ఆసియా కుబేరుల జాబితాలో పెద్ద మార్పు నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్ ‘టిక్‌టాక్’ మాతృ సంస్థ బైట్‌డాన్స్ వ్యవస్థాపకుడు ఝాంగ్ యిమింగ్ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా కొత్త రికార్డు సృష్టించారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజాగా వెలువరించిన నివేదిక ప్రకారం, భారత పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీని అధిగమించి యిమింగ్ తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
105 బిలియన్ డాలర్ల మైలురాయి
43 ఏళ్ల ఝాంగ్ యిమింగ్ నికర సంపద ఒక్కసారిగా 105 బిలియన్ డాలర్ల (సుమారు రూ.8.7 లక్షల కోట్లు) మార్కును దాటింది. ఇటీవల బ్లాక్‌రాక్, ఫిడెలిటీ ఇన్‌వెస్ట్‌మెంట్స్ వంటి అంతర్జాతీయ ప్రాజెక్ట్ వ్యాల్యుయేషన్ సంస్థలు బైట్‌డాన్స్ షేర్ల విలువను గణనీయంగా పెంచడంతో యిమింగ్ సంపద కేవలం ఒక్క నెలలోనే 12 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. 2019 మార్చిలో యిమింగ్ సంపద కేవలం 13 బిలియన్ డాలర్లగా ఉండగా, ఇప్పుడు అది ఎనిమిది రెట్లకు పైగా పెరగడం గమనార్హం.
ఏఐ సాంకేతికతతో వృద్ధి
కేవలం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతోనే కాకుండా బైట్‌డాన్స్ సంస్థ ఏఐ విభాగంలోకి అడుగుపెట్టడం యిమింగ్ సంపద పెంపునకు ప్రధాన చోదక శక్తిగా మారింది. బైట్‌డాన్స్ అభివృద్ధి చేసిన ‘దౌబావో’ ఏఐ చాట్‌బాట్, సీడాన్స్ వంటి ఏఐ వీడియో జనరేషన్ టూల్స్ మార్కెట్లో ఊహించని రీతిలో విజయం సాధించాయి.
భారత బిలియనీర్లు
మరోవైపు, భారత పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ సంపద మార్కెట్ స్థిరత్వం లేకపోవడం వల్ల ఇటీవలి కాలంలో కాస్త క్షీణించి రెండో స్థానానికి చేరారు. ముకేశ్ అంబానీ కూడా తదుపరి స్థానాల్లోనే ఉన్నారు. ఆసియాలో ఇప్పటివరకు ఇంధనం, మౌలిక సదుపాయాలు, ఓడరేవులు వంటి సాంప్రదాయ రంగాల నుంచి బిలియనీర్లు అగ్రస్థానంలో నిలవగా ఇప్పుడు సాంకేతికత, ఏఐ-ఆధారిత రంగాలకు చెందిన టెక్ యజమానులు సంపన్నులుగా ఎదగడం గమనార్హం.
ఇదీ చదవండి: ఈపీఎఫ్ సీలింగ్ పెంపు.. జీతంపై ప్రభావం ఎంత?


