Turn Apologises for Earlier Statement

విద్యార్థి మృతి ఘటనపై ఐఐటీ బాంబే యూటర్న్‌ తీసుకుంది. తొలుత ఈ ఘటనకు సంబంధించిన పరిణామాలపై పలు వివరాలు వెల్లడించిన యాజమాన్యం.. ఇప్పుడు ఆ స్టేట్‌మెంట్‌పై క్షమాపణలు కోరింది. దర్యాప్తు పూర్తికాకముందే నిర్ధారణ కాని విషయాలను తమ ప్రకటనలో పేర్కొనడం తమ తప్పిదమే అని ఒప్పుకుంది. ఘటనకు సంబంధించిన వాస్తవాలు అధికారుల దర్యాప్తులో తేలాల్సి ఉన్నందున.. అప్పటివరకు ఏ విషయం అనేది నిర్ధారణకు రావడం సరికాదని వ్యాఖ్యానించింది.

ఐఐటీ బాంబేలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్న 20 ఏళ్ల సహిల్‌ వాకోడే సెప్టెంబర్‌ 18న పరీక్ష రాసిన కొద్దిసేపటికే హాస్టల్‌ గదిలో మృతిచెందాడు. పరీక్ష సమయంలో మొబైల్‌ ఫోన్‌(చాట్‌జీపీటీ) వినియోగించాడన్న ఆరోపణలు రావడం, ఆ తర్వాత అధ్యాపకులు అతడితో మాట్లాడటం వంటి పరిణామాలను ఐఐటీ బాంబే తన తొలి ప్రకటనలో వెల్లడించింది. అయితే ఆ ఘటనలకు, సహిల్‌ మృతికి మధ్య సంబంధం ఏమిటన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంతకు ముందు ఇచ్చిన ప్రకటనను వెనక్కి తీసుకుంటూ ఐఐటీ బాంబే క్షమాపణలు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎవరీ సహిల్‌ వాకోడే?
మహారాష్ట్రలోని యవత్మాల్‌కు చెందిన సహిల్‌ వాకోడే ఐఐటీ బాంబేలో ఎనర్జీ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో రెండో సంవత్సరం బీటెక్‌ చదువుతున్నాడు. చదువులోనూ మంచి ప్రతిభ కనబరిచేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. తొలి ఏడాదిలో అతడికి 8.5 సీజీపీఏ వచ్చింది. బ్యాడ్మింటన్‌, స్కేటింగ్‌లోనూ చురుకుగా పాల్గొనేవాడు. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక సివిల్‌ సర్వీసెస్‌కు సిద్ధం కావాలని భావించేవాడని అతడి తల్లి తెలిపారు.

పరీక్షలో అసలేం జరిగింది?
తోటి విద్యార్థులు చెబుతున్న వివరాల ప్రకారం.. సెప్టెంబర్‌ 18న సహిల్‌కు రెండు పరీక్షలు ఉన్నాయి. రెండో పరీక్ష సందర్భంగా అతడి వద్ద మొబైల్‌ ఫోన్‌ ఉన్నట్లు గుర్తించినట్లు ఐఐటీ బాంబే తెలిపింది. పరీక్ష ప్రశ్నపత్రాన్ని మొబైల్‌ ద్వారా ChatGPTలో అప్‌లోడ్‌ చేసి సమాధానాలు పొందేందుకు ప్రయత్నించాడని సంస్థ తన తొలి ప్రకటనలో పేర్కొంది. పరీక్ష పర్యవేక్షకుడిగా ఉన్న ప్రొఫెసర్‌ సూర్యనారాయణ దుల్లా అతడిని బయటకు తీసుకెళ్లి మాట్లాడినట్లు కుటుంబం, విద్యార్థుల వర్గాలు తెలిపాయి.

అయితే ఐఐటీ బాంబే ప్రకారం సహిల్‌పై ఎలాంటి అధికారిక క్రమశిక్షణ చర్యలు ప్రారంభించలేదు. అధ్యాపకులు, విభాగాధిపతి అతడితో మాట్లాడి కౌన్సెలింగ్‌ ఇచ్చారని.. ఈ ఘటన అతడి విద్యా భవిష్యత్తుపై ప్రభావం చూపదని హామీ ఇచ్చారని సంస్థ తెలిపింది. ఆ తర్వాత సహిల్‌ హాస్టల్‌ గదికి వెళ్లాడు. సాయంత్రం అతడు మృతిచెందినట్లు గుర్తించారు.

కుటుంబం సంచలన ఆరోపణలు
అయితే సహిల్‌ తల్లిదండ్రులు మాత్రం వేరే ఆరోపణలు చేశారు. క్యాంపస్‌లో కుల వివక్షకు గురయ్యాడని, కొంతకాలంగా ప్రొఫెసర్‌ సూర్యనారాయణ దుల్లా తనను కులపరంగా వేధిస్తున్నారని సహిల్‌ తమకు చెప్పేవాడని తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పరీక్ష ఘటనకు ముందు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయని కుటుంబం ఆరోపించింది. ఈ ఆరోపణలను ఐఐటీ బాంబే యాజమాన్యం ఖండించింది. సహిల్‌గానీ,  అతడి కుటుంబం తమ SC/ST సెల్‌కు ఇలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిపింది.

FIR.. క్రైమ్‌ బ్రాంచ్‌కు కేసు
సహిల్‌ తండ్రి ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు ప్రొఫెసర్‌ దుల్లాతో పాటు మరికొందరిపై ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణల కింద కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ (Prevention of Atrocities) చట్టం కింద కూడా సెక్షన్లు చేర్చారు. అనంతరం ఈ కేసును ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌కు అప్పగించారు. సహిల్‌ తల్లిదండ్రులు మృతదేహాన్ని స్వీకరించేందుకు నిరాకరించింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేయడంతో పోలీసులు దర్యాప్తును క్రైమ్‌ బ్రాంచ్‌కు అప్పగించేందుకు అంగీకరించారు.

క్యాంపస్‌లో మూడు రోజుల ఆందోళన
ఘటనపై ఐఐటీ బాంబే విద్యార్థులు భారీగా ఆందోళనకు దిగారు. స్వతంత్ర దర్యాప్తు కోరుతూ.. ప్రొఫెసర్‌ దుల్లాపై చర్యలు, విద్యార్థుల మానసిక ఆరోగ్య సేవలను బలోపేతం చేయడం, అధ్యాపకుల ప్రవర్తనపై మార్గదర్శకాలు వంటి పలు డిమాండ్లు చేశారు. మూడు రోజుల ఆందోళన తర్వాత విద్యార్థులు ఉంచిన 18 డిమాండ్లపై యాజమాన్యం అంగీకారం తెలిపినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.

ఎవరీ ప్రొఫెసర్‌ దూల్లా?
ఐఐటీ బాంబే ఎనర్జీ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ సూర్యనారాయణ దూల్లా పవర్‌ సిస్టమ్స్‌, స్మార్ట్‌ గ్రిడ్స్‌, మైక్రోగ్రిడ్స్‌పై పరిశోధనలు చేస్తున్నారు. నాగార్జున యూనివర్సిటీలో బీటెక్‌, ఐఐటీ బాంబేలో ఎంటెక్‌, ఐఐటీ ఢిల్లీలో పీహెచ్‌డీ చేశారు. ఐఐటీ బాంబేలో ప్రొఫెసర్‌గా పనిచేయడంతోపాటు హాస్టల్‌ వార్డెన్‌, డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ అఫైర్స్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. సహిల్‌ పరీక్ష రాసిన సమయంలో దూల్లా ఇన్విజిలేటర్‌గా ఉన్నారు. ప్రస్తుతం సహిల్‌ కుటుంబం చేసిన ఆరోపణలతో ఆయన పేరు కేసులో నమోదైంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. 

డైరెక్టర్‌ రాజీనామాకు సిద్ధమా?
ప్రతిష్టాత్మక వర్సిటీలో జరిగిన పరిణామాల మధ్య డైరెక్టర్‌(ఐఐటీ బాంబే) ప్రొఫెసర్‌ శిరీష్‌ కేదారే రాజీనామా చేయడానికి సిద్ధమని వెల్లడించినట్లు పలు కథనాలు వెలువడ్డాయి. విద్యార్థులతో జరిగిన సుదీర్ఘ సమావేశంలో వారి డిమాండ్లపై చర్చించి పలు అంశాలకు(18!) అంగీకారం తెలిపినట్లు సమాచారం. అయితే అధ్యాపకుల వర్గం మాత్రం ప్రొఫెసర్‌ దుల్లాకు మద్దతుగా నిలిచినట్లు సమాచారం. ఆయన పరీక్షా పర్యవేక్షకుడిగా తన బాధ్యతలను నిబంధనల ప్రకారమే నిర్వర్తించారని పేర్కొంది.

తాజాగా ఐఐటీ బాంబే యూటర్న్‌
ఈ మొత్తం వ్యవహారంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థి మృతికి ముందు జరిగిన పరిణామాలపై తాము విడుదల చేసిన తొలి ప్రకటనలో వివరాలను పేర్కొనడం సరికాదని ఐఐటీ బాంబే తాజాగా క్షమాపణలు చెప్పింది. ఘటనకు దారితీసిన పరిస్థితులు ఇంకా సంబంధిత అధికారుల దర్యాప్తులోనే ఉన్నాయని.. అవి అధికారికంగా నిర్ధారణ కాకముందే వాటిని వివరించడం లేదా ఒక నిర్దిష్టంగా వర్ణించడం తగదని స్పష్టం చేసింది. దీంతో దర్యాప్తుపై ఉత్కంఠ నెలకొంది.

ఇదీ చదవండి: ఐఐటీ ఘటన: ఆ కీలక డిమాండ్లు ఏంటంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement