తిరుమల తిరుపతిలో పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య రహిత రవాణాకు ప్రోత్సాహం లభించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చేపడుతున్న గ్రీన్ మొబిలిటీ ఉద్యమానికి మద్దతుగా రిలయన్స్ ఫౌండేషన్ 25 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులతో పాటు ప్రత్యేక ఈవీ ఛార్జింగ్ కేంద్రాన్ని విరాళంగా అందజేసింది.
బుధవారం తిరుమలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఈ బస్సులను అధికారికంగా జెండా ఊపి ప్రారంభించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న తరుణంలో భక్తుల రవాణా అవసరాలను తీర్చేందుకు రిలయన్స్ ఈ సర్వీసులు అందించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు.
హామీ నెరవేర్చిన అనంత్ అంబానీ
గత జూన్‌లో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ, కొండపై పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించేందుకు 25 ఎలక్ట్రిక్ బస్సులను ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం, స్వల్ప వ్యవధిలోనే రిలయన్స్ ఫౌండేషన్, టీటీడీ భాగస్వామ్యంతో ఈ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రాజెక్ట్ రిలయన్స్ ఫౌండేషన్, జియో-బీపీ ఉమ్మడి కృషితో సాకారమైంది. రిలయన్స్ ఆర్ధిక సహకారాన్ని అందించగా, జియో-బీపీ సంస్థ అవసరమైన ఈవీ ఛార్జింగ్ వసతులను, సాంకేతిక మౌలిక సదుపాయాలను సమకూర్చింది.
ఈ సందర్భంగా అనంత్ అంబానీ మాట్లాడుతూ, ‘శ్రీ వేంకటేశ్వర స్వామి సేవలో భాగస్వామ్యం కావడం మాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాం. తిరుమల కొండల్లోని గొప్ప జీవవైవిధ్యాన్ని కాపాడుతూ, భక్తుల యాత్రను మరింత సౌకర్యవంతంగా మార్చడమే మా లక్ష్యం’ అని తెలిపారు. సంప్రదాయ ఇంధన వాహనాల వాడకాన్ని తగ్గించి, ఏటా తిరుమలను సందర్శించే కోట్లాది మంది భక్తులకు కాలుష్య రహిత ప్రయాణాన్ని అందించడంలో ఈ నిర్ణయం ఒక మైలురాయిగా నిలవనుంది.
ఇదీ చదవండి: గోల్డ్ లవర్స్‌కి శుభవార్త.. ధరల పతనం


