అంకుర్‌ నుంచి ఫాల్కే వరకు... | Veteran actor Anant Nag five-decade career earns Dadasaheb Phalke Award | Sakshi
Sakshi News home page

అంకుర్‌ నుంచి ఫాల్కే వరకు...

Sep 17 2026 1:15 AM | Updated on Sep 17 2026 1:15 AM

Veteran actor Anant Nag five-decade career earns Dadasaheb Phalke Award

పురస్కారం

ఆయన కళ్లల్లో ఒక తెలియని తీక్షణత ఉంటుంది... ఆయన నటనలో అతిశయోక్తులు లేని సహజత్వం ఉట్టిపడుతుంది.  కమర్షియల్‌ సినిమాల్లో నవ్వులు పూయించాలన్నా, క్లాసిక్‌ ఆర్ట్‌ సినిమాల్లో గుండెల్ని పిండేసే అభినయం పండించాలన్నా అది కేవలం ఆయనకే సాధ్యం. ఆయనే కన్నడ చలనచిత్ర అరుదైన నవరత్నం,
భారతీయ సినీ యవనికపై ఐదు దశాబ్దాలుగా వెలుగుతున్న నటుడు అనంత్‌ నాగ్‌. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ‘దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు’  ప్రకటించడం దక్షిణ భారతానికి దక్కిన మరో సమున్నత గౌరవం.

శ్యామ్‌ బెనగళ్‌ తెలంగాణ ప్రాంతపు కథతో సినిమా మొదలెట్టాడు. అనంత్‌ నాగ్, షబానా ఆజ్మీలు ముఖ్యపాత్రలు. దానికి వర్కింగ్‌ టైటిల్‌గా ‘సీడ్లింగ్‌’ (మొలక) అని పేరు పెట్టుకున్నాడు. కాని తీస్తున్నది హిందీలో. మంచి టైటిల్‌ ఏం పెట్టాలో తోచడం లేదు. సీడ్లింగ్‌కు సరిపోలిన టైటిల్‌ చెప్పిన వారికి వెయ్యి రూపాయల నజరానా ప్రకటించాడు. అనంత్‌ నాగ్‌ ఆయనతో ఒకరోజు బెరుగ్గానే చెప్పాడు... ‘సార్‌ సీడ్లింగ్‌కు సరైన హిందీ మాట అంకుర్‌’... భారతీయ సినిమాలో ‘అంకుర్‌’ ఎంత పెద్ద ప్రభావపూరిత సినిమాయో ఆ సినిమాలో నటించిన అనంత్‌ నాగ్‌ కాలక్రమంలో అంతే ప్రభావపూరిత నటుడిగా అవతరించాడు. నట మహావృక్షమై దాదాసాహెబ్‌ ఫాల్కే వరకూ ఎదిగాడు.
  
అనంత్‌ నాగ్‌కు మొదటి నుంచి పాత్రే ముఖ్యం. ‘అంకుర్‌’లో లీడ్‌ రోల్‌లో నటించిన అనంత్‌ నాగ్‌ ఆ వెంటనే ‘నిశాంత్‌’కు వచ్చేసరికి పనికిమాలిన పోరంబోకు పాత్రలో కనిపిస్తాడు. భూస్వామి కొడుకుగా అకృత్యాలు చేసే పాత్ర అది. ఆ తర్వాత బెనగళ్‌ తీసిన ‘మంథన్‌’లో గ్రామీణ అమ్మాయిని వల్లో వేసుకునే పాత్ర. ఇవన్నీ అందరూ అంగీకరించేవి కావు. 1978లో శ్యామ్‌ బెనగళ్‌ తీసిన ‘అనుగ్రహం’లో వాణిశ్రీ భర్తగా దారీ తెన్నూ లేని పాత్రలో నటించాడు. ఆ సమయంలోనే కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమలేఖలు’లో విలన్‌గా నటించాడు. ‘ఇది తీయని వెన్నెల రేయి... మది వెన్నెల కన్నా హాయి’... జయసుధతో డ్యూయెట్‌ పాడాడు.
  
అనంత్‌ నాగ్, గిరీష్‌ కర్నాడ్‌ ఇద్దరూ ఒకే సాంస్కృతిక మూలాల నుంచి వచ్చారు. అనంత్‌ నాగ్‌ మొదటి కన్నడ నాటకం గిరీష్‌ కర్నాడ్‌ రాసిన క్లాసిక్‌ ‘యయాతి’. ముంబైలో ఈ నాటకాన్ని ప్రదర్శించినప్పుడు యయాతికి తన యవ్వనం ఇచ్చి వృద్ధుడిగా మారే కొడుకు పాత్రలో అనంత్‌ నాగ్‌ అద్భుతంగా నటించాడు. ఆ నటనను చూసి ముగ్ధుడైన గిరీష్‌ కర్నాడ్, ప్రముఖ దర్శకుడు జి.వి. అయ్యర్‌కు సిఫార్సు చేస్తే అనంత్‌ నాగ్‌కు లభించిన మొదటి కన్నడ సినిమా ‘సంకల్ప’ (1973).  
  
హిందీలో ఎంత బిజీగా ఉన్నా అనంత్‌ నాగ్‌ తన మాతృ పరిశ్రమ శాండల్‌వుడ్‌ను వదల్లేదు. వైవిధ్యమైన పాత్రలతో ఐదుసార్లు కర్ణాటక రాష్ట్ర ఉత్తమ నటుడి అవార్డును, ఆరుసార్లు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను అందుకోవడం కన్నడ సినిమాపై ఆయనకున్న అపారమైన ప్రభావానికి నిదర్శనం. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అద్భుత నటిగా పేరు తెచ్చుకున్న లక్ష్మి (‘మిథునం’  ఫేమ్‌), అనంత్‌ నాగ్‌ల కాంబినేషన్‌ సౌత్‌ సినిమాలోనే అత్యంత విజయవంతమైన జోడీగా నిలిచింది. కన్నడలో వీరిద్దరూ కలిసి నటించిన ‘చందనద గొంబె’ వంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌ అయ్యాయి. స్క్రీన్‌ వెలుపల కూడా వీరు మంచి స్నేహితులు.
  
దూరదర్శన్ లో సంచలనం సృష్టించిన ‘మాల్గుడి డేస్‌’ (1987) క్లాసిక్‌ సిరీస్‌ మేకింగ్, ప్రొడక్షన్‌ పనుల్లో తమ్ముడు శంకర్‌ నాగ్‌కు అనంత్‌ నాగ్‌ వెన్నెముకగా నిలిచాడు. నేటి తరం ప్రేక్షకులకు ఆయన ‘కెజీఎఫ్‌ చాప్టర్‌1’ లోని కథ చెప్పే జర్నలిస్ట్‌ పాత్రతో పూనకాలు తెప్పించాడు. అలాగే నితిన్‌ నటించిన ‘భీష్మ’ చిత్రంలో ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ కంపెనీ హెడ్‌గా, ‘గోధి బన్న సాధారణ మైకట్టు’లో అల్జీమర్స్‌ పేషెంట్‌గా చూపిన నట విశ్వరూపం నేటి యూత్‌ని ఫిదా చేసింది. 
  
అనంత్‌ నాగ్‌ సమాజం పట్ల అవగాహన ఉన్న మేధావి. రాజకీయాల్లో చురుగ్గా ఉన్నాడు. జేహెచ్‌ పటేల్‌ ప్రభుత్వంలో కర్ణాటక క్యాబినెట్‌ మంత్రిగా (బెంగళూరు నగర అభివృద్ధి శాఖ) కూడా ఆయన సేవలందించాడు. వెండితెరపై ఎందరో హీరోయిన్లతో రొమాన్స్  పండించి చాక్లెట్‌ బాయ్‌గా పేరు తెచ్చుకున్న అనంత్‌ నాగ్‌ది రియల్‌ లైఫ్‌లోనూ లవ్‌ మ్యారేజే. తన సహ నటి గాయత్రిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు అదితి అనే కుమార్తె ఉంది. లైమ్‌లైట్‌కు, వెండితెరకు దూరంగా పెరిగిన అదితి పెళ్లి చేసుకుని, భర్త వివేక్‌తో కలిసి బెంగళూరులోనే సెటిల్‌ అయ్యారు. 
  
‘సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంట్‌ కాదు, అది సమాజానికి అద్దం పట్టే మాధ్యమం’ అని నమ్మిన అతికొద్ది మంది నటుల్లో అనంత్‌ నాగ్‌ ఒకరు. 1973లో థియేటర్‌ ఆర్టిస్ట్‌గా మొదలైన ఆయన ప్రయాణం, ఇవాళ భారతీయ సినిమా అత్యున్నత శిఖరమైన ‘దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు’ వద్దకు చేరింది. ఏనాడూ ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా తన పర్సనల్‌ లైఫ్‌ను ఎంతో హుందాగా నడిపించిన అనంత్‌ నాగ్‌ ఎగరేసిన నట బావుటా రాబోయే తరాల నటులకు చుక్కాని.          

అనంత్‌ నాగ్‌ పూర్తి పేరు అనంత్‌ నాగర్కట్టె. తండ్రి సదానంద్, తల్లి ఆనంది. వీరిది కొంకణ కుటుంబం. అనంత్‌ నాగ్‌ బాల్యమంతా సంస్కృత భజనల, భక్తి పాటల మధ్య సాగింది. ఉడుపిలో 7వ తరగతి పూర్తయ్యాక తండ్రి అనంత్‌ నాగ్‌ని బాంబేకి చదువుకోవడానికి పంపాడు. అయితే అక్కడి ఇంగ్లిష్‌ మీడియంతో అనంత్‌ నాగ్‌ అవస్థ పడి పదితో చదువు ఆపేశాడు. కొన్నాళ్లు యూనియన్‌ బ్యాంక్‌లో టెంపరరీ ఉద్యోగం చేశాడు. ఆ సమయంలోనే బాంబేలోని ప్రభాకర్‌ ముదూర్, వెంకట్రావు తలేగేరి, సత్యదేవ్‌ దూబె వంటి నాటకరంగ దిగ్గజాలు ఆయన్ను గుర్తించి నాటకాల్లో అవకాశం ఇచ్చారు. అనంత్‌ నాగ్‌ వేసిన మొదటి పాత్ర చైతన్య మహాప్రభు పాత్ర. ఆ నాటకం సూపర్‌ హిట్‌ అవ్వడంతో దాదాపు 8 ఏళ్ల పాటు కొంకణి, కన్నడ, మరాఠీ, హిందీ నాటకాల్లో స్టేజ్‌ ఆర్టిస్ట్‌గా రాటుదేలాడు.

– కె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement