breaking news
anant nag
-
ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తులను ప్రచారం చేయొద్దు
‘‘దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సినీ నటులకు దేశ ప్రజలను, ముఖ్యంగా యువతను ప్రభావితం చేసే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. స్టార్స్ క్రమశిక్షణతో కూడిన జీవన శైలి ప్రాముఖ్యత గురించి మాట్లాడితే... ప్రజలు ఆసక్తిగా వింటారు. ఆ మాటలను, వాళ్లను అనుకరిస్తారు. అందుకే భారతదేశంలో ఉన్న అగ్ర శ్రేణి సినీ తారలందరికీ సూచిస్తున్నాను. ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులను ప్రచారం చేయవద్దు... సపోర్ట్ చేయవద్దు. స్టార్ అంటే వెలుగుని పంచేవాళ్లు... చీకటిని కాదు’’ అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రతిష్ఠాత్మక జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం గుజరాత్‌లోని ఏక్తా నగర్లో జరిగింది. ప్రతి ఏడాది ఢిల్లీలో జరిగే ఈ జాతీయ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఈసారి గుజరాత్లో నిర్వహించారు. ఈ ఏడాది జూలై 18న 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాల విజేతలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024 ఏడాదికిగాను ఎంపిక చేసిన ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు రాష్ట్రపది ద్రౌపది ముర్ము పురస్కారాలతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. జ్యూరీలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలిఈ అవార్డుల ప్రదానోత్సవంలో ద్రౌపది ముర్ము ఇంకా మాట్లాడుతూ – ‘‘ఒక సినిమా నిర్మాణానికి ఎంతో మంది కృషి ఉంటుంది. అవార్డులు గెలుచుకున్న విజేతలను నేను కోరేదేంటంటే... మీరు అవార్డులు గెలుచుకునేందుకు కారకులైన మీ చిత్రబృందంలోని సభ్యులందరికీ నా అభినందనలను తప్పక తెలియజేయండి. మీరందరూ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు (క్రియేటివ్ ఎకానమీ) ప్రముఖ ప్రతినిధులు. ఈ ఆర్థిక వ్యవస్థకు సహకరిస్తున్న సినీ కార్మికులు, చిన్న కళాకారులు, సహాయకులు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులకు గౌరవం, సామాజిక భద్రత లభించాలనే విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోవాలి. ఈ రోజు అవార్డులు స్వీకరించిన కళాకారుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. కాబట్టి అవార్డుల జ్యూరీ ప్యానెల్లో కూడా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఏ రంగంలోనైనా మహిళల ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వివిధ భాషలు, ప్రాంతాలకు చెందిన చిత్రాలతో ఈ ప్రాంగణంలో అంతర్లీనంగా భారతీయత స్ఫూర్తి కనిపిస్తోంది’’ అని అన్నారు.72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని సీనియర్ నటుడు అనంత్ నాగ్ అందుకున్నారు. జాతీయ ఉత్తమ నటుడి విభాగంలో ఇద్దరు నటులు మమ్ముట్టి (భ్రమయుగం), కార్తీక్ ఆర్యన్ (చందు ఛాంపియన్), ఉత్తమ నటి అవార్డును యామీ గౌతమ్ (ఆర్టికల్ 370), ఉత్తమ చిత్రం విభాగంలో ఇదే సినిమాకి నిర్మాత ఆదిత్య ధర్, ‘అమరన్’ చిత్రానికి దర్శకుడి అవార్డుని రాజకుమార్ పెరియసామికి ప్రదానం చేశారు. తెలుగు సినిమాకు 9 అవార్డులు లభించాయి. జాతీయ స్థాయిలో సకుటుంబ వినోదం అందించి, ప్రజాదరణ పొందిన ఉత్తమ చిత్రంగా ఎంపికైన ప్రభాస్ ‘కల్కి’ నిర్మాత సి. అశ్వినీదత్, దర్శకుడు నాగ్ అశ్విన్ అవార్డులు అందుకున్నారు. అలాగే ఉత్తమ బాలల చిత్రం ‘35... చిన్న కథ కాదు’ నిర్మాత సృజన్ ఎర్రబోలు, (మరో నిర్మాత – నటుడు విశ్వదేవ్ రాచకొండ), దర్శకుడు నంద కిశోర్ ఈమని అవార్డులు అందుకున్నారు. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా డైరెక్టర్ సుకుమార్ (‘పుష్ప–2’), ఉత్తమ సంభాషణల రచయితగా దర్శకుడు వెంకీ అట్లూరి (‘లక్కీ భాస్కర్’) పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ బాల నటుడు (అరుణ్ దేవ్పోతుల – ‘35 చిన్న కథ కాదు’), ఉత్తమ ప్రోడక్షన్ డిజైన్ (నితిన్ జిహానీ చౌధరీ – ‘కల్కి’), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ (దీపాలీ నూర్, శీతల్ ఇక్బాల్ చంద్ శర్మ – ‘పుష్ప2’), ఉత్తమ మేకప్ (పసుపులేటి రవికుమార్ – ‘కమిటీ కుర్రోళ్ళు’) కేటగిరీల్లోనూ పురస్కారాలు అందుకున్నారు.ఈ అవార్డు నా ఒక్కడిది మాత్రమే కాదు!– దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారగ్రహీత అనంత్ నాగ్‘‘ఈ సందర్భంగా నటుడిగా నా 50 ఏళ్ల ప్రయాణంలో నాకు తోడుగా నిలిచినవారందరినీ గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. ఈ అవార్డు కేవలం నా ఒక్కడిదే కాదు. నాతో అవిశ్రాంతంగా పని చేసిన ప్రతి నిర్మాత, దర్శకుడు, సంభాషణల కథారచయిత, గీత రచయిత, ఛాయాగ్రాహకుడు, కాస్ట్యూమ్ డిజైనర్, మేకప్ ఆర్టిస్ట్, ప్రోడక్షన్ మేనేజర్, సహాయకులు మరియు సహచరులందరికీ చెందుతుంది. ఐదున్నర దశాబ్దాలుగా నా పాత్రలను మనసుతో ఆదరించిన లక్షలాది మంది ప్రేక్షకులకు కూడా చెందుతుంది’’ అని దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారగ్రహీత అనంత్ నాగ్ భావోద్వేగంగా ప్రసంగించారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘గతంలో దాదాపు ఐదేళ్ల కాలంలో సుమారు 50 నాటకాలలో నటించాను. అవే నా నటనకు శిక్షణా వేదికగా నిలిచాయి. ఆ తర్వాత నాకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ముందు కన్నడలో, ఆపై శ్యామ్ బెనెగల్, ఎం.ఎస్. సత్యు వంటి ప్రముఖ దర్శకుల చిత్రాల్లో హిందీలోనూ నటించాను. కర్ణాటకలో అద్భుతమైన అవకాశాలు లభించాయి. అందుకే బెంగ ళూరులో స్థిరపడాలనుకున్నా. అదే నా ‘కర్మభూమి’గా మారింది. గత 50 ఏళ్లల్లో ఇతర భాషల్లోనూ ఎన్నో సినిమాలు చేశాను. కానీ నాకు అత్యుత్తమ అవకాశాలు, నటనకు మంచి గుర్తింపు కన్నడ చిత్రాల ద్వారా లభించాయి. నా నటనా ప్రతిభ పట్ల అక్కడి వారికి ఉన్న గౌరవం కారణంగా నేను కర్ణాటకకు రాయబారిగా వెళ్లాను’’ అని అనంత్ నాగ్ అన్నారు.ఈ అవార్డు మా ఆవిడదే! – ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత అవార్డు అందుకున్న దర్శకుడు సుకుమార్ ఈ అవార్డు వేడుకకు సతీమణి తబితతో కలిసి హాజరయ్యారు సుకుమార్. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ– ‘‘మా సినిమాను దేశవ్యాప్తంగా ఎంతమంది ఇష్టపడ్డారో ఇక్కడ చూస్తుంటే మరోసారి అర్థమైంది. అందరి కష్టంతో రూ పొందిన ఓ భారీ సినిమాకు వాణిజ్య విజయంతో పాటు పురస్కారాలు సైతం రావడం ఎప్పుడూ ఆనందమే ఇస్తుంది. గతంలో ‘పుష్ప’కు అవార్డులు వచ్చాయి. అయితే ‘పుష్ప–2’కి ఇది నాకు వ్యక్తిగతంగా వచ్చిన తొలి నేషనల్ అవార్డు కావడం నా కన్నా నా సతీమణికి ఎక్కువ సంతోషాన్నిచ్చింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకొని వేదిక దిగాక ఆ అవార్డు మా ఆవిడ చేతిలోనే పెట్టాను. ఆమె కళ్ళల్లో ఆనందం కోసమే ఈ శ్రమంతా. అందుకే, ఈ అవార్డు నాది కాదు... నన్ను సహించి, భరించి, నిత్యం నన్ను ్రపోత్సహించే మా ఆవిడది’’ అని వ్యాఖ్యానించారు.తెలుగు విజేతల ఆనంద దృశ్యం అవార్డు విజేతలుగా నిలిచిన తెలుగు సినీ ప్రముఖులు పరస్పరం అభినందించుకుంటూ, రెడ్ కార్పెట్ ఏరియా వద్ద ప్రత్యేకంగా ఫోటోలు దిగారు. ప్రధాన జ్యూరీలో ఉన్న దర్శకుడు వి.ఎన్. ఆదిత్యను సైతం కలుపుకొని, కెమెరా ముందు తమ చేతుల్లోని అవార్డులను ప్రదర్శించడం ఫోటో ఆఫ్ ది డేగా మారింది. నటి, ‘కమిటీ కుర్రోళ్ళు’ నిర్మాత నిహారిక కొణిదెల తోటి అవార్డు విజేతలతో కలసి ఫోటోలు దిగడమే కాక, మరింత ప్రోఫెషనల్‌గా ఫోటోలు తీస్తానంటూ దర్శకులందరినీ నిలబెట్టి, తానే స్వయంగా ఆ ఆనంద క్షణాలను ఫోన్లోని కెమెరాలో బంధించారు.గుజరాత్లో జరిగిన 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. 2024 ఏడాదికిగాను ఎంపిక చేసిన ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు రాష్ట్రపది ద్రౌపది ముర్ము పురస్కారాలతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురి విజేతల స్పందన ఈ విధంగా... ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడం చాలా గౌరవంగా ఉంది. నా జీవితకాలం గుర్తుండిపోయే గొప్ప గౌరవం ఇది. నాతో పాటు కొన్నేళ్లుగా నటుడిగా నా పనిని చూస్తూ, సపోర్ట్ చేస్తూ, సెలబ్రేట్ చేసుకుంటూ, కనెక్ట్ అయి ఉన్న అందరికీ ఈ అవార్డు చెందుతుంది. నా ప్రయాణంలో భాగమైన అందరికీ ధన్యవాదాలు. – మమ్ముటీఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. యాక్టర్ అవుతానంటే మన వైపు చూసి నవ్వే వాతావరణం ఉన్న గ్వాలియర్ అనే చిన్న పట్టణం నుంచి వచ్చిన ఒక సాధారణ వ్యక్తిగా ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు నవ్వు వస్తోంది. యాక్టర్‌గా ఎదిగే ధైర్యం చేశాను. దేశంలోని ప్రతి నటుడి కల... జాతీయ ఉత్తమ యాక్టర్‌గా నిలవాలని. ఫైనల్‌గా ఇప్పుడు ఒక మంచి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.భారతదేశపు మొట్టమొదటి పారాలింపిక్ స్వర్ణ పతక విజేత మురళీకాంత్ పేట్కర్ సార్ జీవితం ఆధారంగా రూ పొందిన ‘చందు ఛాంపియన్ ’ సినిమాలో నటించే అవకాశం కల్పించిన మురళీకాంత్ పెట్కర్, దర్శకుడు కబీర్ ఖాన్ , నిర్మాత సాజిద్గార్లకు ధన్యవాదాలు. భారతదేశంలో ఉన్న ప్రతి పారా ఒలింపియన్ తో నా ఈ గౌరవాన్ని పంచుకుంటున్నాను. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముగారికి, జ్యూరీకి, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు. మరిన్ని మైలురాళ్లను చేరుకునే నా ప్రయాణంలో ఇదొక ఆరంభమని భావిస్తున్నాను. – కార్తీక్ ఆర్యన్‘‘ప్రతి ప్రయాణంలోనూ, మనం ఆ ప్రయాణాన్ని ఎందుకు వదిలిపెట్టకూడదో గుర్తుచేసే ఒక క్షణం ఉంటుంది. ఈ రోజు నాకు అలాంటి క్షణమే. ‘ఆర్టికల్ 370’ చిత్రానికి ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం అందుకోవడం అనేది నా జీవితాంతం నేను గుర్తుపెట్టుకునే ఒక గొప్ప గౌరవం. ‘ఆర్టికల్ 370’ సినిమా కథను నేను ఎంతో నమ్మాను. మా నిర్మాణ సంస్థలో ఈ సినిమాను నిర్మించినందువల్ల ఈ గుర్తింపు నాకు మరింత భావోద్వేగంగా అనిపిస్తోంది. నీ ప్యాషన్ ను వదులుకోకుండా పట్టుదలగా ఉన్నప్పుడే కలలు నిజం అవుతాయి. తమ కలను నిజం చేసుకోవాలని కల కనే ప్రతి ఒక్కరికోసం ఈ అవార్డు. ఎప్పటికీ నమ్మకాన్ని కోల్పోకండి. ఇక ఈ పురస్కారం ఒక కలకి ముగింపు కాదు, ఇది ఒక గొప్ప బాధ్యతకు నాంది. 14 సంవత్సరాలుగా నా వత్తికి కట్టుబడి, నా నటననే మాట్లాడేలా ప్రయత్నించాను. ఎన్నో సంవత్సరాలుగా నా హృదయంలో నేను మోస్తున్న కల ఇది. ఈ రోజు ఎంతో కృతజ్ఞతతో ఈ అవార్డును స్వీకరిస్తున్నాను’’ అంటూ సోషల్‌మీడియా వేదికగా ఓ సుధీర్ఘమైన నోట్‌ను షేర్ చేశారు యామీగౌతమ్. -
పురస్కారాల ఎంపిక విధానంపై అనంత్ నాగ్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్‌కు 2024 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లభించనుంది. ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో సేవలందించిన ఆయనకు భారతీయ సినిమాకు అందించిన విశిష్ట సేవలకు ఈ అత్యున్నత సినీ పురస్కారం ప్రకటించారు. సెప్టెంబరు 22న గుజరాత్‌లోని కెవాడియాలో జరిగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రదానోత్సవంలో ఈ అవార్డును అందజేయనున్నారు.అవార్డు ప్రకటన అనంతరం పీటీఐతో మాట్లాడిన అనంత్ నాగ్.. సినీ పురస్కారాల ఎంపిక విధానంలో బంధుప్రీతి, పక్షపాతం ఉండేవని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల భాగస్వామ్యాన్ని తీసుకురావడం ద్వారా ఆ విధానాన్ని మార్చారని పేర్కొన్నారు. తమకు నచ్చిన వ్యక్తి పేరును ప్రజలు సిఫారసు చేయాలని మోదీ కోరడం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. ఈ విధానం ద్వారా అవార్డుల ఎంపిక ప్రక్రియను ప్రజల ముందుకు తీసుకువచ్చారని వివరించారు.దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం తనకు వస్తుందని తాను ఊహించలేదని 79 ఏళ్ల అనంత్ నాగ్ తెలిపారు. ఈ పురస్కారాన్ని తన స్వస్థలమైన కర్ణాటక ప్రజలకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. అవార్డును ప్రకటించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అనంత్ నాగ్ 250కిపైగా చిత్రాల్లో నటించారు. కన్నడతో పాటు హిందీ చిత్రాల్లోనూ గుర్తింపు పొందారు. 1973లో ‘సంకల్ప’తో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన ‘అంకుర్’, ‘నిశాంత్’, ‘మంథన్’, ‘భూమిక’, ‘కల్యుగ్’, ‘గెహ్రాయీ’ వంటి చిత్రాల్లో నటించారు. దూరదర్శన్‌లో ప్రసారమైన ‘మాల్గుడి డేస్’లోనూ కీలక పాత్ర పోషించారు.ఇదీ చదవండి: మోదీ 76వ పుట్టినరోజు: వారణాసిలో భారీ ఎత్తున సంబరాలు -
అంకుర్ నుంచి ఫాల్కే వరకు...
ఆయన కళ్లల్లో ఒక తెలియని తీక్షణత ఉంటుంది... ఆయన నటనలో అతిశయోక్తులు లేని సహజత్వం ఉట్టిపడుతుంది. కమర్షియల్ సినిమాల్లో నవ్వులు పూయించాలన్నా, క్లాసిక్ ఆర్ట్ సినిమాల్లో గుండెల్ని పిండేసే అభినయం పండించాలన్నా అది కేవలం ఆయనకే సాధ్యం. ఆయనే కన్నడ చలనచిత్ర అరుదైన నవరత్నం,భారతీయ సినీ యవనికపై ఐదు దశాబ్దాలుగా వెలుగుతున్న నటుడు అనంత్ నాగ్. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ ప్రకటించడం దక్షిణ భారతానికి దక్కిన మరో సమున్నత గౌరవం.శ్యామ్ బెనగళ్ తెలంగాణ ప్రాంతపు కథతో సినిమా మొదలెట్టాడు. అనంత్ నాగ్, షబానా ఆజ్మీలు ముఖ్యపాత్రలు. దానికి వర్కింగ్ టైటిల్‌గా ‘సీడ్లింగ్’ (మొలక) అని పేరు పెట్టుకున్నాడు. కాని తీస్తున్నది హిందీలో. మంచి టైటిల్ ఏం పెట్టాలో తోచడం లేదు. సీడ్లింగ్కు సరిపోలిన టైటిల్ చెప్పిన వారికి వెయ్యి రూపాయల నజరానా ప్రకటించాడు. అనంత్ నాగ్ ఆయనతో ఒకరోజు బెరుగ్గానే చెప్పాడు... ‘సార్ సీడ్లింగ్కు సరైన హిందీ మాట అంకుర్’... భారతీయ సినిమాలో ‘అంకుర్’ ఎంత పెద్ద ప్రభావపూరిత సినిమాయో ఆ సినిమాలో నటించిన అనంత్ నాగ్ కాలక్రమంలో అంతే ప్రభావపూరిత నటుడిగా అవతరించాడు. నట మహావృక్షమై దాదాసాహెబ్ ఫాల్కే వరకూ ఎదిగాడు. అనంత్ నాగ్‌కు మొదటి నుంచి పాత్రే ముఖ్యం. ‘అంకుర్’లో లీడ్ రోల్లో నటించిన అనంత్ నాగ్ ఆ వెంటనే ‘నిశాంత్’కు వచ్చేసరికి పనికిమాలిన పోరంబోకు పాత్రలో కనిపిస్తాడు. భూస్వామి కొడుకుగా అకృత్యాలు చేసే పాత్ర అది. ఆ తర్వాత బెనగళ్ తీసిన ‘మంథన్’లో గ్రామీణ అమ్మాయిని వల్లో వేసుకునే పాత్ర. ఇవన్నీ అందరూ అంగీకరించేవి కావు. 1978లో శ్యామ్ బెనగళ్ తీసిన ‘అనుగ్రహం’లో వాణిశ్రీ భర్తగా దారీ తెన్నూ లేని పాత్రలో నటించాడు. ఆ సమయంలోనే కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమలేఖలు’లో విలన్‌గా నటించాడు. ‘ఇది తీయని వెన్నెల రేయి... మది వెన్నెల కన్నా హాయి’... జయసుధతో డ్యూయెట్ పాడాడు. అనంత్ నాగ్, గిరీష్ కర్నాడ్ ఇద్దరూ ఒకే సాంస్కృతిక మూలాల నుంచి వచ్చారు. అనంత్ నాగ్ మొదటి కన్నడ నాటకం గిరీష్ కర్నాడ్ రాసిన క్లాసిక్ ‘యయాతి’. ముంబైలో ఈ నాటకాన్ని ప్రదర్శించినప్పుడు యయాతికి తన యవ్వనం ఇచ్చి వృద్ధుడిగా మారే కొడుకు పాత్రలో అనంత్ నాగ్ అద్భుతంగా నటించాడు. ఆ నటనను చూసి ముగ్ధుడైన గిరీష్ కర్నాడ్, ప్రముఖ దర్శకుడు జి.వి. అయ్యర్‌కు సిఫార్సు చేస్తే అనంత్ నాగ్‌కు లభించిన మొదటి కన్నడ సినిమా ‘సంకల్ప’ (1973). హిందీలో ఎంత బిజీగా ఉన్నా అనంత్ నాగ్ తన మాతృ పరిశ్రమ శాండల్‌వుడ్‌ను వదల్లేదు. వైవిధ్యమైన పాత్రలతో ఐదుసార్లు కర్ణాటక రాష్ట్ర ఉత్తమ నటుడి అవార్డును, ఆరుసార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకోవడం కన్నడ సినిమాపై ఆయనకున్న అపారమైన ప్రభావానికి నిదర్శనం. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అద్భుత నటిగా పేరు తెచ్చుకున్న లక్ష్మి (‘మిథునం’ ఫేమ్), అనంత్ నాగ్ల కాంబినేషన్ సౌత్ సినిమాలోనే అత్యంత విజయవంతమైన జోడీగా నిలిచింది. కన్నడలో వీరిద్దరూ కలిసి నటించిన ‘చందనద గొంబె’ వంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్స్ అయ్యాయి. స్క్రీన్ వెలుపల కూడా వీరు మంచి స్నేహితులు. దూరదర్శన్ లో సంచలనం సృష్టించిన ‘మాల్గుడి డేస్’ (1987) క్లాసిక్ సిరీస్ మేకింగ్, ప్రొడక్షన్ పనుల్లో తమ్ముడు శంకర్ నాగ్‌కు అనంత్ నాగ్ వెన్నెముకగా నిలిచాడు. నేటి తరం ప్రేక్షకులకు ఆయన ‘కెజీఎఫ్ చాప్టర్1’ లోని కథ చెప్పే జర్నలిస్ట్ పాత్రతో పూనకాలు తెప్పించాడు. అలాగే నితిన్ నటించిన ‘భీష్మ’ చిత్రంలో ఆర్గానిక్ ఫార్మింగ్ కంపెనీ హెడ్‌గా, ‘గోధి బన్న సాధారణ మైకట్టు’లో అల్జీమర్స్ పేషెంట్‌గా చూపిన నట విశ్వరూపం నేటి యూత్‌ని ఫిదా చేసింది. అనంత్ నాగ్ సమాజం పట్ల అవగాహన ఉన్న మేధావి. రాజకీయాల్లో చురుగ్గా ఉన్నాడు. జేహెచ్ పటేల్ ప్రభుత్వంలో కర్ణాటక క్యాబినెట్ మంత్రిగా (బెంగళూరు నగర అభివృద్ధి శాఖ) కూడా ఆయన సేవలందించాడు. వెండితెరపై ఎందరో హీరోయిన్లతో రొమాన్స్ పండించి చాక్లెట్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న అనంత్ నాగ్‌ది రియల్ లైఫ్‌లోనూ లవ్ మ్యారేజే. తన సహ నటి గాయత్రిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు అదితి అనే కుమార్తె ఉంది. లైమ్‌లైట్‌కు, వెండితెరకు దూరంగా పెరిగిన అదితి పెళ్లి చేసుకుని, భర్త వివేక్‌తో కలిసి బెంగళూరులోనే సెటిల్ అయ్యారు. ‘సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, అది సమాజానికి అద్దం పట్టే మాధ్యమం’ అని నమ్మిన అతికొద్ది మంది నటుల్లో అనంత్ నాగ్ ఒకరు. 1973లో థియేటర్ ఆర్టిస్ట్‌గా మొదలైన ఆయన ప్రయాణం, ఇవాళ భారతీయ సినిమా అత్యున్నత శిఖరమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ వద్దకు చేరింది. ఏనాడూ ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా తన పర్సనల్ లైఫ్‌ను ఎంతో హుందాగా నడిపించిన అనంత్ నాగ్ ఎగరేసిన నట బావుటా రాబోయే తరాల నటులకు చుక్కాని. అనంత్ నాగ్ పూర్తి పేరు అనంత్ నాగర్కట్టె. తండ్రి సదానంద్, తల్లి ఆనంది. వీరిది కొంకణ కుటుంబం. అనంత్ నాగ్ బాల్యమంతా సంస్కృత భజనల, భక్తి పాటల మధ్య సాగింది. ఉడుపిలో 7వ తరగతి పూర్తయ్యాక తండ్రి అనంత్ నాగ్ని బాంబేకి చదువుకోవడానికి పంపాడు. అయితే అక్కడి ఇంగ్లిష్ మీడియంతో అనంత్ నాగ్ అవస్థ పడి పదితో చదువు ఆపేశాడు. కొన్నాళ్లు యూనియన్ బ్యాంక్‌లో టెంపరరీ ఉద్యోగం చేశాడు. ఆ సమయంలోనే బాంబేలోని ప్రభాకర్ ముదూర్, వెంకట్రావు తలేగేరి, సత్యదేవ్ దూబె వంటి నాటకరంగ దిగ్గజాలు ఆయన్ను గుర్తించి నాటకాల్లో అవకాశం ఇచ్చారు. అనంత్ నాగ్ వేసిన మొదటి పాత్ర చైతన్య మహాప్రభు పాత్ర. ఆ నాటకం సూపర్ హిట్ అవ్వడంతో దాదాపు 8 ఏళ్ల పాటు కొంకణి, కన్నడ, మరాఠీ, హిందీ నాటకాల్లో స్టేజ్ ఆర్టిస్ట్‌గా రాటుదేలాడు.– కె -
ప్రముఖ నటుడు అనంత్ నాగ్‌కు 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు'
సాక్షి,న్యూఢిల్లీ: ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్‌కు భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అత్యున్నత పురస్కారం ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ వరించింది. భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన అందించిన అమూల్యమైన సేవలకు గాను కేంద్రం అనంత్ నాగ్‌ను ఎంపిక చేసింది. ఈ నెల 22న గుజరాత్‌లోని కేవడియాలో జరగనున్న 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో అనంత నాగ్‌కు ఈ అవార్డును ప్రధానం చేయనుంది కన్నడతో పాటు పలు భాషల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరించిన అనంత్ నాగ్‌కు ఈ పురస్కారం దక్కడం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఐదు దశాబ్దాల సినీ ప్రయాణం ఐదు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రయాణంలో కన్నడతో పాటు హిందీ, తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించారు. కేవలం కమర్షియల్ చిత్రాలే కాకుండా, ఆర్ట్ సినిమాల్లోనూ ఆయన కీలక పాత్రలు పోషించారు. ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనెగల్ తెరకెక్కించిన ‘అంకుర్’ చిత్రంతో ఆర్ట్ చిత్రరంగంలోకి అడుగుపెట్టిన ఆయన బైలు దారి,నా నిన్న బిడలారే,గణేశాన మదువె, ఇటీవల వచ్చిన కేజీఎఫ్‌తో పాటు ఎన్నో అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.శంకర్ నాగ్ దర్శకత్వంలో వచ్చిన ప్రఖ్యాత టీవీ సిరీస్ ‘మాల్గుడి డేస్’ లో ఆయన నటన దేశవ్యాప్తంగా అప్పట్లో విశేషమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయనను దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మభూషణ్’తో గౌరవించింది. అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించడం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. Congratulations to the legendary Anant Nag Ji on being conferred the Dadasaheb Phalke Award.For several decades, his effortless performances, remarkable versatility and brilliance have left a very strong mark on Indian cinema, particularly Kannada cinema. In whichever role he…— Narendra Modi (@narendramodi) September 16, 2026


