సాక్షి,న్యూఢిల్లీ: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. ఉద్యోగ పెన్షన్ పథకం కింద తప్పనిసరిగా అమలు చేయాల్సిన వేతన పరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఇప్పటివరకు రూ.15వేలుగా ఉన్న ఈ పరిమితిని రూ.25వేలకు పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు దశాబ్ద కాలంగా (సెప్టెంబర్ 2014 నుండి) ఈ పరిమితి రూ.15వేల వద్దే నిలిచిపోగా, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న వేతనాల ఆధారంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంతవరకు ప్రాథమిక వేతనం రూ.15వేల వరకు ఉన్న ఉద్యోగులకు మాత్రమే ఈపీఎఫ్, ఈపీఎస్ పరిధిలోకి రావడం తప్పనిసరిగా ఉండేది. తాజా పెంపుతో బేసిక్ వేతనం రూ.15వేల నుండి రూ.25వేలకు మధ్య ఉన్న ఉద్యోగులు కూడా ఈ ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ పరిధిలోకి వస్తారు. దీనివల్ల ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న మరింత మంది ఉద్యోగులకు సామాజిక భద్రత లభిస్తుంది.
ఉద్యోగులపై ప్రభావం
రూ. 15,000 కంటే ఎక్కువ వేతనం ఉండి ఇప్పటివరకు పీఎఫ్ మినహాయింపు తీసుకోని కొత్త ఉద్యోగులకు, ఇకపై ప్రతి నెలా పీఎఫ్ కింద కొంత మొత్తం కట్ అవుతుంది. దీనివల్ల వారి చేతికి అందే జీతం కొంత తగ్గినప్పటికీ,భవిష్యత్తు కోసం వారి పదవీ విరమణ నిధి పటిష్టంగా మారుతుంది.
పెరిగే పెన్షన్ ప్రయోజనాలు
ఈపీఎస్ పెన్షన్ లెక్కింపులో పరిగణించే గరిష్ట వేతన పరిమితి పెరగడం వల్ల, ఉద్యోగ విరమణ తర్వాత లభించే పెన్షన్ మొత్తం కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
యజమానులపై భారం
కంపెనీలు, యాజమాన్యాలు తమ ఉద్యోగుల తరఫున పీఎఫ్,పెన్షన్‌కు చెల్లించాల్సిన వాటా ఎక్కువ మంది ఉద్యోగులకు వర్తిస్తుంది. దీనివల్ల కంపెనీల జీతాల నిర్వహణ వ్యయం పెరుగుతుంది. గతంలో చివరిసారిగా 2014 సెప్టెంబర్‌లో ఈ వేతన పరిమితిని రూ. 15,000కు పెంచారు. ఈ తాజా నిర్ణయం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ రంగ ఉద్యోగులకు పెద్ద ఊరట లభించనుంది.
ఇదీ చదవండి : ఈపీఎఫ్ సీలింగ్ పెంపు.. జీతంపై ప్రభావం ఎంత?


