దుబాయ్: ఫ్లై దుబాయ్ విమాన ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పలుదేశాలు ఇందులో పాలుపంచుకున్నాయి. యూఏఈ నేతృత్వంలోని దర్యాప్తు సంస్థలు నిందితుడైన కో–పైలట్ హమామీ ఉద్దేశాలు, ఇతరులతో అతడికి ఉన్న సంబంధాలపై దృష్టి పెట్టింది. ఒమన్‌కు చెందిన కో–పైలట్‌కు ఆ్రస్టేలియాతో ఉన్న సంబంధాలు, అతడు టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమాన సిబ్బందిలో ఎలా చేరాడనే దానిపై ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ అధికారులు విచారణ జరుపుతున్నారు.
నిందితుడికి ఆస్ట్రేలియాతో ఉన్న సంబంధాలపై ఉగ్రవాద నిరోధక బృందం దర్యాప్తు చేస్తోందని ఆ్రస్టేలియన్ ఫెడరల్ పోలీస్ విభాగం వెల్లడించింది. విమానంలోని కాక్‌పిట్‌లో కో–పైలట్ క్రాష్ గొడ్డలితో కెప్టెన్‌పై దాడి చేసి, విమానంపై నియంత్రణ సాధించడానికి ప్రయత్నించాడని యూఏఈ అటార్నీ జనరల్ హమద్ సైఫ్ అల్ షంసీ పేర్కొన్నారు. కుట్ర కోణం త్వరలో బహిర్గతమయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఫ్లై దుబాయ్ విమాన ఘటనకు ముందు యూఏఈ అధికారులు అందులోని ప్రయాణికులు, సిబ్బంది వివరాలను ఇజ్రాయెల్‌తో పంచుకున్నారని సంబంధిత అధికారులు ఆదివారం తెలిపారు. తీవ్రవాద భావజాలం ఉన్న కో–పైలట్‌ను అతడి సొంత దేశమే విమానం నడపకుండా నిషేధించిందని ఇప్పటికే గుర్తించారు. ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేని ఒమన్ పౌరుడిని, ఇజ్రాయెల్ పౌరులతో నిండిన విమానాన్ని నడపడానికి ఎలా అనుమతించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


