‘బయటకు రా’ అంటూ పిలుపు.. ఒక్క కాల్‌తో ముగిసిన టిక్‌టాక్‌ స్టార్‌ కథ! | Pakistani TikTok Star Shamsu Bibi Death Mystery CCTV Footage Viral, Murder Raises Questions Over Threats And Money Dispute | Sakshi
Sakshi News home page

‘బయటకు రా’ అంటూ పిలుపు.. ఒక్క కాల్‌తో ముగిసిన టిక్‌టాక్‌ స్టార్‌ కథ!

Aug 20 2026 8:09 AM | Updated on Aug 20 2026 9:02 AM

Pak TikToker Shamso Bibi Death Mystery Details

సోషల్‌ మీడియాలో ఆమె ఓ స్టార్‌.. లక్షలాది మంది ఆమెను ఫాలో అయ్యారు.. కోట్లాది లైక్స్‌ ఆమె సొంతం. కానీ ఓ ఫోన్‌ కాల్‌ ఆమె జీవితానికి చివరి కాల్‌ అవుతుందని ఎవరూ ఊహించలేదు. “బయటకు రా” అంటూ వచ్చిన పిలుపుతో ఇంటి నుంచి బయలుదేరిన 28 ఏళ్ల పాకిస్థాన్‌ టిక్‌టాక్‌ క్రియేటర్‌ షమ్సో బీబీ.. కొద్ది సేపటికే రక్తపు మడుగులో విగతజీవిగా మారారు. ఇస్లామాబాద్‌ సమీపంలోని టాక్సిలాలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె కారును అడ్డగించి తుపాకీతో కాల్పులు జరిపారు. ఒక్క బుల్లెట్‌ ఆమె మెడలోకి దూసుకెళ్లింది.. కారు అదుపుతప్పి డంపర్‌ను ఢీకొట్టింది.. 13 లక్షల మంది ఫాలో అయ్యే ఆ సోషల్‌ మీడియా స్టార్‌ కథ అక్కడే ముగిసిపోయింది.

ఆన్‌లైన్‌లో అయేషా గిలమానా పేరుతో గుర్తింపు పొందిన షమ్సో బీబీ గత మూడు, నాలుగేళ్లుగా టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ భారీ క్రేజ్‌ సంపాదించారు. ఆమె ఖాతాకు 1.3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు, కోట్లాది లైక్స్‌ ఉన్నాయి. అయితే ఆగస్టు 14న జరిగిన ఈ దాడితో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. 

ఈ ఘటనకు ముందు కాశిఫ్‌ అనే వ్యక్తి షమ్సోకు ఫోన్‌ చేసి ఇంటి బయటకు రావాలని చెప్పినట్లు ఆమె తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆమె తన సోదరి, సోదరుడితో కలిసి కారులో బయలుదేరారు. మార్కెట్‌ సమీపానికి చేరుకోగానే బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారును అడ్డుకున్నారు. వారిలో ఒకరు తుపాకీ తీసి సమీపం నుంచి కాల్పులు జరిపాడు. బుల్లెట్‌ షమ్సో మెడలోకి దూసుకెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులతో డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో కారు డంపర్‌ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె సోదరి కూడా తీవ్రంగా గాయపడ్డారు.

ఈ దాడికి సంబంధించిన CCTV దృశ్యాలు బయటకు వచ్చినట్లు సమాచారం. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారును ఆపడం, ఒకరు తుపాకీ తీసి కాల్పులు జరపడం అందులో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇది యాదృచ్ఛిక దాడి కాదని.. పక్కా ప్లాన్‌తోనే షమ్సోను టార్గెట్‌ చేశారా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇక అసలు ట్విస్ట్‌ ఏంటంటే.. షమ్సోకు ఇప్పటికే ప్రాణహాని బెదిరింపులు వచ్చినట్లు ఆమె తండ్రి చెబుతున్నారు. ఇద్దరు వ్యక్తులు డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆమెను బెదిరించారని ఆరోపించారు. వారిలో ఒకరే హత్య వెనుక ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

ముందే హెచ్చరికలు.. 
ఈ కేసులో పోలీసులు నలుగురు అనుమానితులను అరెస్ట్‌ చేశారు. వారిలో షూటర్‌కు పారిపోవడానికి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కూడా ఉన్నారు. అయితే షమ్సోను చంపాలని ఆదేశించింది ఎవరు? ఆమెను ఇంటి నుంచి బయటకు రప్పించిన ఫోన్‌ కాల్‌ వెనుక ఎవరు ఉన్నారు? డబ్బుల వివాదమే కారణమా? అన్నది ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది.

నిన్నటి వరకు ఆమె వీడియోలతో సందడి చేసిన టిక్‌టాక్‌ ఖాతా ఇప్పుడు లేదు. కుటుంబం ఆమె ఖాతాను తొలగించింది. యూట్యూబ్‌ పేజీ కూడా కనిపించడం లేదని సమాచారం. లక్షలాది మంది ఫాలోవర్లు.. కోట్లాది లైక్స్‌.. ఒక్క ఫోన్‌ కాల్‌తో మొదలైన ప్రయాణం.. బైక్‌పై వచ్చిన రెండు తుపాకీ గుళ్లతో విషాదాంతం. షమ్సో బీబీ హత్య వెనుక అసలు కథేంటన్నదే ఇప్పుడు పాకిస్థాన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement